బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్‌ను పైకి లేపాలంటే వేరే కంటెస్టెంట్లపై దుష్ప్రచారాలు చేయాలి… అదీ సోషల్ మీడియాలో… తద్వారా కొందరి వోట్లు పెంచడం, ఇంకొందరి వోట్లకు కత్తెర పెట్టడం ఓ స్ట్రాటజీ… బిగ్‌బాస్ వోట్ల కోసం కంటెస్టెంట్లు ముందుగానే పీఆర్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని మరీ హౌజులోకి వెళ్తుంటారు…
అదొక వ్యాపారం… సరే, ఎవరి కడుపునొప్పి వాళ్లది… కానీ ఈసారి కొత్త తరహా క్యాంపెయిన్స్ కనిపిస్తున్నాయి… ప్రాంతం, భాష, కులం, మతం… కన్నడ బ్యాచ్ తెలుగు కంటెస్టెంట్లను తొక్కేస్తున్నదట… అది తెలియక తెలుగువాళ్లే కన్నడ బ్యాచ్‌కు వోట్లు గుద్ది తెలుగు కంటెస్టెంట్లకు ద్రోహం చేస్తున్నారట… ఇదొక క్యాంపెయిన్ ఇప్పుడు…
నిజానికి మొదటి నుంచీ విష్ణుప్రియను మోస్తున్న కొన్ని సైట్లు, కొన్ని యూట్యూబ్ చానెళ్లు కొత్తగా ఈ ప్రచారం మొదలుపెట్టాయి… నిజానికి ఇవన్నీ ఏవీ పనిచేయవు… కాస్త అటూఇటూ ఆటతీరు, కాస్త అదృష్టం, టాస్కులు కలిసి వచ్చినవాళ్లే విజేతలు అవుతారు… కొన్నిసార్లు ఈ క్యాంపెయిన్స్ ఎదురుతన్నే ప్రమాదం కూడా ఉంది…
Ads
ఉదాహరణకు… గత సీజన్‌లో ఇదే బ్యాచ్ శివాజీని విపరీతంగా మోసింది… బిగ్‌బాస్, నాగార్జున కూడా శివాజీని బాగా పైకి లేపడానికి బాగా ప్రయత్నించారు… కానీ ఏం జరిగింది..? శివాజీ చతికిలపడిపోయి పల్లవి ప్రశాంత్ గెలిచాడు… సరే, తరువాత పల్లవి ప్రశాంత్ నిర్వాకాలు వేరే సంగతి… ఆట కలిసిరావడమే ముఖ్యం…
మెహబూబ్ వచ్చాడు… కమ్యూనిటీ వోటింగు చర్చకు తెరలేపాడు… ఏమైంది..? తనే వెళ్లిపోయాడు… తన ఆట తను ఆడుకుంటున్న నబీల్ బలమైన కంటెస్టెంటుగా అలాగే హౌజులో కొనసాగుతున్నాడు… గత సీజన్‌లో కావాలనే శోభాశెట్టి, ప్రియాంక, అమర్‌దీప్‌లను స్టార్‌మా బ్యాచ్ అని ముద్రవేసి టార్గెట్ చేశారు… లోపల శివాజీ, బయట తన పీఆర్ వింగ్…
శివాజీ అయితే వాళ్లను పురుగుల్లా తీసిపారేసేవాడు… తిట్టేవాడు… చివరకు ఏమైంది..? శివాజీ చేతులెత్తేశాడు… తన గుణమే బయటపెట్టుకున్నాడు… ఇప్పుడు కన్నడ బ్యాచ్ అంటూ క్యాంపెయిన్… సో వాట్… యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వి… ఎస్, వాళ్లు కన్నడిగులే… కానీ వాళ్లు నటించేది, ఆధారపడింది తెలుగు సీరియళ్లే…
వాళ్లే కాదు, తెలుగు టీవీ సీరియళ్లలో కన్నడ ఆర్టిస్టులదే హవా… మెరిట్ ఉంది, నెట్టుకొస్తున్నారు… కష్టపడుతున్నారు కూడా… హౌజులో కూడా ఆ నలుగురూ బలమైన కంటెస్టెంట్లు… హౌజులో గ్రూపులు ఎప్పుడూ ఉన్నాయి… ఉంటాయి… గ్రూపుల వారీ టార్గెట్లు కూడా సహజం… కానీ అంతిమంగా ఆటతీరే ముఖ్యం… ఈ సోకాల్డ్ కన్నడ బ్యాచ్ మొత్తం సంభాషణ తెలుగులోనే… మంచి ప్లుయెన్సీ ఉంది…
ఒకరికొకరు సహకరించుకుంటారు… కలిసి వేరేవాళ్లను టార్గెట్ చేస్తారు, నామినేట్ చేస్తారు… ఆటలో భాగమే… కూటమిగా ఒక ఆట… మళ్లీ వాళ్లలోవాళ్లకు పోటీ కూడా… బిగ్‌బాస్ అంటేనే అది కదా… టార్గెట్ చేసినా సరే అంతిమంగా జనం వోట్లే కదా నిలబెట్టేది, పొగబెట్టేది… ఉదాహరణకు మణికంఠ… తనను వీళ్లు టార్గెట్ చేశారే అనుకుందాం… కానీ మధ్యలోనే డీలాపడిపోయి, పోరాడలేక పారిపోయింది తనే కదా… జనం వోట్లు వేసినా ఉండలేకపోయాడు కదా…
వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన ఎనిమిది మందిలో మెహబూబ్ పోయాడు, నయని పవని కూడా రేపు పోవచ్చు… మిగతావాళ్లే కలిసి ఉండరు… హరితేజ దూరదూరం… గంగవ్వను వదిలేస్తే తేజ, అవినాష్, రోహిణి మాత్రమే కాస్త కలిసి ఆడుతున్నారు… అలా పోటీపడటమే తప్ప కన్నడ, తెలుగు వర్గపోరాటాల ప్రచారం దేనికి..?
వాళ్లది లాంగ్వేజీ కూటమే అయితే సోనియా ఎందుకు ఆ గ్రూపులో ఉంది… యష్మి తరచూ ఎందుకు వాళ్లతోనే కొట్లాడుతూ ఉంటుంది… గత సీజన్‌లో శోభాశెట్టి మీద నెగెటివిటీని పెంచిన పీఆర్ టీమ్స్ ఈసారి యష్మిని టార్గెట్ చేశాయి… అంతే తేడా…
పృథ్వి మెంటల్ కేసు… కానీ గేమ్స్, టాస్కుల్లో మిగతావారితో పోటీపడతాడు, పోరాడతాడు… నిన్న పానీపట్టు టాస్కులో యష్మి, ప్రేరణ బాగా ఆడారు… గెలుపు, ఓటమి వేరు… ఎలా ఫైట్ చేశారనేదే ముఖ్యం… ఈ నిఖిల్‌తోనే వాళ్లు గొడవపడింది… ఇక నిఖిల్ విషయానికి వస్తే నిన్ననే చెప్పుకున్నాం కదా, ధోని టైపు… తను పార్టిసిపేట్ చేసే టాస్కుల్లో దాదాపు 80 శాతం తనే గెలుస్తున్నాడు…
తను భీమసేనుడిలా దూకుడుగా, కండబలంతో దూసుకుపోవడం కాదు, కాస్త స్ట్రాటజీ అమలు చేస్తాడు… ప్రస్తుతం హౌజులో ఉన్నవాళ్లలో తనే బలంగా కనిపిస్తున్నాడు… వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక అవినాష్ తనకు ఓ బలమైన పోటీదారు దొరికాడు… నబీల్ కూడా తక్కువేమీ కాదు… తన ఆకారం తనకు అడ్డంకి కానీ టేస్టీ తేజ కూడా పర్లేదు… మంచి పోటీ ఇస్తున్నారు… ఇక ఇందులో తెలుగువాళ్లను తొక్కేయడం ఏముంది..?
నిఖిల్, యష్మి, ప్రేరణ తరచూ వోటింగుల్లో టాప్ ప్లేసులో ఉంటున్నారు… అంటే జనానికి వాళ్ల ఆట నచ్చిందనే లెక్క… అదే విష్ణుప్రియ టాస్కుల్లో పేలవమైన ఆట కనబరుస్తోంది… నత్తి బ్రెయిన్… మొన్న నబీల్, గౌతమ్ కారణంగా ఆమెకు మెగాచీఫ్ దక్కింది గానీ ఆమె సొంత తెలివేమీ లేదు… చివరకు వాళ్లనే నామినేట్ చేసిపారేసింది ఆమె… దాంతో కాస్తోకూస్తో ఆమె పట్ల ఉన్న పాజిటివిటీని ఆమే మంటకలుపుకుంటోంది…
ఐనా కన్నడ, తెలుగు ఏమిటి..? అది ఆట..? ఐపీఎల్‌లాగా ఎంజాయ్ చేయడమే..!! ఐపీఎల్ జట్లు పేరుకే నగరాల పేర్లతో ఉంటాయి… దేశదేశాల క్రికెటర్లు ఉంటారు… వాళ్లు రేసుగుర్రాలు… వాటిని కొన్న వ్యాపారులు గోదాలోకి దింపి ఆడిస్తారు… సో, అసలైన ఆట ఆడేది పెట్టుబడిదారులు… రేస్, అంటే జాతి ఏదైతేనేం… ఏ గుర్రం దూకుడుగా పరుగు తీస్తుందో అదే విజేత..!!
Share this Article