Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డీజే అంటేనే మరణమృదంగం… పెళ్లి వేడుకల్లో ఈ చావులేంట్రా నాయనా..?!

March 14, 2023 by M S R

DJ Deaths:
“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః”
సంగీతానికి ఏ ప్రాణి అయినా కరిగి, తలలూపాల్సిందే. కాలకూట విషాన్ని కోరల్లో దాచుకున్న పాములయినా…సంగీతానికి పడగ విప్పి నాట్యం చేయాల్సిందే. అలాంటిది సామాన్య మానవులు సంగీతం కోసం చెవులు కోసుకోకుండా ఎలా ఉంటారు? తప్పకుండా కోసుకుంటారు.
అదే జరుగుతోంది లోకంలో.

డి జె దెబ్బకు ఆగిన వరుడి గుండె
బీహార్లో ఒక పెళ్లి పందిరి. రంగు రంగుల విద్యుద్దీపాలు. పూల అలంకరణతో పెళ్లి పందిరి కళకళలాడుతోంది. పెళ్లి కొడుకు మిత్రులు, బంధువులు పోగయ్యారు. ముహూర్తం రానే వచ్చింది. దండలు మార్చుకున్నారు. అంతే…ఆనందంతో పెళ్ళికొడుకు మిత్రులు డి జె సౌండ్ క్రమంగా పెంచుతూ స్టెప్పులు వేస్తూ తమను తాము మరచిపోయారు. అక్కడ వారు సౌండ్ కు లయబద్దంగా నాట్యం చేస్తుంటే…ఇక్కడ సౌండ్ ఉధృతికి పెళ్లి కొడుకు గుండె లయ తప్పింది.
“ఒరేయ్ నాయనా! గుండె ఆగేలా ఉందిరా! సౌండ్ తగ్గించండి. చచ్చేలా ఉన్నాను” అని పెళ్లి కొడుకు ప్రాధేయపడ్డాడు. విన్నవారు లేరు. క్షణాల్లో పెరిగిన సౌండుకు పెళ్లి కొడుకు గుండె ఆగింది. పెళ్లి పందిట్లో చావు మేళం మోగింది.

ఊరేగింపు మాట వ్యుత్పత్తి మీద భాషాశాస్త్రజ్ఞులకు ఎందుకో ఏకాభిప్రాయం కుదరలేదు. అసలు ఆ మాట “ఊరేగింపు” కాదు; అది “ఊరెరిగింపు”. కాలక్రమంలో పలకడంలో ఒకటి రెండు అక్షరాలు జారిపోతూ ఉంటాయి. ఊరికి ఎరిగింపు (తెలియజేయడం) కాస్త “ఊరేగింపు” అయ్యిందని ఒక వాదన. తెలుగు మాటలే దేవాతావస్త్రమయినప్పుడు ఇక మాటల వ్యుత్పత్తి గొడవ మనకెందుకు?

బరాత్ అంటే తెలుగులో పెళ్లి ఊరేగింపు. ఆ ఊరేగింపులో బాజా బజంత్రీలు, బాణా సంచా కాల్చడాలు, పూలు చల్లుకోవడాలు సహజం. యుగధర్మం ప్రకారం ఇప్పుడు డిజె తప్పనిసరి. గుండెలు అదిరి, చెవులు చిల్లులు పడి, చెవుల్లో రక్తాలు కారే ఆ డిజె విధ్వంసానికి రాత్రంతా ఊరేగింపులో వీధి నాట్యం చేయడం మర్యాదస్తులు విధిగా చేయాల్సిన పెళ్లి తంతు. మన భువనగిరికి వద్దాం…

భువనగిరి వీధుల్లో ఒక బరాత్ సాగుతోంది. డిజె పాటల మోతతో వీధి గుండె గుభేలుమంటోంది. అబ్బాయి- అమ్మాయి తరుపువారు అరమరికలు లేకుండా ఊగిపోతూ స్టెప్పులు వేస్తున్నారు. ఈలోపు ఫలానా పాట వేయాలని అబ్బాయి తరుపువారు…కాదు…కాదు ఫలానా పాటే…డిజె లో ప్లే చేయాలని అమ్మాయి తరుపువారు పట్టుబట్టారు. చినికి చినికి గాలివాన పెద్దయ్యింది. ఇరు పక్షాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే కర్రలతో కొట్టుకునే దాకా వెళ్లింది వారి సంగీత స్పర్ధ. రెండు వైపులా తలలు పగిలి రక్తాలు కారాయి. ఊరేగింపులో ఉన్న కార్ల అద్దాలు పగిలాయి. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొస్తుంది కాబట్టి ఈ పెళ్లి పోలీసులకు శాంతి భద్రతల సమస్యగా పరిణమించింది.

తలలదేముంది? పగిలితే…అతుక్కుంటాయి.
కార్ల అద్దాలదేముంది?
ఇన్సూరెన్స్ ఉంటే…కొత్తవి వస్తాయి.
భువనగిరి ఊరేగింపు డిజె లో పాటల పట్టింపు సమాజంలో సంగీతం పట్ల ఉన్న గాఢానురక్తిని రక్తాక్షరాలతో మరోమారు రుజువు చేసింది. సంగీతానికి చెవులే కోసుకోవాలని నియమేమీ లేదు. మెడ కోసుకున్నా సంగీతమేమీ అనుకోదు. పైగా తనకోసం పరస్పరం మెడలు కోసుకునే
ఆత్మాహుతి దళాలు ఉన్నందుకు గర్వపడుతుంది. సంతోషిస్తుంది. పులకిస్తుంది. నిలువెల్లా మురిసిపోతుంది.

రాజకీయ పార్టీల ర్యాలీలకు ముందుగానే పోలీసులు భద్రత ఏర్పాటు చేయడం ఆనవాయితీ. శాంతి భద్రతల దృష్ట్యా అవసరం కూడా. అలా పెళ్లి ఊరేగింపులు, డి జె లకు కూడా గట్టి పోలీసు భద్రత, పెళ్లి పందిళ్లలో డి జె సౌండులకు గుండెలు పగలకుండా గుండె వైద్యులతో అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయాల్సిన రోజులొచ్చాయి.

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions