తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవే సర్వస్వం అని జగన్ ప్రభుత్వం గుర్తిస్తోందా..? మొత్తం ఇండస్ట్రీకి ఆయనే ప్రతినిధి అని భావిస్తోందా..? చిరంజీవి మరో దాసరి అనే సర్టిఫికెట్, అక్రెడిటేసన్ జారీచేస్తోందా..? ఇక ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వంటి సంఘాల ఉనికికి, మనుగడకు అర్థమే లేదా..? లేక వాటి మీద కూడా కమ్మ ప్రభావమే ప్రధానంగా ఉందనే భావనతో జగన్ ప్రభుత్వం వాటిని పక్కకు తోసేసి చిరంజీవిని పైకి ఎత్తుతోందా..? రాబోయే రోజుల్లో ఇది ఇండస్ట్రీకి వరమా..? శాపమా..?
ఉద్యోగుల జీతాల గురించి చర్చ జరిపింది ఎవరితో..? సంఘాల ఐక్యసమితి నేతలతో..! అదొక పద్ధతి, తరువాత కొందరు విభేదిస్తే, ఎదురు తిరిగితే అది వేరే సంగతి… కానీ ఉద్యోగ సంఘ నాయకులతో వ్యక్తిగత చర్చలు జరపకుండా.., బాధ్యులతో, బాధ్యత వహించాల్సిన సంఘాలతో చర్చలు జరిపారు… అది కరెక్టు ప్రొసీజర్… కానీ ఒక చిరంజీవి, ఒక నాగార్జున, ఒక మహేశ్ బాబు, ఒక జూనియర్ ఎన్టీయార్ టీంతో మాత్రమే చర్చలేమిటి..? పేరుకు ఒకరిద్దరు (దానయ్య, వంశీ) నిర్మాతలు కూడా వాళ్లతోపాటు వెళ్తారట…
Ads
చిరంజీవికి అన్నీ తెలుసు, తనెలా చెబితే అలా అని నాగార్జున మొన్నామధ్య ఎండార్స్‌మెంట్ ఇచ్చేశాడు… ఒక టీంగా చూపించుకోవడానికి జూనియర్, మహేశ్ కూడా వెళ్తారు… లింగవివక్ష లేదని చెప్పడం కోసం చెప్పినట్టు ఆడే ఓ హీరోయిన్ కూడా టీంలో ఉంటే బాగుండేదేమో… (మహేశ్ సొంత బావ గల్లా జయదేవ్ టీడీపీ నాయకుడే అయినా, మహేశ్ టీడీపీతో రాసుకుని పూసుకుని తిరగడు… తండ్రి కృష్ణకు కూడా టీడీపీతో పెద్దగా పడేది కాాదు… అలాగే పేరుకు ఎన్టీయార్ మనవడు, హరికృష్ణ కొడుకే అయినా జూనియర్ చాన్నాళ్లుగా టీడీపీతో దూరంగా ఉంటున్నాడు, వాడుకుని విసిరిసే చంద్రబాబు ధోరణితో విభేదిస్తున్నాడు)
బాలయ్యను పిలిస్తే తన పొలిటికల్ కలర్ మొత్తం వ్యవహారాన్ని చెడగొట్టవచ్చునేమోనని , జగన్ ఇష్టపడకపోవచ్చుని భావించి, తనను దూరం ఉంచుతున్నారు… అంటే, జగన్ వోకే అన్నవాళ్లే చర్చలు జరపాలా..? హీరోలే ప్రధానం అనుకుంటే… ఈ నలుగురే ఇండస్ట్రీని ప్రభావితం చేసే హీరోలా..? మిగతా వాళ్లంతా ఉత్త పోషిగాళ్లేనా..? ఇండస్ట్రీ మీద అపారమైన అవగాహనతో ఆల్ రెడీ మంత్రితో భేటీ వేసిన రాంగోపాల వర్మను కూడా పిలవడం లేదు, హతవిధీ…
ఇవన్నీ సరే… అసలు టికెట్ల ధరల పెంపు వ్యవహారం అనేది అంతిమంగా హీరోల జేబులు నింపేదే… నిజమే… కానీ టికెట్ల ధరలు అనేది పద్ధతి ప్రకారం అయితే ఎగ్జిబిటర్ల సమస్య, తద్వారా నిర్మాతల సమస్య… మరి ఈ పాపులర్ హీరోలతో ప్రభుత్వాధినేత చర్చలేమిటి..? చర్చలకు ఏది ప్రాతిపదిక..? ఎవరు బాధ్యులు..? ఈ కోణంలో ఆలోచిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను చెరబట్టిన సిండికేట్ ముఖ్యులు ఏరి..? వాళ్లు కూడా చిరంజీవికే ఎండార్స్‌మెంట్ ఇచ్చేశారా..?
ఇటీవల పలు విషయాల్లో యూటర్న్ తీసుకుని, కోర్టుల్లో దాన్నే చెప్పిన జగన్ ప్రభుత్వం టికెట్ల ధరల పాత జీవో బదులుగా కొత్త జీవో ఇస్తామనీ, పాత జీవోకు చెల్లుబాటు లేదని చెబుతుందా..? మరి ఇండస్ట్రీకి సంబంధించిన రకరకాల సంఘాలను ఏం చేద్దాం సార్..? నిజానికి జీయోల పెకాహం మంచు విష్ణు అడిగిన ప్రశ్నలలో రీజన్ ఉంది, లాజిక్ ఉంది.., దురదృష్టం కొద్దీ ‘మా’ను ఇండస్ట్రీలోని ఏ పాపులర్ హీరో దేకడు… జగన్ కూడా..!! ఒకవేళ భేటీ తరువాత చిరంజీవి బయటికి వచ్చి, ఫలానా విషయాలను జగన్ అంగీకరించాడు అని ఓన్ చేసుకుంటే, జియో కూడా విడుదలైపోతే అప్పుడేం చేయాలి హిష్ణు బాబు గారూ…!!
Share this Article