అవును తల్లీ, అవును… కోవాగ్జిన్ మీదే… తెలుగులో ఓ సామెత ఉందిలే… ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న… ఏరుదాటాక తెప్పతగలేయడం అని కూడా చెప్పుకోవచ్చు… తెలుగువాళ్లే కదా మీరు… అర్థమై ఉంటుంది… అందరికన్నా బాగా అర్థమై ఉంటుంది… ప్చ్, మా పిచ్చి జనానికే అర్థం కావడం లేదు… కాదు కూడా… కానివ్వరు మీరు… మంచినీళ్ల సీసా ధరకు వేక్సిన్ ఇస్తానన్నాడు మీ ఆయన… ఇలా వేక్సిన్ తయారైందో లేదో అది కాస్తా 1200కు చేర్చాడు… అప్పుడే అర్థం కావాలి కదా మా మట్టిబుర్రలకు… మానవాళికి కరోనా భూతంలా కనిపించవచ్చుగాక… కానీ ఆ భూతాన్ని ఆడిస్తూ, కోట్లకుకోట్లు కొల్లగొట్టే ఆటగాళ్లు వేరని…! అవునూ, ఏమంటివి, ఏమంటివి..? కోవాగ్జిన్ మాదే గానీ, ఐసీఎంఆర్, ఎన్ఐవీ జస్ట్ కరోనా స్ట్రెయిన్ ఇచ్చాయి తప్ప, ఇంకేమీ లేదు అంటావా..? టీకా తయారీ పరిజ్ఞానమేదీ తీసుకోలేదు కాబట్టి ఎవడికీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేదుపో అంటున్నావా..? ఎంతమాట ఎంతమాట…?
ఆ వైరస్ స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు… ఈ టీకా ఉత్పత్తిలో ఆ రెండు ప్రభుత్వ సంస్థలూ భాగస్వాములే అయినప్పుడు… అంతా అయ్యాక, వాటిని తన్నితగలేసి… అబ్బే, వాళ్లు చేసిందేముంది..? కేవలం తట్టలు, పారలు ఇచ్చారు, కానీ బిల్డింగ్ కట్టింది మేమే అంటారా ఇప్పుడు..? అంతా మీ మోడీ అలుసు చూసుకునే కదా… (ఆంధ్రజ్యోతిలో ఈమె ఇంటర్వ్యూ పక్కనే కొడుకు వార్త ఉంది… రేచస్ ఎల్లా… ఐసీఎంఆర్‌తో కలిసి కొవాగ్జిన్ డెవలప్ చేశాం అని కాస్త నిజాయితీగానే చెప్పాడు…) మరి నువ్వే చెబుతున్నావు కదమ్మా… పెద్ద జంతువులపై ట్రయల్స్‌కు ప్రైవేటు ఔషధ సంస్థలకు అనుమతుల్లేవు కాబట్టి ఐసీఎంఆర్, ఎన్ఐవీ సహకారాన్ని తీసుకున్నామని…. అంటే, మీ అవసరం కోసం మాత్రమే వాటిని వాడుకున్నామనీ, ఈ ప్లాన్‌తోనే వాటితో భాగస్వామ్యం కుదుర్చుకున్నామనీ అంగీకరిస్తున్నట్టే కదా… ఇదేనా వ్యాపారంలో నిజాయితీ..? జనం ఎలాగూ పట్టరు… ధరలు మీరు చెప్పినట్టే, వేక్సిన్ పాలసీ మీరు చెప్పినట్టే… అన్నీ వోకే, కానీ కనీసం వ్యాపారంలోనూ నిజాయితీ, ప్రమాణాలు అవసరం లేదా..?
Ads
జనానికి అర్థం కావడం లేదా..? ఈరోజుకూ ఏ విదేశీ కంపెనీకి కేంద్రం టీకాల ఉత్పత్తికి సహకరించడం లేదో… ఎవరి కోసం కేంద్రం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మరీ సహకరిస్తున్నదో సమజైతలేదా..? ఇవన్నీ ఎందుకు తల్లీ… అసలు మీ కోవాగ్జిన్‌కు WHO గుర్తింపే ఇవ్వలేదు, దాని జాబితాలో మీ వేక్సిన్ పేరే లేదు… ఈ వేక్సిన్ వేసుకుని, వేరే దేశాలకు వెళ్తే వాడు రానిస్తాడో లేదో తెలియదు… పర్లేదు, మన కేంద్రం ఉంది కదా, ఈ విషయంలోనూ సహకరిస్తుందిలే… ఇంకా మీరు చాలా చేయాల్సిన సేవ చాలా బాకీ ఉంది… పిల్లలకు వేక్సిన్ కావాలి, బూస్టర్ డోసులు కావాలి, ఉత్పత్తి పెంచాలి… ఏటేటా వేక్సిన్ వేసుకుంటే తప్ప మనిషి బతకలేని పరిస్థితి క్రియేట్ చేయాలి… అంతేనా..? కానివ్వండి… అటు కోవిషీల్డ్ అదర్ పూనావాలా… ఇటు ఇదర్ ఆంధ్రావాలా…. ఎవరైతేనేం… కోట్ల డోసులు కుచ్చేయండి… కోట్టకుకోట్లు కుమ్మేయండి… మానవాళి సంక్షోభాన్ని అద్భుతమైన అవకాశంగా మార్చుకున్న మీ వ్యాపార పరిజ్ఞానానికి అభినందనలు…
అడ్వాన్స్ congratulations అమ్మా…. వచ్చేసారి అదర్ పూనావాలా ప్లస్ కృష్ణ ఎల్లాకు పద్మభూషణ్ గ్యారంటీ అట కదా…. వడ్డించే మోడీ మనవాడైతే ఏదైనా సాధ్యమే… ఎటొచ్చీ ఆ నరకలోకపు చిత్రగుప్తుడు ఏమేం నమోదు చేస్తున్నాడో… దుర్మార్గుడు…!! ఎహె, అవన్నీ మేం నమ్మేదే లేదు, ఫోర్బ్స్ పత్రిక వాడి ఫస్ట్ పేజీకి ఫోటో ఎక్కాలి అంటారా..? కానివ్వండి… కానివ్వండి… మోడీ దయ ఇంకా ఇంకా ప్రాప్తిరస్తు…
Share this Article