1984… రెండు పేర్లు దేశమంతా మారుమోగాయి… ఇందిర హత్య బాపతు సానుభూతి పవనాలు బలంగా వీచిన ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు గెలుపొందింది… అప్పటికి బీజేపీ పార్టీ ఏర్పడి నాలుగు సంవత్సరాలే… పార్లమెంటులో బీజేపీ తరఫున తొలిసారి అడుగుపెట్టిన ఆ ఇద్దరిలో ఒకరు చందుపట్ల జంగారెడ్డి… ఆయన ఏకంగా పీవీనరసింహారావుపైనే గెలిచాడు హన్మకొండ సీటు నుంచి..! మరొకరు ఎంకే పటేల్, గుజరాత్‌లోని మెహసానా సీటు…
కొన్నిసార్లు ఆశ్చర్యమేస్తుంది… ఇద్దరిదీ అరవైల నాటి జనసంఘ్ నేపథ్యమే… అయితే జీవితమంతా పార్టీకే కట్టుబడి ఉన్నా సరే జంగారెడ్డిని పార్టీ అస్సలు పట్టించుకోలేదు… కానీ పటేల్ ప్రస్థానం ఇండిపెండెంటుగా స్టార్టయింది… జంగారెడ్డికన్నా లేటుగా… పటేల్ వయస్సులో నాలుగైదేళ్లు పెద్ద… 1967లోనే జంగారెడ్డి పరకాల నుంచి ఎమ్మెల్యేగా జనసంఘ్ నుంచి గెలిచాడు… తరువాత ఒక ఓటమి, ఆతరువాత శాయంపేట నుంచి గెలుపు… పటేల్ రాజకీయ జీవితం 1975లో స్టార్టయింది… బీజేపీ పార్టీ ఏర్పడ్డాక అందులో చేరాడు… తనకు జనసంఘ్ నేపథ్యం ఉన్నా, ఒక దఫా గుజరాత్ రాష్ట్ర చీఫ్‌గా ఉన్నా సరే… తన మొదటి ఎన్నికల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థే…
జంగారెడ్డి అంతకుముందు టీచర్… తండ్రి కమ్యూనిస్ట్… పటేల్, వృత్తిరీత్యా వైద్యుడు… 1984… ఇద్దరికీ ఎంపీలుగా పోటీచేయాలని పార్టీ ఆదేశం… అద్వానీలు, వాజపేయిలు కూడా ఓడిపోయిన ఆ ఎన్నికల్లో గెలిచింది వీళ్లిద్దరే… నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ అనంతరం ఏపీలో ఫుల్లు తెలుగుదేశం హవా వీస్తోంది… అప్పటికి ఎన్టీయార్ చరిష్మా బాగా ఉంది… హన్మకొండలో జంగారెడ్డి గెలుపు సుసాధ్యమైంది…
Ads
ఇక ఆ తరువాత 1989, 1991, 1996… వరుసగా జంగారెడ్డికి ఓటమే… పార్టీ ఇక ఎప్పుడూ ఆయన్ని పట్టించుకోలేదు… గవర్నర్ పదవో, రాజ్యసభ సభ్యత్వమో ఆశించినా ఏమీ దక్కలేదు… చివరకు నోరు విడిచి అడిగాడు పలుసార్లు… అసలు అమిత్‌షా అయితే మాట్లాడేవాడే కాదు… జంగారెడ్డి అది గుర్తుచేసుకుని బాధపడేవాడు తప్ప, ఎప్పుడూ వేరే పార్టీ అనే ఆలోచన చేయలేదు, జీవితాంతం రాజకీయంగా కాషాయానికే కట్టుబడి ఉన్నాడు…
మరోవైపు పటేల్ కథ చూస్తే… 1984 ఎన్నికల్లో గెలిచాక… 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో వరుస గెలుపు… తరువాత 2000 సంవత్సరంలో రాజ్యసభ చాన్స్ ఇచ్చారు… వాజపేయి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా కూడా పనిచేశాడు… తను కేశూభాయ్ పటేల్ సన్నిహితుడు… పార్టీ వ్యతిరేక కార్యకలాపాల సాకుతో 2007లో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు… దాంతో సొంతంగానే ఓ పార్టీ పెట్టాలని అనుకున్నాడు… చివరకు మళ్లీ కాషాయతీరమే…
జంగారెడ్డితో పోలిస్తే పదవుల పరంగా పార్టీ పటేల్‌కు మంచి అవకాశాలనిచ్చింది… కేంద్ర మంత్రి దాకా, పార్టీ చీఫ్ పదవి దాకా… కానీ జంగారెడ్డికి తన సీనియారిటీ గానీ, తన విధేయత గానీ ఏమీ పార్టీకి కనిపించలేదు… చివరకు ఆ అసంతృప్తితోనే కన్నుమూశాడు… పటేల్‌కు ఇప్పుడు 91 ఏళ్లు… రాజకీయంగా ఎప్పుడో రిటైర్ అయిపోయాడు… ఆ ఇద్దరూ ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు అనిపిస్తున్నది కదా…!
Share this Article