ఏబీఎన్‌లో రాధాకృష్ణ ఓ సీరియస్ ప్రశ్న సంధించాడు కేసీయార్‌కు… నిజంగా గట్టి ప్రశ్నే… టీడీపీ వాళ్లకు అలా అడగడం చేతకావడం లేదు కాబట్టి ఆ బాధ్యతనూ తనే మీద వేసుకున్నట్టుగా… ‘‘చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని బీఆర్ఎస్ మంత్రులతో అడిగిస్తున్న కేసీయార్‌కు మరి ఆంధ్రాలో ఏం పని..? తనెందుకు ఆంధ్రాలో పోటీచేయాలి..?’’ ఈ ప్రశ్నకు దారితీసింది ఏమిటంటే..? ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ కావడం…!
గతంతో పోలిస్తే టీడీపీకి తెలంగాణలో పెద్దగా బలం లేకపోయినా… ఆంధ్రా మూలాలున్న వోటర్లు కనీసం 25 సీట్లలో గెలుపోటముల్ని ప్రభావితం చేయగలరనీ, తమను వదిలేసి వెళ్లిపోయిన చంద్రబాబు పట్ల ఆ వోటర్లకు కోపమున్నా సరే, వాళ్లు గనుక మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తే, అది కేసీయార్‌కు నష్టమనీ, ఎందుకంటే, వాళ్లంతా ప్రస్తుతం కేసీయార్ వెంటే ఉన్నారనీ ఓ విశ్లేషణ… కానీ ఆ వోటర్లు మళ్లీ చంద్రబాబును నమ్మే స్థితి ఉందా..? అదీ అసలు ప్రశ్న…
నమ్ముతారేమో అని బీఆర్ఎస్ భయసందేహం… అందుకే ఒక్కసారిగా బీఆర్ఎస్ ఉలిక్కిపడి అసలు చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని మాటల దాడికి దిగింది..? రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడినని చెప్పుకుంటున్న కేసీయారే ఏపీలో పోటీచేయాలని అనుకున్నప్పుడు… ఆల్‌రెడీ పార్టీ ఉనికి, గత చరిత్ర ఉన్న చంద్రబాబు తెలంగాణలో పోటీచేయడానికి అనర్హుడు ఎలా అవుతాడు..? ఎవరి ఆశలు వాళ్లవి… వోట్లేయాలా లేదా అనేది ప్రజల ఇష్టం… ‘‘లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అన్నట్టుగా ఆంధ్రులంతా దోపిడీదారులే అని సూత్రీకరించిన కేసీయార్‌ను ఆంధ్రులు ఎందుకు ఆదరించాలి, ఆదరిస్తారా..’’ అనేది ఆర్కే భావన…
అందుకే మొన్న నమస్తే తెలంగాణలో వచ్చిన ఓ బ్యానర్ స్టోరీని కాస్త వెక్కిరించే ప్రయత్నం కూడా చేశాడు… నిజంగానే ఓ పిచ్చి వార్త అది… ఎవరో ఊరూపేరూ లేని అనామకులు వచ్చి కలిస్తే ఇక ఏకంగా ఆంధ్రాకు కేసీయార్ ఆశాకిరణం అయిపోయాడా అనడుగుతున్నాడు ఆర్కే… ఢిల్లీలో తనను కలిసేది కూడా ఇలాంటి కేరక్టర్లే… వాళ్లకు రాజమర్యాదలు… తెలంగాణ ప్రజల సొమ్ము ఏమవుతుందో, ఎవరికి ఖర్చవుతుందో అంతా బభ్రాజమానం భజగోవిందం…
Ads
(కేసీయార్‌ను కలిసినవారిలో… అసలు ఇప్పుడు ఉనికిలోనే లేని ఓ పత్రిక మాజీ కంట్రిబ్యూటర్ కూడా ఉన్నాడని చెప్పుకొచ్చాడు ఆర్కే… అదేదో అనర్హత అయినట్టు, రాజకీయాలకు కంట్రిబ్యూటర్లు అస్పృశ్యులు అయినట్టు…!! నిజానికి నాయకులను చూసీ చూసీ, రాజకీయాల్ని అర్థం చేసుకుంటూ నిజంగానే నాయకులుగా ఎదిగే చాన్స్ కంట్రిబ్యూటర్లకే ఉంది… అనేక చోట్ల వాళ్లు రాజకీయాల్లో ఎదుగుతున్నారు కూడా…! ఇప్పటి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గతంలో జర్నలిస్టే… దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కంట్రిబ్యూటరే… అదే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే క్రాంతి మొన్నటిదాకా జర్నలిస్టే కదా… ఏపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మొదట్లో కంట్రిబ్యూటరే… చెబుతూ పోతే బోలెడు మంది…)
ఆర్కే మరో ప్రశ్న వేశాడు… ‘‘చంద్రబాబు, షర్మిల, పవన్ కల్యాణ్, ప్రవీణ్‌కుమార్ బీజేపీకి తోడుగా గనుక కలిస్తే కేసీయార్‌కే బోలెడు నష్టం కాదా’’… ఇదీ ప్రశ్న… ఈ వాదనతో తెలంగాణలో బీజేపీకి టీడీపీ సాయం కావాలంటే, ఏపీలో పొత్తు కుదరాలి అనేది ఆర్కే భావన… పవన్ కల్యాణ్ ఆశ కూడా అదే… చంద్రబాబు ధ్యాస కూడా అదే… కానీ తెలంగాణలో వాళ్లెప్పుడూ ఒకతాటిపైకి రారు… ఎందుకంటే… షర్మిల ఆల్‌రెడీ జగన్, బీజేపీ కలిపి వదిలిన బాణమే… ఏ రీతిలో బీజేపీకి ఫాయిదా అనేది వేరే చర్చ… జగన్‌కు ఎలాగూ తెలంగాణ మీద దృష్టి లేదు… అసలు షర్మిలకు జనసేన పొడగిట్టదు…
బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లకపోవచ్చు గానీ బీఎస్పీ సొంతంగా బరిలో ఉంటుందేమో… మాయావతి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం లేదు… అది కేసీయార్‌కు నష్టమే… పవన్ కల్యాణ్ పార్టీకి తెలంగాణలో ఏ రేంజ్ ఉనికి ఉందో డిస్కస్ చేయడం కూడా దండుగే… ఇలా రకరకాల ‘‘ఉశికె ముడి, పెండ ముడి’’ బాపతు సమీకరణాలు చాలా పనిచేస్తాయి రాబోయే రోజుల్లో… అంతేతప్ప వాళ్లంతా కలవరు… కేసీయార్‌కు ఉమ్మడిగా నష్టం చేకూర్చలేరు… పైగా హిందూ, క్రిస్టియన్ వోట్లు రకరకాలుగా చీలిపోతే… కాంగ్రెస్ కేసీయార్ వ్యతిరేక వోట్లను కొన్ని చీల్చితే… ముస్లిం వోట్లు ప్లస్ తన సొంత వోటు బ్యాంకుతో మళ్లీ అధికారానికి తగిన సీట్లు సంపాదించే చాన్స్ కేసీయార్‌కు ఇప్పటికీ సజీవంగా ఉంది…!!
అవునూ… బాబ్బాబు, మీకు వోట్లేస్తాం అని వోటర్లు బతిమిలాడుతున్నా సరే… ఎహె ఆగండి, అలా వోట్లెలా వేస్తారు..? మా తన్నులాటలు ముందు తెగితే అప్పుడు ఆలోచిద్దాం…. అన్నట్టుగా ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి… పీసీసీ అధ్యక్షుడి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన నాయకులు ఇప్పుడేం చేస్తారు అనేది మరో ప్రశ్న… ఏమీ చేయరు, కొన్నాళ్లు సైలెంటు, మళ్లీ ఇదే కథ మొదలు… మరోవైపు చంద్రబాబు తనదైన శైలిలో రీఎంట్రీకి పావులు కదుపుతున్నాడు… ఈడీని ముందుపెట్టి బీజేపీ ఇంకాస్త హడావుడిని క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉంది… అది తెలంగాణపై ఆశల్ని ఎలాగూ వదులుకోదు… మొత్తానికి తెలంగాణ రాజకీయ ప్రయోగశాల అవుతోంది…!!
Share this Article