.
హిమాలయాల్లో అఖండ-2 శివతాండవం… నందాదేవి పర్వతంపై అణుధార్మిక నిఘా పరికరం మిస్టరీ… ఇప్పుడు చర్చల్లో నడుస్తున్న ముచ్చట్లు కదా… సందట్లో సడేమియా అంటూ కైలాస పర్వతం రహస్యాల స్టోరీలు, వీడియోలు మళ్లీ ట్రెండింగులోకి వస్తున్నాయి…
కైలాస పర్వతం మీద కుప్పలు తెప్పలుగా స్టోరీలు, వీడియోలు… అనేక అతిశయోక్తులు కూడా… బెర్ముడా ట్రయాంగిల్ తెలుసు కదా… అటువైపు వెళ్లే ప్రతిదీ మాయం అయిపోతుంది… ప్రపంచంలో ఈరోజుకూ అంతుచిక్కని, అత్యంత మిస్టీరియస్ ప్రదేశాలు రెండు… 1) బెర్ముడా ట్రయాంగిల్, 2) కౌలాస పర్వతం…
ఒకసారి రామాయణంలోకి వెళ్దాం… హనుమంతుడు సీతాన్వేషణలో లంకకు వెళ్తున్నప్పుడు సింహిక తగులుతుంది… అదొక రాక్షసి… సముద్రంపై వెళ్లే ఏ జీవి అయినా సరే, ఆ నీడ పడగానే సింహిక అమాంతం నోరు తెరిచి మింగేస్తుంది ఆ నీడ ద్వారా…
Ads
అదుగో, కైలాస పర్వతం మీద కూడా బోలెడు అలాంటి కథనాలు… ఐతే ఈ అన్ని కథల్లో ఇంట్రసింగ్ అనిపించిన ఒక విషయం… నరమానవుడెవడూ దాన్ని అధిరోహించలేదని కదా ప్రతీతి… కానీ ఓ బౌద్ధ సన్యాసి మాత్రం అధిరోహించి, ప్రచారాలను బ్రేక్ చేస్తూ సజీవంగా తిరిగి వచ్చాడు… అదీ ఆ ఆసక్తికరాంశం…
ముందుగా కైలాస పర్వతం గురించి… (కొత్త పాఠకుల కోసం)…
- హిందువులకు ఇది శివుని నివాసస్థలి… అలాగే బౌద్ధులకు, జైనులకు, బోన్ మతస్తులకు ఇది అత్యంత పవిత్ర ప్రదేశం… కారణాలు వేర్వేరు…
- అందుకే దాని పవిత్రతకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో అధిరోహణను నిషేధించారు… అధిరోహణం కష్టం కూడా… అసాధ్యం… అందుకే ఈ పర్వతం చుట్టూ భక్తులు చేసే పరిక్రమ (ప్రదక్షిణ – సుమారు 52 కి.మీ.) మాత్రమే అనుమతించబడుతుంది, పర్వతంపైకి ఎక్కడానికి ఎవరికీ అనుమతి లేదు…
- ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్‌ను ఎందరో అధిరోహించినా, కైలాసం ఎత్తు (సుమారు 6,638 మీటర్లు) తక్కువగా ఉన్నప్పటికీ, అనేక అధిరోహణ ప్రయత్నాలు విఫలమయ్యాయి... కొందరు పర్వతారోహకులు అదృశ్యమయ్యారనే కథనాలు కూడా ఉన్నాయి…
-
అంతేకాదు,హెలికాప్టర్లు దారి తప్పిపోవడం లేదా కూలిపోవడం వంటి సంఘటనలు… ఎవరైనా అధిరోహించే ప్రయత్నం చేస్తే వేగంగా వయస్సు మీద పడుతుందనే ప్రచారాలు… సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… ఎవరు దాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి..?

మిలరేపా… ఇదీ ఆ సన్యాసి పేరు… 11వ శతాబ్దానికి చెందిన బౌద్ధ సన్యాసి… (Milarepa, 1052-1135 CE) … తను టిబెటన్… ఆ ప్రాంత కథనాల ప్రకారం…, మిలరేపా, బోన్ మత గురువైన నారో బోంచుంగ్‌ను అధిరోహణ పోటీలో ఓడించి శిఖరాన్ని చేరుకున్నాడు… అయితే, దీన్ని చాలా మంది భౌతిక అధిరోహణగా కాకుండా, ఆధ్యాత్మిక లేదా యోగ శక్తితో కూడిన విజయంగా భావిస్తారు…
మూడు సంవత్సరాల, మూడు నెలల, మూడు రోజులపాటు అక్కడే తపస్స చేశాడంటారు… కానీ ఆ పర్వతం మీద తనేం చూశాడో, ఏం అనుభవించాడో ఎవరికీ చెప్పలేదు… నోరు విప్పలేదు… స్వతహాగా సన్యాసి, ప్రవచనాలు, ధర్మబోధలు చేసే వ్యక్తి…
- మిలరేపా బోధనలు టిబెటన్ బౌద్ధంలో, ముఖ్యంగా కగ్యు సంప్రదాయంలో అత్యంత కీలకం… తను రచించిన “ది హండ్రెడ్ థౌజండ్ సాంగ్స్ ఆఫ్ మిలరేపా” (Milarepa’s Songs) టిబెటన్ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రచనలలో ఒకటి… ఐనా కైలాస పర్వతం అనుభవాల్ని ఎవరితోనూ పంచుకోలేదు… ఎందుకు..? అదీ చర్చనీయాంశమే…
1. కైలాసం కేవలం పర్వతం కాదు, అది ధర్మ చక్రం (Dharma Chakra), శక్తి కేంద్రం. ఇటువంటి పవిత్ర స్థలపు అంతర్గత రహస్యాలు లేదా ఆధ్యాత్మిక శక్తిని గురించి బహిరంగంగా మాట్లాడితే, అది దాని పవిత్రతను తగ్గిస్తుందని లేదా శక్తిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని మిలరేపా భావించి ఉండవచ్చు…
2. శిఖరం బాపతు అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో వివరించడం అసాధ్యమనే భావనతో కావచ్చు…
3. కొన్ని కథనాల ప్రకారం, మిలరేపా శిఖరంపై భవిష్యత్తుకు సంబంధించిన దర్శనం (Future Vision) లేదా రహస్యమైన బోధనలు పొందాడని చెబుతారు… ఆ దర్శనంలోని విషయాలు సాధారణ మానవులకు అపాయకరంగా పరిణమించవచ్చు లేదా వారు ఆ రహస్య జ్ఞానాన్ని దుర్వినియోగం చేయవచ్చు. అందుకే మానవాళిని రక్షించడానికి ఆయన ఆ వివరాలను దాచిపెట్టాడు…
4. మిలరేపా జీవిత లక్ష్యం కేవలం పర్వతాన్ని ఎక్కడం కాదు, బోధిని (జ్ఞానోదయం) పొందడం. కైలాస యాత్ర ఆ జ్ఞానోదయంలో ఒక భాగం మాత్రమే… అది తన వ్యక్తిగత విజయం… ఇతరులతో పంచుకోవడానికి కాదు…
ఈ కథనాలు, ఈ ప్రచారాలు ఎలా ఉన్నా... చైనా గానీ, ఇండియా గానీ డ్రోన్లు, హెలికాప్టర్లు, విమానాల ద్వారా గానీ... కనీసం శాటిలైట్ ఇమేజెస్‌ను జూమ్ చేయడం ద్వారా గానీ కైలాస పర్వతాన్ని ట్రాక్ చేయలేదు... ప్రయత్నించలేదు... రెండు దేశాలు ఏకాభిప్రాయంతో దాన్నలాగే ఓ పవిత్ర, గోప్య ప్రదేశంగా వదిలేయడం అసలు విశేషం...
Share this Article