Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దింపుడు కల్లం ఆశలు… బాలాసోర్ శవాల్లో కొన్ని బతికొచ్చాయి…

June 8, 2023 by M S R

Still Alive: అంత్యక్రియలు ఒక సంస్కారం. చాలా శ్రద్ధతో చేసేది లేదా చేయాల్సింది కాబట్టి శ్రాద్ధం. ఆచారాన్ని బట్టి పూడ్చడం, కాల్చడం రెండే పద్ధతులు. భారతీయ సంప్రదాయంలో అంత్యక్రియలు రకరకాలు. ఆ వివరాలన్నీ ఇక్కడ అనవసరం.

హిందూ సంప్రదాయంలో శవాన్ని అంత్యక్రియల కోసం శ్మశానం దాకా తీసుకెళ్లాక నేరుగా చితి మీదో, తవ్విన గోతిలోనో పెట్టడానికి వీల్లేదు. పాడెను దించాలి. కట్లు విప్పాలి. చనిపోయిన వ్యక్తి చెవిలో అంత్యక్రియలు చేసే వ్యక్తి పేరు పెట్టి లేదా బతికి ఉండగా ఏ బంధుత్వంతో పిలిచేవారో అలానే మూడు సార్లు పిలవాలి. ప్రదక్షిణ చేస్తూ మళ్లీ మళ్లీ పిలవాలి. అలా మూడు సార్లు పాడెను ఎత్తుతూ…దించుతూ…చెవిలో పిలుస్తూ…చివర చితి మీదికో, గుంతలోకో తీసుకెళతారు. ఈ మొత్తం ప్రక్రియను “దింపుడు కల్లం ఆశ” అంటున్నాం. అదేమిటో తెలియకపోయినా…జరగదని తెలిసి తెలిసి చివరి ప్రయత్నంగా చేసే పనిని దింపుడు కల్లం ఆశ అని అనాదిగా ఒక వాడుక మాటను ఉపయోగిస్తున్నాం.

ఎన్నో ఆచారాలు ఇప్పుడు మనకు పిచ్చిగా, అర్థం లేనివిగా అనిపించవచ్చు కానీ…ఆయా ఆచారాలు ఏర్పడినప్పుడు వాటి అవసరం చాలా ఉండి ఉంటుంది. కొంత కాలానికి అవి ఏవో ఒక తంతుగా మిగిలి ఉంటాయి. పాటించేవారు పాటిస్తుంటారు. లేనివారు లేదు.

Ads

ఒరిస్సా బాలాసోర్ రైలు ప్రమాదంలో ఇప్పటికి 288 మంది చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. రైలులో ప్రసరించే విద్యుత్ షాక్ కే నలభై మంది చనిపోయినట్లు విచారణలో తేలింది. దాదాపు వందకు పైగా శవాల ఊరు పేరు తెలియక, వారి బంధువులెవరూ ఇన్నాళ్లయినా రాక…సామూహిక అంత్యక్రియలు చేయడం తప్ప రైల్వే శాఖ ముందు మరో ప్రత్యామ్నాయం కూడా లేదు.

బాలాసోర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాల్లో నుండి ఇద్దరు సజీవంగా బయటపడ్డారు. ఇన్ని రోజుల తరువాత ఒక తండ్రి కొడుకు శవాన్ని గుర్తించడానికి…అతడి చేతి మీద ఉన్న పచ్చబొట్టును తడిమితే…అతడు బతికి ఉన్నట్లు తెలిసింది. మరో సందర్భంలో శవం అనుకుని పక్కకు జరపబోతే అతడు సిబ్బంది కాలు పట్టుకుంటే…బతికి ఉన్నట్లు తెలిసింది.

గుండెలు మెలిపెట్టే ఉదంతాలు ఇవి. మనిషి బతికి ఉండగానే శవాల గుట్టల్లో పడేసిన మన నిర్లక్ష్యమిది. పెను ప్రమాదాలు జరిగినప్పుడు మన అత్యవసర సేవల్లో వైఫల్యాలకు సాక్ష్యమిది. బతికి ఉండగానే నరకం చూపుతున్న సందర్భాలివి.

నాలుగయిదు రోజులు రాత్రి పగలు శవాల్లో శవంగా ఉండి…శివంగా ప్రాణంతో బయటపడడానికి వీరు యముడితో ఎంతగా పోరాడి…ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్నారో? మార్కండేయుడిలా యమపాశం ఎంతగా బంధిస్తున్నా… “చంద్రశేఖరమాశ్రయే మమ కిమ్ కరిష్యతి వై యమః- శివుడి కాళ్లు పట్టుకున్నాను…తొక్కలో యముడు నన్నేమి చేయగలడు?” అని పుణ్యమేదో మూటగట్టుకుని పెట్టి మరలా పుట్టినట్లున్నారు.

ఇద్దరో…ముగ్గురో…శవాల్లో నుండి ప్రాణాలతో బతికి వచ్చినందుకు సంతోషిద్దామా?
వారు బతికి ఉండగానే శవాల్లో పేర్చిన మన నిర్లక్ష్యానికి గుండెలు బాదుకుందామా?

అంత్యక్రియలకు ముందు పాడెను మూడుసార్లు దించి…చనిపోయినవారి పేరు పెట్టి చెవిలో గట్టిగా దింపుడు కల్లం తంతుగా…బతికి వస్తారేమో అన్న ఆశతో పిలుస్తాము కానీ…
బతికి ఉన్నవారిని పేరు పెట్టి పిలిచి…ప్రాణాన్ని నిలబెట్టలేకపోతున్నాం.

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

బాలాసోర్ లో మృత్యుంజయులు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions