అరె, ఈ సినిమా రాజ్‌తరుణ్ హీరోగా చేసింది కదా… హీరోయిన్ కూడా మాల్వీ మల్హోత్రా కదా… అదేనండీ, రాజ్‌తరుణ్ పాత సహజీవని లావణ్య పదే పదే అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తున్న హీరోయిన్… మరి వాళ్ల ఫోటో లేకుండా ఈ రాధా భాయ్ మన్నార్ చోప్రా మసాలా కవర్ ఫోటో పెట్టడం దేనికి అనే కదా డౌట్..?
మాల్వీ మల్హోత్రా అందంగానే ఉంది, కానీ ఆమె పాత్ర సోసో… రాజ్‌తరుణ్ ఆకర్షింపబడ్డాడు అంటే, పడే ఉంటాడు అనేలా ఉంది… రాజ్‌తరుణ్ పాత్ర కూడా పెద్ద ఇంటెన్సివ్‌గా లేదు… ఇంటాబయటా తను ఎదుర్కొంటున్న వివాదాలు, చికాకులతో తన మీద సానుభూతి కలుగుతున్న ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చేట్టుగా లేదు… నిష్ఠురంగా ఉన్నా నిజమే ఇది…
రాజ్‌తరుణ్ గ్రహచారం తిరగబడినట్టే ఉంది… ఈ సినిమా టైటిల్ ‘తిరగబడర సామీ’లాగే… అవునూ, మొన్నమొన్ననే కదా పురుషోత్తముడు సినిమా వచ్చింది తనది… మళ్లీ ఇప్పుడే ఈ సినిమా… అంటే, మార్కెట్‌లో తన సినిమాలే ఒకదానితో ఒకటి పోటీయా..? ఏదో రెండూ నాట్ ఇంప్రెసివ్ కాబట్టి సరిపోయింది… లేకపోతే ఫాఫం, పెద్ద క్లాషే ఉండేది…
Ads
సరే, మన్నార్ చోప్రా దగ్గర ఆగాం కదా… బిగ్‌బాస్‌లో భోలే షావలీ తెగ విసిగించాడు గానీ ఈ మసాలా సాంగు బాగానే రాశాడు, తనే మ్యూజిక్ కూడా… ఆ పిల్ల కూడా సాంగుకు తగినట్టు డాన్సాడింది… పాటలో కాస్త తెలంగాణ మార్క్ పదాలు కొన్ని పడ్డాయి… పర్లేదు… హుషారుగానే ఉంది… శ్రావణ భార్గవి గాయని… మరి సినిమా..?
అదే చెప్పుకునేది… రాజ్‌తరుణ్‌ది భిన్నమైన పాత్రే… కానీ బలమైన కేరక్టరైజేషన్ లేదు… హీరోయిన్‌తో ప్రేమ, ఈలోపు ఆమెను వెతుక్కుంటూ ఓ విలన్ గ్యాంగ్… ఎన్ని సినిమాల్లో చూడలేదు..? మకరంద్ దేశ్‌పాండేకు మంచి నటుడిగా పేరుంది… కానీ తననూ సరిగ్గా వాడుకోలేదు ఇందులో… పైగా లాజిక్కుల్లేని బోలెడు సీన్లు… నిజానికి రాజ్‌తరుణ్‌లో కూడా మంచి నటుడున్నాడు… కష్టపడగలడు… కానీ ఈ పాత్రలో అంత కష్టపడటానికి, ప్రూవ్ చేసుకోవడానికి పెద్దగా ఏమీ లేదు…
ప్రస్తుతం ప్రేక్షకుడిని థియేటర్ వరకూ రప్పించడం చాలా కష్టం… టీవీలు, ఓటీటీలు, వెబ్ సీరీస్‌లు, సీరియళ్లు ఏక్‌సేఏక్ అరచేతిలోనే బోలెడంత కాలక్షేపాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి… మరి టికెట్ రేట్లు, క్యాంటీన్, పార్కింగ్ దందాలు, ట్రాఫిక్కులు, కాలుష్యాలు గట్రా సిద్ధపడి థియేటర్ దాకా రావాలంటే కథలో, కథనంలో కొత్తదనం ఉండాలి, లేదా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ కోసమైనా రావాలి…
అలాంటప్పుడు ఇలాంటి సాదాసీదా చిత్రవీక్షణానికి ప్రేక్షకుడు వ్యయప్రయాసలకోర్చి థియేటర్ దాకా ఎందుకు రావాలి..? ఈ ప్రశ్న రాను రాను ఇండస్ట్రీకి బలమైన సవాల్… ఒకేసారి రెండు సినిమాల రిలీజు అనేది ప్లానింగ్ రాహిత్యమే… పైగా గబగబా సినిమాను చుట్టేసి వదిలేశారనే ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకుడికి… వెరసి నిజంగానే రాజ్‌తరుణ్ గ్రహచారం తిరగబడింది..!!
Share this Article