పులిహోర… పక్కా ద్రవిడ వంటకం… సరే, సౌతిండియన్ వంటకం… పులియోగిరె, పులియోదరై, పులించోరు, పులిగోర, కోకుమ్ రైస్, చిత్రాన్నం… లేదా శానిగా ఇంగ్లిషులో లెమన్ రైస్, టామరిండ్ రైస్… అరె, నిమ్మ, చింతపండు ఏమిటి..? పులుపు తగలాలి… సులభంగా చేసుకోగలగాలి… దానికి వేరే ఆధరువులూ అవసరం లేకుండా ఉండాలి… కడుపుకు సౌకర్యంగా ఉండాలి… నో మసాలాస్, అనేకానేక ఇంగ్రెడియెంట్స్ ఉండకూడదు…
ఆగండాగండి… పులిహోర ఇతర రాష్ట్రాల్లో కూడా చేసుకుంటారు… కానీ వేర్వేరు పేర్లుంటయ్… అంతెందుకు..? గ్రీకు పద్ధతిలో చేసే పులిహోర కూడా కొన్నిచోట్ల పాపులరే… ఈజీటు కుక్… అన్నాన్ని ఆరబెట్టడాలు, తరువాత తాపీగా చింతపండు రసమో, నిమ్మరసమో కలపడం కాదు… పొయ్యి మీద నుంచి నేరుగా ప్లేటులోకే… ఆ వీడియో చూస్తుంటే కాస్త చికాకు, కాస్త ఇంట్రస్టు ఒకేసారి కలిగాయి…
మామూలుగా పులిహోర ఎలా కలుపుతాం… అన్నం వండేసి, బాగా చల్లబడేలా ఆరబోస్తాం… ఉప్పు కలుపుతాం తగినంత… విడిగా ఆవాలు, జిలకర, పల్లీలు, కరివేపాకు, కారం లేదా పచ్చిమిర్చి ముక్కలు (నాట్ అల్లం వెల్లుల్లి…) గట్రా కాస్త వేగేలా చేసి, నిమ్మరసమో, చింతపండు రసమో కూడా కలిపేసి… కాసేపటికి అన్నం మీద పోసేసి, ఎంచక్కా మొత్తం ఏకరీతిన కలిపేస్తాం… ఆ పులుపు ప్లస్ పల్లీలు… ఇది అందరూ సులభంగా చేసుకునే పులిహోర… చాలామంది తమకు అలవాటైన వేరే పద్ధతుల్ని కూడా పాటిస్తారు… కానీ బేసిక్ లైన్ ఇదే…
Ads
కానీ గ్రీకు పద్ధతి ఇలా కాదు… బయట ఆరబోయడం, తరువాత కలిపేయడం గట్రా ఏమీ ఉండవ్… పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో చేస్తారట ఇలా… నేరుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టి, కాస్త నూనె వేసి, అందులో చిటికెడు ఆవాలు శాస్త్రానికి… బాగా దంచుకున్న అల్లం వేసి, అందులోకి కాస్త జిలకర వేసి వేగనివ్వండి… చాలు, నో ఇతర మసాలాస్, నో వెల్లుల్లి… తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, ఒకటికి రెండు పాళ్ల నీళ్లతో బియ్యం కూడా అందులో వేసేయండి…
ఈ వీడియోల్లో కొత్తిమీర, మెంతులు అని చెబుతారు… కానీ వేసుకుంటే కాస్త కరివేపాకు చాలు… వాళ్లు పల్లీలు, పచ్చి మిర్చి, బెల్లం వేయరు… కానీ మనకు మన కడుపులు కూడా ముఖ్యం కాబట్టి, మనదైన టేస్టు ప్రధానం కాబట్టి… బియ్యం పోయడానికి ముందే పల్లీలు, ఒకింత బెల్లం ముక్క, కారం పొడి గానీ పచ్చి మిర్చి గానీ వేసుకోవాలి… తరువాత అందులోనే నిమ్మరసం కూడా కలిపి మూత పెట్టేయండి…
పది నిమిషాలాగి మూత తీసి… ఓసారి మొత్తం కలపాలి… నేరుగా ప్లేటులోకి తీసుకోవడమే వేడివేడిగా…. ఎవడైనా ప్రపంచంలో వేడి పులిహోర చేసుకుంటారా అని అంతగా ఆశ్చర్యపడకండి… వాళ్లిష్టం అది… పంజాబ్ కదా, తిక్క లేస్తే నెయ్యితో పోపు, పన్నీర్ కూడా వేసేస్తారు… గడ్డ పెరుగుతో రైతా చేసుకుంటారు కూడా… వాళ్ల స్టయిల్ వేరు… కానీ ఒకటి మాత్రం నిజం… ఇంత సులభంగా లెమన్ రైస్ ఇంకెలాగూ చేయలేం… యధావిధిగా కాస్త ఊరగాయను అంచుకు పెట్టుకుంటే… ఆహా…! ఈజీ డిషెస్ వండటం ఓ ఆర్టోయ్ మై డియర్ వెంకటేశం…!!
Share this Article