పార్లమెంటు భవనం మీద కొలువు తీరిన నాలుగు గర్జించే సింహాల వివాదం తాలూకు రాజకీయ కువిమర్శలు, అర్ధజ్ఞానాలు, శుష్క పాండిత్యాలు, వితండవాదాలను కాసేపు పక్కన పెడదాం… కొన్ని నిజాల్ని మాట్లాడుకుందాం… అంగీకరించేవాడు అంగీకరించనీ… లేదంటే పోనీ… ఎలాగూ జాతీయ మీడియా వివాదంలో ఇంకాస్త పెట్రోల్ పోస్తుందే తప్ప, అసలు వాస్తవాలు ఇవీ అని చెప్పదు… మన పార్టీలు సరేసరి… మన లీడర్ల విజ్ఞత ఎప్పుడూ మత్తళ్లు దూకుతూ ఉంటుంది కదా… సోషల్ భూతాలు సరేసరి…
సరే, విషయానికి వస్తే… ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో తూర్పు గోదావరి జిల్లా, తొండంగి మండలం, కొత్తపల్లిలో జరిపిన తవ్వకాల్లో ఒక ధర్మచక్రాన్ని కనిపెట్టారు… బయటికి తీశారు… మన జాతీయ జెండాలో భాగమైన ధర్మచక్రంలో 24 ఊచలు ఉంటాయి కదా, కానీ ఆ ధర్మచక్రానికి స్పూర్తిగా తీసుకున్న అసలైన అశోకుడి ధర్మచక్రంలో మాత్రం 32 ఉన్నాయి… అంతకుముందు కర్నాటకలోని కనగనహళ్లి- సన్నతిలో, నేపాల్‌లోని లుంబినిలో కూడా ఇలాంటి చక్రాలే బయటపడ్డాయి…
Ads
అశోకుడి సింహస్థంభం, నాలుగు సింహాల ప్రతిమలో ఒకటి ఇలాంటి ధర్మచక్రమే ఉంటుందనీ, వాటి దిగువన నాలుగు జంతుబొమ్మల నడుమ చక్రాల్లో మాత్రం 24 ఊచలు మాత్రమే ఉంటాయనీ అప్పట్లో పురాతన నిపుణులు ఏవో వివరణ ఇచ్చారు… మరి అశోకుడి ధర్మచక్రాన్ని మనం మన జాతీయ చిహ్నంగా స్వీకరించినప్పుడు 32 తీసుకోవాలి గానీ, 24 తీసుకోవడం ఏమిటనే డౌట్ వస్తుందా..? అదేకాదు, సారనాథ్ దగ్గర జరిపిన తవ్వకాల్లో బయల్పడిన నాలుగు సింహాల ప్రతిమకూ, మనం జాతీయ చిహ్నంగా అడాప్ట్ చేసుకున్న బొమ్మకు నడుమ కూడా బోలెడు తేడాలు ఉంటాయి,.,
నిజానికి నాలుగు సింహాల బొమ్మలో సింహాలకు దిగువన ధర్మచక్రం ఉన్నట్టు మన జాతీయ చిహ్నం సూచిస్తోంది కదా… నిజానికి ఏ ఒరిజినల్ ప్రతిమను మనం అడాప్ట్ చేసుకున్నామో, ఆ బొమ్మకు పైన ధర్మచక్రం ఉంటుంది… ఇప్పటికీ మీరు గమనిస్తే మన సుప్రీంకోర్టు అధికారికంగా వాాడే లోగోలో కూడా నాలుగు సింహాల పైన ధర్మచక్రం ఉంటుంది…
అప్పుడెప్పుడో అశోకుడి కాలం నాటి బొమ్మలివి… వాటి ఉద్దేశాలేమిటో, ఏ సందర్భాల్లో వాటిని ఏర్పాటు చేశారో చరిత్రలోకి వెళ్లకుండా… అసలు మన ప్రభుత్వం 1950లో అడాప్ట్ చేసుకున్న బొమ్మ ఒరిజినల్ బొమ్మలాగే ఉందా అనేది ఓసారి చూడాలి… ఆ బొమ్మను చూస్తే ఒరిజినల్ బొమ్మలో సింహాలు గర్జిస్తున్నట్టుగా రౌద్రంగా ఉన్నాయా..? లేక మనం ఎప్పుడూ వాడుతున్నట్టు మామూలు సింహాలా… అర్థమవుతుంది..!
ఇది సారనాథ్‌లో లభించిన సింహస్థంభం మీది నాలుగు సింహాల బొమ్మే… వాటి వివరణ కూడా… ఇందులో సింహాలు కూడా ఇప్పుడు పార్లమెంటు కొత్త భవనం పైకప్పు మీద ప్రతిష్టించిన సింహాల్లాగే నోళ్లు తెరిచి, కోరలు చూపిస్తూ, రౌద్రంగా ఉన్నాయా..? అలాగే అనిపిస్తోందా..? సరే, సారనాథ్ మ్యూజియంలో ఉన్న ప్రతిమలు వాటి వివరాలూ చూద్దాం ఓసారి… ఇదుగో…
అప్పట్లో ప్రభుత్వం సారనాథ్ అశోకుడి సింహాల బొమ్మను జాతీయ చిహ్నంగా తీసుకుందామని నిర్ణయించింది… దాన్ని డిజైన్ చేసే బాధ్యతను దీనానాథ్ భార్గవకు అప్పగించారు… మనం ఇప్పుడు వాడుతున్న చిహ్నాన్ని డిజైన్ చేసింది ఆయనే… ధర్మచక్రంలోని 32 ఊచలకు బదులు 24 మాత్రమే తీసుకున్నాడు… చిన్న చిన్న మార్పులేవో చేశాడు…
అప్పట్లో రాజ్యసభ సభ్యుడు, విద్యావేత్త, చరిత్రకారుడు రాధాకుముద్ ముఖర్జీ ఈ మార్పులను నెహ్రూ దృష్టికి తీసుకెళ్లాడు… నెహ్రూ తేలికగా తీసుకుని, దీనానాథ్ భార్గవ డిజైన్ చేసినదాన్నే ఖాయం చేశాడు… 2000 సంవత్సరంలో కూడా ఈ ధర్మచక్రం ఊచల సంఖ్యపై లోకసభలో చర్చ కూడా జరిగింది… కానీ అశోకుడి సింహస్థంభాన్ని స్పూర్తిగా తీసుకుంటామే తప్ప యథాతథంగా తీసుకోలేదు కాబట్టి అది పెద్దగా వార్తల్లోకి కూడా రాలేదు… ఇప్పుడు మోడీ దాన్ని ఆవిష్కరించాడు కాబట్టి… అవి గర్జిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి… వివాదం… అంతే… అవునూ, ఈ ఒరిజినల్ బొమ్మలో సింహాలు నోళ్లు తెరుచుకుని ఉన్నాయా..? మూసుకుని ఉన్నాయా..? కోరలు కనిపిస్తున్నాయా..? దాచుకున్నాయా..? రౌద్రం ఉందా..? శాంతం ఉందా..?
Share this Article