ముందుగా ఓ కథ చదవండి… దాదాపు ఓ సినిమా కథలాంటిదే… యాభయ్యేళ్ల ఓ అమెరికా మహిళ తన అక్కతో పిచ్చాపాటీ మాట్లాడుతుంటే… ఆమె చెప్పింది మాటలమధ్యలో… మన తండ్రి మనకు నిజమైన తండ్రి కాదు అని…! ఈమె షాక్ తిన్నది… అర్థం కాలేదు మొదట… అదేమిటీ అని పదే పదే అడిగితే… మన తల్లికి చాలాకాలం పిల్లలు కలగకపోతే వీర్యదానం ద్వారా మనల్ని కన్నారు అని చెప్పింది… అప్పట్లోనే కృత్రిమ గర్భధారణ…
ఈ మహిళ పేరు జైమీ హాల్… తన తండ్రి మీద తనకెలాంటి కంప్లయింట్లూ లేవు… మంచి ప్రేమను పంచి ఇచ్చాడు… కానీ పేరెంట్స్ ఇద్దరూ మరణించారు… తన జెనెటిక్ ఫాదర్, అనగా బయాలజికల్ ఫాదర్ ఎవరో తెలుసుకోవాలని కోరిక పుట్టింది… నెత్తుటి జాడల అన్వేషణ…
… (భర్తతో హాల్)
యాభయ్యేళ్ల క్రితం తల్లి ప్రసూతి కాగితాలను బయటికి తీసింది… తల్లికి ప్రసవం చేసిన హాస్పిటల్, డాక్టర్ పేర్లున్నయ్… డాక్టర్ పేరు పీవెన్… తను ఉన్నాడో లేడో… మరెలా..? తన ద్వారా అయితే తన బయాలజికల్ ఫాదర్ వివరాలు తెలుస్తాయి అనుకుంది… ఆయన వివరాల కోసం వెతుకుతుంటే… కొన్ని వెబ్‌సైట్ల ద్వారా తన వంశవృక్షాన్ని శోధిస్తుంటే… డాక్టర్ పీవెన్ మనవడి ఆచూకీ దొరికింది… ఎందుకో డౌటొచ్చి డీఎన్ఏలను పోల్చి చూస్తే ఆ డాక్టర్ మనమడు, తను, అక్క… ముగ్గురి డీఎన్ఏ ఒకటే అని తేలింది…
(హాల్ బర్త్ సర్టిఫికెట్)
ఇంకాస్త లోతుల్లోకి వెళ్లింది హాల్… రెండేళ్లు కష్టపడింది… చివరకు తన తల్లికి ప్రసవం చేసిన డాక్టరే తన జెనెటిక్ ఫాదర్ అని తెలుసుకుంది… అంటే ఆ డాక్టరే తల్లికి వీర్యదానం చేసిన వ్యక్తి… తనను కలుసుకోవడానికి వెళ్లింది… ఆ డాక్టర్ వయస్సు ఇప్పుడు 104 ఏళ్లు… ఆయన్ని చూడగానే ఆమెకు ఓ భావోద్వేగం… తరువాత ఆయన చెప్పిన వివరాలు విని నిశ్చేష్టురాలైంది ఆమె… ఎందుకంటే..?
ఆ డాక్టర్ వద్దకు చాలామంది వచ్చేవాళ్లు… రకరకాల సమస్యలతో సంతానం కలగని దంపతులు… కృత్రిమ గర్భధారణపై అప్పట్లో చాలా ప్రయోగాలు సాగేవి… కౌంట్ తక్కువగా ఉండే వాళ్లకు తన వీర్యమే దానం చేసేవాడు… లేదా ఆ హాస్పిటల్‌లో పనిచేసే ఇతర డాక్టర్లు… కొన్ని వందల మందికి వాళ్లే తండ్రులు… జెనెటివ్ ఫాదర్స్… కొందరు తల్లులకు అసలు విషయమే చెప్పేవాళ్లు కాదు… సహజంగానే గర్భం వచ్చిందని ఆనందపడేవాళ్లు…
(ఈయనే డాక్టర్ పీవెన్…)
తను చేసింది తప్పు కాదంటాడు ఆయన… సంతానలేమి మహిళలకు ఓ శాపం… ఓ మంచి ఉద్దేశంతోనే వాళ్ల బాధను తీర్చాననేది ఆయన అభిప్రాయం… ఎవరిదో వీర్యం ఎందుకు..? ఎలాగూ వీర్యానికి దాత మీద ఆధారపడుతున్నప్పుడు తనయినా ఒకటే, బయటి వ్యక్తి అయినా ఒకటే… ఇదీ ఆయన పాయింట్…
ప్రసూతివైద్యంలో ఆయన నలభయ్యేళ్లు ఉన్నాడు… అంటే ఇలా ఎందరికి తను ‘జన్మనిచ్చాడో’ ఊహించుకోవాల్సిందే… దానికి లెక్కలు ఉండవు కదా… తన తండ్రే… కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది… కానీ డాక్టర్‌గా తను చేసింది హేయమైన పని అంటుంది హాల్… ఆ అనైతిక చర్యను తను ఏ రకంగానూ సమర్థించుకోలేడు అంటుంది ఆమె…
(డాక్టర్ పీవెన్‌తో హాల్)
ఇప్పుడు చెప్పండి… ఆ డాక్టర్ చేసింది కరెక్టా..? కాదా..? అనైతికమేనా..? బీజం ఎవరిదైతేనేం, ఆమె క్షేత్రం, ఆమె సంతానం అనేది ఆయన పాయింట్… కొందరి అభ్యంతరం ఏమిటంటే..? ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ (కృత్రిమ గర్భధారణ) వల్ల పుట్టిన సంతానం తమ బయాలజికల్ ఫాదర్ వివరాలు తెలుసుకునే ప్రయత్నమే సరికాదు అని…! కొందరు ప్రొఫెషనల్ వీర్యదాతలుంటారు, కొందరు అప్పటికప్పుడు స్వచ్ఛందంగా వీర్యాన్ని ఇచ్చినవాళ్లు ఉంటారు… చాలామంది వివరాలను హాస్పిటల్స్ భద్రపరచవు… తమ జెనెటిక్ మూలాల అన్వేషణకు ఆ సంతానం పూనుకుంటే కొత్త సమస్యలు, కొత్త మనోవేదనలు తప్ప సాధించేది ఏమీ ఉండదనేది కొందరి మాట…
(హాల్ చిన్నప్పుడు తన పేరెంట్స్‌తో…)
కానీ జెనెటిక్ రూట్స్ తెలుసుకోవాలనే కోరిక ఒకసారి కలిగిందంటే అది ఇక నిద్రపోదు… మనిషిని తరుముతుంది… పైగా తండ్రి ఆరోగ్యడేటా తెలిస్తే, సంతానానికి సంబంధించిన కొన్ని అనారోగ్యాలకు చికిత్స సులభమవుతుంది… బట్, ఆ అన్వేషణలో ఇలాంటి డాక్టర్ పీవెన్లు బయటపడితేనే కొత్త తల్నొప్పులు…
చివరగా… మరో ఉదాహరణ… Bertold Wiesner అనే ఓ బ్రిటిష్ బయాలజిస్టు ఇలాగే దాదాపు ఆరొందల మందికి జన్మనిచ్చాడు… Matteo Valles… ఈ అమెరికన్ ఏకంగా 114 మంది పిల్లల కోసం వీర్యాన్ని దానం చేశాడు… Joe Donor పేరు మాత్రమే తెలిసిన ఓ వీర్యదాత 150 మంది పిల్లలకు జెనిటిక్ ఫాదర్… Cecil Byran Jacobson… ఈ అమెరికన్ డాక్టర్ కూడా దాదాపు 75 మంది పిల్లలకు తండ్రి… సేమ్, పైన చెప్పిన పీవెన్ తరహాలోనే… ఇంకా ఎన్నో… ఎందరో….!!