పాత వార్తేమీ కాదు… అయిదారు రోజుల క్రితం వార్త… ఏమిటంటే..? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భార్య దుర్గ ఏ సెక్యూరిటీ, ప్రోటోకాల్, అధికార అట్టహాసాలు, పటాటోపాలు, అధికారుల భజన గీతాలు ఏమీ లేకుండా…. ఓ సామాన్య భక్తురాలిగా దేవుడిని దర్శించుకుని వెళ్లిపోయింది… ఇదీ వార్త… నచ్చింది… ఒక సీఎం భార్య… అదీ ఆ దేవుడిని తమిళులు మా సొంత దేవుడే అని ఓన్ చేసుకుంటుంటారు… ఆ మంత్రాలూ తమిళంలోనే ఉంటాయంటారు…
అక్కడికి నిరాడంబరంగా వెళ్లి, కేవలం భక్తి తప్ప మరేమీ ఆలోచించకుండా, మనస్పూర్తిగా దేవుడిని దర్శించుకుంది… అది నచ్చింది… బహుశా ఒకరిద్దరు లేడీ సెక్యూరిటీ స్టాఫ్ మామూలు దుస్తుల్లో ఆమె కాస్త దూరంలో నిశ్శబ్దంగా అనుసరించి ఉంటారు… ఆహా, ఎంతమంది ‘‘చిల్లర వేషాల’’ అట్టహాసాల భక్తులకు ఇది పాఠం కావాలి… ఆమె సింప్లిసిటీకి అభినందనలు…
నచ్చిన మరో విషయం ఏమిటంటే… వీరనాస్తికుడు, హేతువాది, అవిశ్వాసి అయినా సరే స్టాలిన్ తన అభిప్రాయాల్ని కుటుంబసభ్యుల మీద రుద్దకపోవడం… వాళ్ల వ్యక్తిగత విశ్వాసాలకు అడ్డుపడకపోవడం… అభ్యంతరపెట్టి, ఠాట్ వీల్లేదు అంటూ తిరుమలకు వెళ్లకుండా చేయకపోవడం..! దుర్గ తిరుమలకు రావడం కొత్తేమీ కాదు, చాలాసార్లు వచ్చింది… తిరుమలకే కాదు, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలకు వెళ్తుంది… (దేవుడిని నమ్మని తన భర్తను ముఖ్యమంత్రి చేయాలంటూ తెలిసిన దేవుళ్లందరినీ వేడుకుంది…)
Ads
ఈమే కాదు… దైవదూషణకు, అదీ హిందూ దేవుళ్ల నిందకు ఎప్పుడూ తయారుగా ఉండేవాడు కదా కరుణానిధి… వాళ్ల పార్టీ ప్రధాన సూత్రాల్లో నాస్తికత కూడా ఒకటి కదా… కరుణానిధి భార్య దయాళు అమ్మాల్ కూడా భక్తురాలే… (స్టాలిన్ తల్లి)… స్టాలిన్ సోదరి సెల్వికి కూడా ఆధ్యాత్మికత మీద గురి ఉంది… కణిమొళి కేసు సమయంలో కరుణానిధి కుటుంబసభ్యుల్లో చాలామంది గుళ్లు సందర్శించారు… పలు తమిళ పత్రికల్లో ఆ గుళ్ల జాబితా కూడా పబ్లిష్ చేశారు… సరే, ఎవరి నమ్మకాలు వాళ్లవి…
ఎన్నికలకు ముందు డీఎంకే నేతలు బోలెడు మంది నాస్తికతకు నీళ్లొదిలి, గుళ్లకు వరుస కట్టారు… ఆ వార్తలు కూడా చదివాం… అసలు అన్నాడీఎంకే నాస్తికత్వానికి ఏనాడో తిలోదకాలు వదిలేసింది… మామూలు దేవుళ్లనే కాదు, జయలలిత అనే దేవతను, శశికళ అనే దేవతాసఖిని కూడా ఏళ్ల తరబడీ పూజించారు… ఇక్కడ విస్మయకరం ఏమిటంటే… లక్షల మంది పార్టీ శ్రేణులను ఏళ్ల తరబడీ నాస్తికత్వానికి కట్టుబడేలా చేసి, చివరకు ఇప్పుడు చేతులెత్తేశాయి రెండు పార్టీలు…
లక్షల మంది పార్టీ కేడర్ సంగతి సరే, కానీ చివరకు సొంత కుటుంబసభ్యులను కూడా తమ హేతువాద సిద్ధాంతాలతో కన్విన్స్ చేయలేకపోయారా కరుణానిధి గానీ, స్టాలిన్ గానీ…! శ్రీశ్రీ ఇంట్లో సత్యనారాయణ వ్రతంలాగా…! సీపీఐ నారాయణ తిరుమల యాత్రలాగా…!! ఆ లోతైనా సైద్ధాంతిక చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు గానీ… ఎంతైనా నువ్వు భలే దేవుడివి స్వామీ… నువ్వు లేనే లేవంటూ అరివీర, భీషణ ప్రసంగాలతో ఎవరైతే పోరాడుతుంటారో, వాళ్ల నీడలతోనే దండాలు పెట్టించుకుంటావు… బహు చమత్కారివి… జగన్నాటక సూత్రధారివి…
Share this Article