ఆఫ్టరాల్… కాలికి గాయం కాగానే యుద్ధరంగం నుంచి పారిపోయే భీరువు కాదు మమతక్క… ఇలాంటి యుద్ధాల్ని ఎన్నో చూసింది… దేశం కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలేయడానికి ఎన్నోసార్లు సిద్ధపడిన సివంగి ఆమె… అందుకే తన పార్టీ పేరు కూడా తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకున్నట్టుంది… అది వేరే కథ… ఆమెలో ఉన్న గొప్ప సుగుణాత్మక విశేషమేమిటంటే… దేశం కోసం తను ఆలోచించిన సందర్భాలను గొప్పలుగా చెప్పుకోదు… హేమిటి..? నమ్మడం లేదా..? ఓ భారీ ఉదాహరణ చెప్పుకుందాం… ఓసారి ఇరవై రెండేళ్ల వెనక్కి వెళ్దాం… అది 1999… డిసెంబరు… ఖాట్మండు నుంచి ఢిల్లీ వెళ్లే ఓ ఫ్లయిట్… 178 మంది ప్రయాణికులు… హర్కత్-ఉల్-ముజాహుదీన్ టెర్రరిస్టులు దాన్ని హైజాక్ చేశారు… అఫ్కోర్స్, పాకిస్థానీ ఐఎస్ఐ సహకారమే… కానీ తన తప్పేమీ లేదని చెప్పుకోవడానికి ఓ ప్లాన్ వేసింది… అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ రాజ్యం కదా… ఈ విమానాన్ని తీసుకెళ్లి కాంధహార్లో దింపారు…
ఇండియన్ జైళ్లలో ఉన్న నొటోరియస్ 35 మంది ఉగ్రవాదులను విడిచిపెట్టాలనీ, 20 కోట్ల డాలర్లను ఇవ్వాలనీ డిమాండ్… లేకపోతే మొత్తం ప్రయాణికుల్ని హతమారుస్తామని బెదిరించారు… వాజపేయి ప్రభుత్వం మిలిటరీ చర్య ప్లాన్ చేస్తే, ఆ ప్రయాణికుల్ని చంపేస్తారని భావించింది… అజిత్ దోవల్, ఇతర అధికారుల టీంను పంపించింది, చర్చలు జరిపింది… చివరకు ముగ్గురు ఉగ్రవాదుల విడుదలకు అంగీకరించింది… అందులో ఒకడు మౌలానా మసూద్ అజహర్… ఇప్పుడు తను ప్రపంచ స్థాయి టెర్రరిస్టు… ఇప్పుడు ఆ దుస్సంఘటన గురించి ఎందుకు చెప్పుకుంటున్నామనే కదా మీ డౌటనుమానం..? వాజపేయి ప్రభుత్వంలోని ముఖ్యులంతా ఏం చేద్దాం, ఏం చేద్దాం అంటూ గుంజాటనలో ఉన్నప్పుడు మమతక్క ధైర్యంగా ముందుకొచ్చింది…
Ads
‘బేఫికర్ వాజపేయిజీ… మై హూఁనా…? ఆ ప్రయాణికుల్ని విడిచిపెట్టమని కబురు చేయండి, నేను వెళ్తాను, నన్ను నిర్బంధించి, తమ డిమాండ్లేమిటో చెప్పమనండి… పోనీ, ఈ దేశం కోసం నా ప్రాణాలు వదలడానికీ నేను సిద్ధమే… తుచ్ఛమైన ఈ దేహం ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..? మన ప్రజల కోసం అర్పించలేని ప్రాణాలూ నిజానికి ప్రాణాలేనా..?’ అని చెప్పింది… ఆమె అప్పట్లో కేంద్ర రైల్వే మంత్రి… ఎన్డీఏలో భాగస్వామి… ఆమె ధైర్యానికీ, సాహసానికీ అచ్చెరువొందిన ఇతర కేబినెట్ మంత్రులు కాసేపటికి తేరుకుని ‘‘వద్దు లేమ్మా..’’ అని ఎలాగోలా ఆమెకు నచ్చజెప్పారు… తరువాత ఆ ముగ్గురు టెర్రరిస్టులను వదిలేయడం గట్రా వేరే కథ… అయితే ఇన్నేళ్లు మమతక్క గానీ, ఆమె పార్టీ ముఖ్యులు గానీ ఈ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదు..?
#WATCH | TMC Yashwant Sinha says, Mamata Banerjee wanted to offer herself as a hostage in exchange for passengers of the hijacked plane in 'Kandahar incident', for the country. pic.twitter.com/Pf1CBJGLyg
— ANI (@ANI) March 13, 2021
సాధారణంగా రాజకీయ నాయకులు ఒకటి ఉంటే వంద చెప్పుకుంటారు… కొందరైతే ఏమీ లేకపోయినా గొప్పలు క్రియేట్ చేసుకుంటారు… మరి ఇంత త్యాగానికి సిద్ధపడిన ధీరవనితామణి గురించి ఒక్కరంటే ఒక్క ప్రభుత్వ ముఖ్యుడూ ఎందుకు మాట్లాడలేదు..? ఒక్క జర్నలిస్టూ ఈ విషయాన్ని ఎందుకు రిపోర్ట్ చేయలేదు..? ఏ రైటరూ తమ పుస్తకాల్లో దీన్ని రికార్డ్ చేయలేదు..? వై..? వై..? మరి ఇప్పుడెలా బయటికి వచ్చింది అంటారా..? అప్పట్లో ఆర్థికమంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా ఇప్పుడు మమతక్క పార్టీలో చేరాడు… చేరిన వెంటనే నాటి మమతక్క సాహసం గుర్తొచ్చి కళ్లు చెమర్చాయి… నాటి జ్ఞాపకాలు తనను ఊరుకోనివ్వలేదు… మా మమతక్క అంటే ఏమనుకున్నార్రా..? ఇదీ మా తాజా కొత్త బాసిణి త్యాగగుణం అని మొత్తం చెప్పేశాడు… ఇన్నేళ్లకు ఒక్కరు నోరు విప్పారన్నమాట… అవునూ, యశ్వంత్ సిన్హా టీఎంసీలో ఎందుకు చేరాడు అంటే..? ఏం చేయమంటారు మరి..? మోడీ, అమిత్ షా ప్రాభవం పెరిగాక చాలామందిని ఔట్ డేటెడ్ పార్టీ సరుకు అని అటక మీద పడేశారు కదా… ఈ సిన్హా ఇప్పుడు నందిగ్రామ్‌లో దుష్ట బీజేపీ మమతక్క మీద దాడికి దిగాక, ఇక తట్టుకోలేక, ఆగలేక… ఆ అటక దిగి వచ్చి, కాషాయ బంధనాలు తెంచేసుకుని, మొన్ననే టీఎంసీలోకి దూకేశాడు…!!
Share this Article