నేనూ నా మరదలు , పూర్వగాథ లాంటి కథలు రాసిన మానాపురం అప్పారావు పట్నాయక్ అనే పెద్దాయన నాటక రచయితకూడా. నాటకానుభవంతో సినిమాల మీద దండయాత్ర చేసి దర్శకుడుగా మారాడీయన. ఎన్టీఆర్ హరనాథ్ నటించిన పరువు ప్రతిష్ట, జమున గారు పాటపాడిన పెళ్లిరోజు, శోభన బాబుతో తారాశశాంకం, ఎన్టీఆర్ తోనే శాంత సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఇక్కడే ఓ విషయం చెప్పాలి లేకపోతే మర్చిపోతా … ఎన్టీఆర్ కు రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు రెండు అని నా అనుమానం. ఒకటి దేవుడు చేసిన మనుషులు, రెండు శాంత. ఈ శాంత సినిమాకు మానాపురం అప్పారావు దర్శకుడు. నిజానికి ఈ అప్పారావుగారి సోదరుడి గురించి మాట్లాడదామనే నా ఉద్దేశ్యం. ఆయనెవరూ అనే కదా మీ అనుమానం … ఆయన పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్ . పట్నాయక్ అంటే ఒరిస్సా బ్యాచ్ అనేవాడు మా సోదరుడు … ఈ సత్యనారాయణ పట్నాయక్ తెరమీదకు వచ్చేసరికి పేరు మార్చేసుకున్నాడు. తెర పేరు అమరనాథ్.
ఈ అమరనాథ్ పందొమ్మిది వందల ఇరవై ఐదులో రాజమండ్రిలో పుట్టాడు. రాజమండ్రిలోనే చదువు నడిపించాడు. టౌన్ మిడిల్ స్కూల్ హెడ్ మాస్టర్ పెమ్మరాజు రామారావు ప్రోత్సాహంతో తులాభారం నాటకంలో సత్యభామగా నటించారు అమర్ నాథ్. ఆడపాత్రల్లో స్టేజెక్కినోళ్లు తెలుగుతెర మీద వీరోలవుదురు అని చెబుతారట కదా … అట్టన్నమాట …
Ads
ఆ తర్వాత వరసగా నాటకాలు … లవకుశ నాటకంలో నటన చూసిన నిర్మాత కె.వి సుబ్బారావు తను నిర్మిస్తున్న జయప్రద సినిమాలో పురూరవ చక్రవర్తి పాత్ర ఆఫర్ చేశారు. ఈయన చేశారు. ఆ తర్వాత మళ్లీ తెరపిలుపులు రాకపోవడంతో … ఎందుకొచ్చిన గొడవ అని … ఉద్యోగం చూసుకుంటే బెటరనుకున్నాడు.
నలభై మూడులో ఇంటర్ పూర్తి చేసి వైజాగ్ సివిల్ సప్లయిస్ డిపార్డ్ మెంటులో రేషనింగ్ ఎంక్వరీ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరిపోయారు పాపం. ఎందుకొచ్చిన గొడవా ఆవటాని … అయితే నటన అనే పురుగు కుట్టాక ఊర్కే ఉండనీదు కాబట్టి వైజాగ్ లో నాటకాలు వేస్తూ పూర్ణా మంగరాజుతో బావుందనిపించుకున్నారు.
మంగరాజు నువ్విలా ఉండిపోతే నేను ఊరుకోను, నువ్వెట్టి పరిస్థితుల్లోనూ సినిమాల్లో ఉండాల్సిందే అని … ఇతన్ని తీసుకెళ్లి ఎల్ వీ ప్రసాద్ కు పరిచయం చేశాడు. ఈ కుర్రాడెవరో స్టేజీ మీద అదరగొట్టేస్తున్నాడు … మనమేటి చేత్తాం … నీకేమైనా పనికొత్తాడేమో అని తీసుకొచ్చా సూడు మరి … అన్జెప్పారు. అప్పుడు ఎల్వీ ఓ కుర్ర దర్శకుడి సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు పాపం… ఆ కుర్రడైరెక్టర్ యోగానంద్ . ఆ తర్వాత ఎన్టీఆర్ తో జీవితాంతం కొనసాగిన డైరెక్టర్ ఆయన. ఆయన తొలి చిత్రం అమ్మలక్కలులో కూడా ఎన్టీఆరే హీరో. అయితే ఎల్వీ దగ్గరకు వచ్చిన ఈ అమరనాథ్ అను కుర్రాణ్ణి చూసి ఇతనితో తమ్ముడు వేషం వేయించేస్తే పోతుందని చేయించేశారు.
అలా ఎన్టీఆర్ కు పరిచయం అయ్యారు అమరనాథ్. అమ్మలక్కలు తర్వాత నా చెల్లెలులో నటించారు. ఆదుర్తి తొలిచిత్రం అమరసందేశంలోనూ హీరోగా నటించారు. బాగా నటిస్తున్నాడనే పేరు సంపాదించుకున్నాడు. అమ్మలక్కలు పరిచయంతో ఎన్టీఆర్ తన సొంత సినిమా పిచ్చిపుల్లయ్యలో తనతో సమానమైన పాత్ర ఇచ్చి ఆదరించారు. అలా పాపులర్ అవడంతో … ఆడబిడ్డ, వదినగారి గాజులు, వరుడు కావాలి, వద్దంటే పెళ్లి లాంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
అమరనాథ్ లో కోపం ఎక్కువ … లౌక్యం బొత్తిగా లేదు … ఇలాంటి సమస్యల వల్ల … జీవితంలో ఎదగాల్సినంత ఎత్తుకు ఎదగలేకపోయారు పాపం. అని అంటారు ఆయన సమకాలీనులు. కోపం ఎక్కువ అవడంతో ఊరికూరికే కోర్టులో కేసులు వేసేవారు. మగవారి మాయలు అనే టైటిల్ తో తానే ఓ సినిమా తీసి, డిస్ట్రిబ్యూటర్ల మీద కేసులు వేశారు. అలానే తనతో సినిమాలు తీసిన నిర్మాతల మీద కూడా పెద్దగా మొహమాటం లేకుండా కోర్టులో కేసులు వేసేవారు.
ఈ కోర్టుల గోలేంట్రా భగమంతుడా అనుకున్న అందరూ ఆయన్ని పక్కన పెట్టేయడం ప్రారంభించారు. ఇట్టా లాభం లేదని విజయ నిర్మలతో బాలయోగిని అనే సినిమా తీయాలనుకున్నారుగానీ వర్కౌట్ కాలేదు. అనౌన్స్ మెంటూ అయ్యింది. కొంత షూటింగూ అయ్యింది ఫైనల్ గా ఆగిపోయింది. ఆయన కూతురు శ్రీ లక్ష్మి …
ఆయనకు ఇష్టం లేకపోయినా ఇంటి పరిస్థితుల కోసం నటిగా మారింది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన రాజా రాణీ జాకీ సినిమాలో చాలా సీరియస్ పాత్రలో రంగనాథ్ భార్యగా కనిపిస్తుంది. చాలా పద్దతైన పాత్ర. అయితే పెద్దగా నడవలేదు… హీరోయిన్ మెటీరియల్ అని కూడా ఒకరిద్దరు అనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు సాగాయి. కానీ తన నొసట భగవంతుడు కామెడీ రాశాడని అప్పటికి తెలీదు కదా పాపం… ఆ భగవంతుడు ఎవరో కాదు జంధ్యాలే.
జంధ్యాల కళ్లల్లో పడ్డ తర్వాత శ్రీలక్ష్మి వెనక్కి తిరిగి చూడలేదు. ఎక్కడికో వెళ్లిపోయింది. అదే సమయంలో … అమరనాథ్ కొడుకు రాజేష్ కూడా ఎంట్రీ ఇచ్చేసి జంధ్యాల దర్శకత్వంలోనే హీరోగా విలన్ గా నటించాడు. అమరనాథ్ పందొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవై రెండున కన్నుమూశారు. అప్పటికి రాజేష్ ఇంకా ఎష్టాబ్లిష్ కాలేదు ..
తర్వాత కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు. రాజేష్ విలన్ గా నటించిన సినిమాల్లో కూడా ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఉండేవంటే … నేను వాస్తవానికి హీరోని, కానీ పరిస్థితులు కలిసిరాక విలనేస్తున్నాను అన్నట్టుగానే నటించేవాడు. హీరోగా చేస్తున్న రోజుల్లోనే ఓ డాన్స్ అసిస్టెంట్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే రాజేష్ కూడా తండ్రి అమరనాథ్ లాగానే అకస్మాత్తుగా కన్నుమూశారు. రాజేష్ కూతురు ఇప్పుడు పాపులర్ సౌత్ హీరోయిన్ ఐశ్యర్యా రాజేష్ .. తమిళ తెలుగు సినిమాల్లో మంచి పేరే సంసాదించుకుంది. అదీ అమరనాథ్ అనబడే సత్యనారాయణ పట్నాయక్ కథ ….. By రంగావఝుల భరధ్వాజ్
Share this Article