దిక్కుమాలిన ఆదిపురుష్ 600 కోట్ల గ్రాఫిక్స్‌కన్నా… జస్ట్, 15 కోట్లతో తీసే హనుమాన్ గ్రాఫిక్స్ ఎంత సూపర్‌గా ఉన్నాయో చెప్పుకున్నాం కదా… ఆ తప్పుడు లెక్కల దందా వెనుక మర్మమేమిటో, కుతంత్రాలు, మోసాల మాటేమిటో అర్థం కాదు… కానీ భారీ గ్రాఫిక్స్ సినిమా, వందల కోట్ల సినిమా అంటేనే ఓ స్కామ్ అనిపిస్తోంది…
బాహుబలి, ఈగ దగ్గర నుంచీ అంతే… ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, పొన్నియిన్ సెల్వన్… ఏది చూసినా వందల కోట్లు… కాంతార, హనుమాన్ అత్యంత కారు చౌకగా మంచి క్రియేటివ్, నీడెడ్ గ్రాఫిక్స్ వాడుతుంటే… మరి ఈ వందల కోట్ల భారీ గ్రాఫిక్స్ ఏం సాధిస్తున్నట్టు..? ఆ డబ్బంతా సినిమా రిలీజుకు ముందే ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్టు..?
ఇలాంటి చర్చే అవతార్ సీక్వెల్‌పైనా సాగుతోంది… అవతార్-2, ది వే ఆఫ్ వాటర్ టీజర్లు, పోస్టర్లు, ట్రయిలర్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి ఫిలిమ్ సర్కిళ్లలో… జేమ్స్ కామెరూన్ అనే ఆ దర్శకుడి పేరు చాలు అద్భుతమైన రేట్లతో మార్కెటింగ్ సాగిపోతోంది… అనేక భాషల్లో ఒకేసారి, పలు హైలీ అడ్వాన్స్‌డ్ టెక్నికల్ పద్ధతుల్లో రిలీజు కాబోతోంది… ఉదాహరణకు హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో బిగ్ స్క్రీన్‌ను 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో భారీ తెరను ఏర్పాటు చేయబోతున్నారు…
Ads
కెనడా నుంచి తెప్పించిన వరల్డ్ క్లాస్ త్రీడీ ప్రొజెక్టర్… ప్రపంచంలోనే పొడవైన తెర, దేశంలోనే భారీ తెర కాబోతోంది… దాంట్లో అవతార్ ప్రదర్శించనున్నారు… టికెట్టు కనీసం 1000 రూపాయలు ఉండొచ్చు… దానికి తగినట్టు సౌండ్ ఎఫెక్ట్స్ ఎట్సెట్రా ఉండనే ఉంటాయి… అవతార్ సినిమా కోసం కామెరూన్ ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న అత్యంత అడ్వాన్స్‌డ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో కూడిన గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడాడు…
అప్పుడెప్పుడో దశాబ్దం క్రితం దీని ప్రిప్రొడక్షన్ వర్క్ స్టార్టయితే 2017లో అసలు షూటింగ్ స్టార్ట్ చేశారు… మొదట్లో దీని బడ్జెట్ కేవలం 25 కోట్ల డాలర్లు అనుకున్నారు… ఇప్పుడు కామెరూన్ ఏమంటున్నాడంటే… ‘‘కనీసం 2 బిలియన్ డాలర్లు వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ రాదు…’’ అంటే 16,355 కోట్లు… ఎక్కడి 25 కోట్ల డాలర్లు, ఎక్కడి 200 కోట్ల డాలర్లు… అంటే… ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో టాప్-5లో చేరితే తప్ప ఈ అవతార్-2 బ్రేక్ ఈవెన్ సాధించదు అన్నమాట…
ఇప్పటివరకు టాప్ వసూళ్లు ఈ దర్శకుడు తీసిన, ఇదే సినిమా ఫస్ట్ పార్ట్‌దే… అవతార్… 2.9 బిలియన్లు వసూలు చేసింది… తరువాత అవెంజర్స్, ఎండ్ గేమ్ 2.8 బిలియన్లు, టైటానిక్ 2.2 బిలియన్లు, స్టార్ వార్స్-7 రెండు బిలియన్లు, అవెంజర్స్ ఇన్‌ఫినిటీవార్ రెండు బిలియన్లు సాధించాయి… ఇప్పుడు కామెరూన్ చెప్పేదాన్ని బట్టి ఆ టాప్-5లో చేరాలి, సాధ్యమేనా..? (మొదట్లో 3, 4, 5 సీక్వెళ్లు అని కూడా చెప్పిన కామెరూన్ ఇప్పుడు వాటిపై కిమ్మనడం లేదు, ఇదేనా కారణం..?)
అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీన్ని ‘‘వరల్డ్ సినిమాలోనే ఇది వరస్ట్ బిజినెస్ కేస్’’ అంటున్నారు… ఎవరో ఎందుకు..? నిర్మాతలు డిస్నీ, 20 సెంచరీ వాళ్లే మొత్తుకుంటున్నారు అలా… కామెరూన్ కూడా అంగీకరిస్తున్నాడు… ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఈ భారీ బడ్జెట్ ‘‘అత్యంత దరిద్రగొట్టు బిజినెస్ మోడల్’’ అనేది సినిమా ట్రేడ్ పండితులు ప్రపంచవ్యాప్తంగా తేల్చిపడేశారు… ఇక ప్రేక్షకులు ఏం చెబుతారో చూడాలి… వసూళ్లలో టాప్-1 చేస్తారా..? 23 వేల కోట్లను దాటిస్తారా..? అవతార్ హైప్ చూస్తే మాత్రం… సాధ్యమే అనిపిస్తోంది… సాధ్యమైతే అదొక అద్భుత రికార్డు అవుతుంది…!
Share this Article