నిజానికి రాజకీయాలే అందరికీ అల్టిమేట్ టార్గెట్ సుఖం… అందరూ అడుగులకు మడుగులొత్తుతారు… పెత్తనం, ఆధిపత్యం, ఆస్తులు, సంపాదన, విలాసాలు, సుఖాలు, అక్రమాలు, అమ్మాయిలు… వాట్ నాట్..? చిటికేస్తే చాలు… చుట్టూ అన్నీ గిరగిరా తిరుగుతాయి… బుర్రలో గుజ్జు లేకపోయినా సరే చెలామణీ కావచ్చు… వాడి భాష, వాడి మొహం, వాడి చదువు, వాడి విజ్ఞత, వాడి సంస్కారం, వాడి గుణం ఎవరికీ అక్కర్లేదు…
సినిమాల్లో కూడా దాదాపు అంతే… డబ్బు, కీర్తి, ఫ్యాన్స్, భజనలు, అమ్మాయిలు, సుఖాలు, విలాసాలు… అన్నీ… కాకపోతే కలిసిరావాలి… కాస్త ముక్కూమొహం బాగుండాలి… కాస్త ఆటపాటా, నటన మన్నూమశానం తెలిసి ఉండాలి… కాదు, కాదు, అదంతా పాత సంగతి… ఇప్పుడు డబ్బుంటే చాలు… హీరో అయిపోవచ్చు… ఆర్థిక నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉంటే చాలు… ముందుగా హీరోయిజం, సినిమాలు అనుభవించేసి, తరువాత రాజకీయాల్లోకి వెళ్లి సెటిలైపోవచ్చు అనుకునేవాళ్లే చాలామంది…
చూశాం కదా… స్టాలిన్ కొడుకు హీరో… కుమారస్వామి కొడుకు హీరో… గల్లా జయదేవ్ కొడుకు హీరో… గాలి జనార్దన్‌రెడ్డి కొడుకు హీరో… తాజాగా ది లెజెండ్ అంటూ థియేటర్లలోకి దూసుకొచ్చిన శరవణన్‌కు రాజకీయ నేపథ్యం ఏమీ లేదు గానీ… డబ్బుంది… రిటెయిల్ సప్లయ్ చెయిన్ సంపాదించిన పెడుతున్న డబ్బు… ఈ సినిమాల తాలూకు పిచ్చి ఉంది… తమ వ్యాపార సంస్థల ప్రమోషన్ వీడియోలు తనే హీరోగా చేశాడు… కానీ సరిపోలేదు… ఫుల్ లెంత్ సినిమాహీరో కావాలి… అదీ పాన్ ఇండియా రేంజ్…
Ads
అదుగో ఆ కోరిక నుంచి పుట్టించే ఈ లెజెండ్ సినిమా…. డబ్బులు పారేశాడు… ఎవరెంత అడిగితే అంత… తను కోరుకున్న హాట్ హీరోయిన్, సైడ్ హీరోయిన్, విలన్… దర్శకుడు, సంగీత దర్శకుడు, మన్నూమశానం అందరూ సమకూరారు… బట్… ఆ హీరో మొహమే కాస్త తేడా… ఏం చేస్తారు మరి..? తీసుకున్న డబ్బుకు… సెట్‌కు వచ్చామా… పనిచేశామా… వెళ్లిపోయామా… సినిమా అవుట్ పుట్ కూడా అలాగే ఏడ్చింది… మరంతే కదా…
కొందరు హీరో వయస్సు మీద ఏవేవో కామెంట్లు చేస్తున్నారు గానీ తప్పు… ఈరోజు సౌతిండియాలో సూపర్ స్టార్ల వయస్సు ఎంతో మరిచిపోతే ఎలా..? కాకపోతే ఈ సినిమా ఫార్ములా, సంకల్పం వేరు… 51 ఏళ్ల వయస్సయితేనేం, తను ఓ సినిమాలో హీరో కావాలనేదే శరవణన్ లక్ష్యం… భారీ స్థాయిలోనే తీశాడు… కోరిక తీరింది… బస్… రిస్కీ షాట్ల దగ్గర, కొన్ని సీన్లలో కూడా తన డూపులే కనిపిస్తూ ఉంటారు…
ఏమో… తినగ తినగ వేము అన్నట్టుగా… మనం వారస నటులకు అలవాటైనట్టుగా…. ఈ మొహాన్ని కూడా అలవాటయ్యేకొద్దీ ప్రేమిస్తామేమో… అసలే డబ్బున్నవాళ్లు ఈ సినిమా హీరోలుగా వెలిగిపోవాలని… పుష్ప భాషలో చెప్పాలంటే పులుపెక్కిపోతుండారు… ది లెజెండ్ సినిమాకు వద్దాం మళ్లీ… మన సంపూర్ణేష్ బాబు హృదయకాలేయం వంటి సినిమాలు తీస్తే మనం చీపుగా చూస్తాం… తనే స్వయంగా చెబుతాడు అవి స్పూఫ్‌లు అని… నవ్వించే ప్రయత్నం… ఈ లెజెండ్ సినిమా కూడా శివాజీ సినిమాకు స్పూఫ్ అని చెప్పొచ్చు కదా… చెప్పరు…
పాన్ ఇండియా సినిమా అనేది క్రమేపీ నవ్వుపుట్టించే పదంలాగా మారిపోతోంది… లేకపోతే ఈ సినిమాలో హీరో దగ్గర నుంచి ఏ నటుడూ, ఏ నటీ వేరే భాషల్లో ఎవరికీ తెలియదు… హీరో మొహం కూడా ఎవరికీ తెలియదు… దీన్ని పలు భాషల్లో డబ్ చేసేసి, అర్జెంటుగా దీనికి పాన్ ఇండియా ముద్ర వేసేస్తే నవ్వాలో ఏడవాలో తెలియదు… శరవణా… సరే, హీరో కావాలనే నీ కోరిక తీరింది కదా… ఇక చాలు… అసలే భారీ వర్షాలు, ఇన్‌ఫెక్షన్లతో మెదడు వాపు వ్యాధి వ్యాపిస్తున్నది… రోజులు బాగాలేవు..!! ఓ మిత్రుడు చెప్పినట్టు… డాన్సులు, ఫైట్లు, పాటలు… అన్నీ ఉన్నయ్… ఈ సినిమాలో లేనిదేమీ లేదు… ఉన్నదేమిటో చివరకు అర్థమే కాదు…!!!
Share this Article