Nancharaiah Merugumala….. రాజ్యసభకు నామినేటైన ‘ఆ నలుగురూ’ అబ్రాహ్మణులే! బ్రాహ్మణ–బనియా ముద్ర వేగంగా ‘చెరిపేసుకుంటున్న’ కాషాయపక్షం… కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం మరో గొప్ప పనిచేసింది. రాష్ట్రపతి కోటాలో తాజాగా రాజ్యసభకు నామినేట్ చేయించిన నలుగురు దక్షిణాది ప్రముఖులూ బ్రాహ్మణేతరులే. వారిలో ఇద్దరు రైతు కులాలకు (కమ్మ, బంట్) చెందినవారు కాగా, మిగిలిన వారిలో ఒకరు దళిత క్రైస్తవ కుటుంబం నుంచి ఎదిగినవారైతే, నాలుగో వ్యక్తి ఓబీసీ ఈళవ మహిళ.
కేంద్ర సర్కారు సిఫారసుతో ఇలా నామినేట్ అయ్యేవారిలో సాధారణంగా బ్రాహ్మణులు, ఇతర ఉన్నత హిందూ వర్ణాలవారే గతంలో ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో, గుజరాత్, మహారాష్ట్రలో బ్రాహ్మణేతర నేతలకే బీజేపీ ముఖ్యమంత్రి పదవులు కట్టబెడుతోంది. ఇంకా ఇలాంటి అనేక చర్యల ద్వారా ఇది వరకు తన పూర్వ రూపం భారతీయ జనసంఘ్ కు, తనకు ఉన్న బ్రాహ్మణ–బనియా (వైశ్య) పార్టీ అనే ముద్రను శరవేగంతో తుడిపేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల మహారాష్ట్రలో తన బ్రాహ్మణ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చూబెట్టే అవకాశమొచ్చినా ఓబీసీ ప్రధాని మోదీ, స్వయం ప్రకటిత ‘చతుర్ బనియా’ అమిత్ షా ఆ పనిచేయలేదు. శూద్రుడైన ఏక్‌నాథ్ శిందేనే మహాగద్దెనెక్కించారు ‘పెద్ద మనసు’తో. తాజాగా నలుగురు బ్రాహ్మణేతర ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయడం కూడా బీజేపీ అనుసరిస్తున్న ‘అబ్రాహ్మణీకరణ’ ప్రక్రియలో భాగంగా కనిపిస్తోంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సైతం బీజేపీ ఎక్కువ మంది శూద్రులు, ఓబీసీలను గెలిపించింది. కాంగ్రెస్ మాత్రం తన పాత ఫక్కీలో బ్రాహ్మణ వీర విధేయులకే (ప్రమోద్ తివారీ, రాజీవ్ శుక్లా, రంజీతా రంజన్) పెద్ద పీట వేసింది.
Ads
నార్ల వెంకటేశ్వరరావు తర్వాత కమ్మ మేధావి కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్
––––––––––––––––––––––––––––––––––––––––
ఆధునిక తెలుగు దినపత్రికలకు సంబంధించి తొలి, చివరి సంపాదకుడిగా కొందరు కీర్తించే నార్ల వెంకటేశ్వరరావు గారిని వరుసగా 1958, 1964లో జవాహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ కేంద్ర సర్కారు రాజ్యసభకు నామినేట్ చేసి పంపింది. పాశ్చాత్య ప్రపంచంపైన, పశ్చిమ దిక్కు నుంచి వచ్చిన సిద్ధాంతాలపై గొప్ప అవగాహన ఉన్న ప్రఖ్యాత రచయిత, ఎడిటర్ అయిన నార్ల తెలుగుజాతికే గర్వకారణంగా చెప్పుకోదగ్గ మేధావి. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్‌లో జన్మించిన నార్ల కుటుంబానిది కృష్ణా జిల్లా కౌతవరం.
సాధారణ కమ్మ రైతు కుటుంబంలో ఆయన ఎదిగి పైకొచ్చారు. ఆ తర్వాత కమ్మ కులానికి చెందిన మేధావులెవరినీ ఏ కేంద్ర ప్రభుత్వమూ పెద్దల సభకు రాష్ట్రపతి కోటాలో పంపలేదు. మళ్లీ ఐదు దశాబ్దాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ కోటాలో (గోదావరి) కమ్మ వర్గానికి చెందిన ప్రసిద్ధ సినిమాల కథా రచయిత కోడూరి విశ్వ (కేవీ) విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభకు పంపడం నిజంగా గమనించదగ్గ పరిణామం. సూపర్ హిట్ అయిన తెలుగు సినిమాలకే కాక ‘బజ్రంగీ భాయ్ జాన్’ అనే హిందీ సినిమాకు కథ సమకూర్చిన విజయేంద్ర ప్రసాద్ దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ ప్రజల మధ్య తేడా పెద్దగా లేదనే విషయం ప్రాచుర్యం పొందడానికి ఓ మేర కారకులయ్యారు.
తమిళనాడుకు చెందిన ఇళయరాజా కమ్యూనిస్టు మూలాలున్న దళిత క్రైస్తవ కుటుంబంలో పుట్టి సినీ సంగీత జగత్తులో ఎవరూ అంచనా వేయలేనంత ఎత్తుకు ఎదిగారు. ఈ మధ్య నరేంద్ర మోదీని బాబాసాహబ్ బీఆర్ అంబేడ్కర్‌తో పోల్చి వివాదంలో చిక్కుకున్నా తన రంగంలో ఆయన గొప్పతనం తిరుగులేనిది.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం ధర్మాధికారి డీ వీరేంద్ర హెగ్గడే కూడా పై ఇద్దరిలా బ్రాహ్మణేతర కులంలో పుట్టారు. కర్ణాటక తీరంలోని తులూ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉండే బంటు (బంట్) అనే వ్వయసాయాధారిత కుటుంబం నుంచి వచ్చారాయన. అయితే, జైన మతాన్ని అనుసరించే బంటు కుటుంబం ఆయనది. సినీ తారలు ఐశ్వర్య రై, అనుష్క శెట్టి (షెట్టి) ఈ బంట్ కులంలో పుట్టినవారే.
కర్ణాటకలో 1970ల్లో కాంగ్రెస్ ‘ప్రగతిశీల’ ముఖ్యమంత్రి డి.దేవరాజ్ అరసు పాలనలో అమలు చేసిన భూసంస్కరణల ఫలితంగా అనేక మంది బంట్ కులస్తులు వందలాది ఎకరాల భూములు కోల్పోయి ముంబై, ఇతర మహారాష్ట్ర నగరాలకు వలసపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీవీ నరసింహారావుగారి కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రంగా ఉత్తుత్తినే అన్నట్టు భూగరిష్ఠ పరిమితి చట్టం అమలు చేసింది. కాని, కర్ణాటకలో క్షత్రియ కుటుంబంలో పుట్టిన దేవరాజ్ అరసు కట్టుదిట్టంగా ల్యాండ్ రిఫామ్స్ అమలు చేయడంతో భూములున్న బంట్ ధనిక రైతులు ఎకరాల ఎకరాల పొలాలు పోయాక ఇతర ప్రాంతాలకు, రంగాలకు ఎగబడ్డారు. వారు అనక రంగాల్లో ఎదగడానికి అరసు ఇలా పరోక్షంగా కారకులయ్యారు. పాత తరం విలన్ షెట్టి కొడుకు రోహిత్ షెట్టి ప్రముఖ దర్శకుడు ఇప్పుడు. చివరకు ముంబై అండర్ వరల్డ్ లో కూడా బంట్లు కనిపిస్తారు.
కేరళకు చెందిన పరుగుల రాణి పీటీ ఉష కూడా బ్రాహ్మణేతర కుటుంబం నుంచి పైకొచ్చిన మహిళ. ఆమె మలయాళీ ఓబీసీ కులమైన తియ్యా–ఈళవ కుటుంబంలో పుట్టారు. అప్పటి వరకూ క్రైస్తవ వర్గాల నుంచి వచ్చిన మహిళా అథ్లెట్లదే ఆధిపత్యం. హిందూ ఓబీసీ యువతి ఉష రాకతో క్రీడా ప్రపంచంలో కింది కులాలకు స్పేస్ పెరిగింది. మొత్తానికి, 2024 పార్లమెంటు ఎన్నికలకు రెండేళ్ల ముందు మోదీ–షా ద్వయం ఆచితూచి అడుగులేస్తోంది. నెహ్రూ– గాంధీ కుటుంబం మాదిరిగా అత్యంత విధేయులైన బ్రాహ్మణులకు (మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు డీపీ మిశ్రా, మోతీలాల్ వోరా, ఏపీ మాజీ సీఎం పీవీ నరసింహారావు, యూపీ మాజీ సీఎంలు కమలాపతి త్రిపాఠీ, ఎన్డీ తివారీ తదితరులు) వారి అర్హతలకు మించి పెద్ద పీట వేయకుండా తీసుకుంటున్న అన్ని జాగ్రత్తలూ లోక్ సభ ఎన్నికల్లో కాషాయపక్షానికి ఏమేరకు మేలు చేస్తాయో..?
Share this Article