గుడి ముందు పెద్ద నంది విగ్రహం… ఓహ్… అయితే ఇది శివుడి గుడే కదా అనుకుని హరోంహర అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్తామా..? అచ్చం శ్రీ విష్ణు స్వరూపుడైన రంగనాథుడు పడుకుని ఉన్నట్టుగా ఓ శిల్పం… అదీ ఓ స్త్రీమూర్తి ఒడిలో పడుకుని… నీలమేఘశ్యామ వర్ణం… అచ్చం విష్ణువు విశ్రమిస్తున్నట్టుగా ఉంటుంది… నాలుగు చేతులు, శంకుచక్రాలు… మరి గుడి ఎదురుగా ఈ నంది ఏమిటి..?
అవును… మనం ఎక్కడికి వెళ్లినా సరే, శివుడు లింగస్వరూపుడిగానే కనిపిస్తాడు… మానుషరూపం ఉండదు… కానీ ఈ గుడి విశిష్టత వేరు… శివుడు ఆ పార్వతి ఒడిలో విశ్రమిస్తున్నట్టుగా కనిపిస్తాడు… భోగశయన శివుడు అంటారు… ఎక్కడో కాదు… ఇది తెలుగు నేలపైనే ఉంది… చిత్తూరు జిల్లాలో… ఊరిపేరు సురుతాపల్లి…
Ads
ముందుగా మనకు నమ్మాలనిపించదు… మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ఓ ఆధ్యాత్మిక చర్చాపుస్తకం ప్రయాణం చదువుతుంటే హఠాత్తుగా ఈ గుడి ప్రస్తావన దగ్గర మన కళ్లు ఆగిపోతాయి… ఆలోచనలో పడిపోతాం… నిజమే కదా… శివుడు మనిషి రూపంలో, అదీ విష్ణువు భంగిమలో నిద్రిస్తున్నట్టుగా ఉండటం ఏమిటి అని…
దీనికి ఓ కథ ఉంది… క్షీరసాగర మథనం తరువాత ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు తాగేస్తాడు… అది కంఠంలో ఆగిపోతుంది… తిరిగి కైలాసానికి వెళ్తుంటే ఆ విష ప్రభావం కొంత కనిపించి, శివుడు నీరసపడిపోతాడు… ఇదుగో ఇక్కడే తను పార్వతి ఒడిలో కాసేపు విశ్రమిస్తాడు… శివుడి పరామర్శకు ఇతర దేవుళ్లందరూ వచ్చి దగ్గరే నిల్చుండి, తను ఎప్పుడు మేల్కొంటాడా అని నిరీక్షిస్తుంటారు…
దీన్ని పల్లికొండేశ్వర గుడి అనీ, ప్రదోష క్షేత్రం అని కూడా పిలుస్తారు… పార్వతి పేరు సర్వమంగళాంబిక… గుడిలో దాదాపు ప్రముఖ దేవుళ్లు, రుషులు, నవగ్రహాలతోపాటు ఆదిశంకరుడిగా మరో రూపంలో కూడా శివుడు కనిపిస్తాడు… మనకు మన తెలుగు నేలపై ఉన్న గుళ్ల విశేషాలే పూర్తిగా తెలియవని ఇప్పుడు తెలుస్తోంది… చిన్న గుడే… ప్రశాంతంగా… విశిష్టంగా… విభిన్నంగా… శివుడు కొత్తరూపంలో ఉండటమే ఈ గుడి దర్శనాసక్తికరం…!
Share this Article