Priyadarshini Krishna….. పధ్నాలుగేళ్ళు – న్యాయపరిభాషలో అంటే యావజ్జీవ కారాగార శిక్ష… ఘోరాతిఘోరమైన హత్యలకు కూడా మన భారత శిక్షాస్మృతిలో ఇలాంటి శిక్ష చాలా అరుదు. వందమంది నేరగాళ్ళు తప్పించుకోవచ్చుగానీ ఒక్క నిర్ధోషి ఐనా శిక్షంపకూడదనేది మనం సాధారణంగా మాట్లాడుకునే మాట. అలాంటిది ఒక అన్నెంపున్నెం తెలీని ఒక అమ్మాయిని నాలుగ్గోడల మధ్య బంధించి ‘తనవారితో’ కలవనీకుండా, మాట్లాడనీకుండా వుంచడమే కాకుండా తనకుండే ప్రాధమిక అవసరాలైన తిండి బట్ట లాంటివి కూడా వారి కంట్రోల్‌లోనే పెట్టుకుని ఆమె జీవితాన్ని తమ నల్లబూట్ల కింద నలిపేసారు…. రెండు జతల బట్టలు, మూడు ముద్దలు, నాలుగు పరదాల మాటునే అని ఆమె జీవితాన్ని శాసించారు….
ఎస్…. ఇది కథ కాదు యదార్థం… ఎక్కడో కొండప్రాంతంలోనో లోయల్లోనో కాదు. అత్యంత ఎక్కువమంది సాహిత్యకారులను ప్రపంచానికి అందించిన విజయనగరంలో… సంస్కృతికి పెట్టింది పేరైన నగరంలో…
సుప్రియ అందరి అమ్మయిల్లాగానే అల్లారుముద్దుగా పెరిగి ఎంయే ఇంగ్లీష్ చదివి, ఎన్నో ఆశలతో పెళ్ళిచేసుకుని, కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టింది…. రెండేళ్ళు సజావుగా సాగిన సంసారం హఠాత్తుగా కాళ్ళ కింది భూమి ఎడారిలో ఇసకలాగ సర్రున జారిపోయి తానో అగాధంలోకి కూరుకుపోయాననే విషయం రోజురోజుకీ స్పురణకి వస్తోంటే …. తన స్వేచ్ఛ హరించిపోయిందనే విషయం అవగతమవుతూ వున్నా తానేం చెయ్యాలో …తానేం చెయ్యగలదో… అర్థమవని అంధకారంలోకి కుక్కివేసిన విషయం కూడా తాను తలుచుకోకుండా, తానో శాపగ్రస్థురాలినేమో లేదా తానేదో నేరం చేసి వుంటుందని అందుకే తనకీ శిక్ష వేసి ఉంటారని… దానిని అనుభవించడమే తన ధర్మమని సరిపెట్టుకుంది…
Ads
యేళ్ళకేళ్ళుగా చీకటికొట్టు జీవితంలో మగ్గిమగ్గి తన తోబుట్టువుని, తనని కనిపెంచిన వారిని చూడాలని మాట్లాడాలనే కోరికలకు తన ఆత్మలో పాటుగా సమాధి కట్టేసింది… ‘ఈ జీవితానికింతే’ అనుకుంది… అసలామెకి ఈ గతిపట్టించిన వారు- భర్త ,మరిది నిరక్షర కుక్షులు కారు, ఇతరులు జరిగే అన్యాయాల వకాల్తా పుచ్చుకుని న్యాయస్థానంలో వాదనలు వినిపించి, న్యాయాన్ని అందిస్తామని నల్లకోటు వేసుకున్న న్యాయవాదులు…
కానీ ప్రవృత్తి రీత్యా ‘కిరాతకులు’
తల్లి చెప్పిందని… పెళ్ళాడిన పిల్లని బానిసకంటే హీనంగా బంధించారు. పెళ్ళామంటే పనిచేసి, పడక సుఖమిచ్చి పిల్లల్ని కనే యంత్రమనే బూజుపట్టిన భావాలున్న వీరు న్యాయశాస్త్రాన్ని తాకడానికి కూడా అర్హులు కారు… పిల్లల్ని కనేప్పుడైనా సుప్రియ పుట్టింటి వారికి కబురు చెప్పకపోవడం, వారిని రానివ్వకపోవడం, ఆ పిల్లల్ని కూడా పురుగుల్ని పెంచినట్లు పెంచడం చూస్తుంటే అసలు వీరు మనుషులేనా అనే అనుమానం కలుగుతోంది…
సుప్రియ తల్లి పోలీసులను ఆశ్రయించి, సుప్రియను ఆ బందీఖానా నుండి విడిపించి, బైట ప్రపంచం ముందరకి తెచ్చింది.. పధ్నాలుగేళ్ళ తర్వాత సూర్యకాంతిని చూసిన సుప్రియ స్వేచ్ఛావాయువులు పీలుస్తానని అనుకోలేదు అని గద్గదస్వరంతో చెపుతోంటే చూస్తున్న మన కళ్ళు తడిబారక మానవు…
చీకటి కొట్టులోనే పద్నాలుగేళ్ళు మగ్గి, ముగ్గురు పిల్లల్ని కన్న సుప్రియ బ్రతికున్న శవంలాగా ఐపోయింది… శరీరంలోని సత్తువ పోయి, ప్రాణాలన్నీ కళ్ళలోనే నిలుపుకున్నట్లు మనకు స్పష్టంగా కనపడుతుంది… తాను కన్న పిల్లలే తనని అమ్మా అనకుండా వారి నాయనమ్మని అమ్మ అని పిలుస్తుంటే, ఎంత క్షోభని దిగమింగుకుందో తలచుకుంటేనే గుండె భారమవుతోంది….
అసలామె అంత నిస్సహాయురాలిగా మారిపోడానికి గానీ.., ఆమె భర్త, ఆ ఇంటివారు అలాంటి మానసిక దుస్థితిలో వుండటానికి కారణాలు గానీ ఇంకా ఇన్వెస్టిగేట్ చెయ్యాల్సి వుంది…. పిల్లల్ని కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని, వారి బుర్రలెంత పాడుచేసి వారినెంత అధోఃగతిపాలు చెయ్యడానికి బయలుదేరారో తల్చుకుంటేనే వళ్ళు గగుర్పొడుస్తోంది…
ఈ కేస్ లో కొన్ని అనుమానాలు, చాలా గ్యాప్స్ ఉన్నాయి. అమ్మాయి తల్లిదండ్రులు సంవత్సరానికోసారి రావడమో ఎవరినైనా పంపడమో చేస్తుంటే వారిని బూతులు తిట్టి కేసులు పెడతామని తిప్పి పంపేవారంట… అసలు సమాజమెటుపోతోంది… ఇరుగు పొరుగువారేమయ్యారు.. ఎంతసేపూ పక్కింట్లో ఏమవుతుందో ఆసక్తి చూపించే మన సమాజం ఈ విషయంలో ఎందుకు నిమ్మకుండి పోయింది…? ఆ ప్రబుద్ధుల కోలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడూ అడగలేదా…? పిల్లల ఫ్రెండ్స్ తాలూకా తల్లిదండ్రులైనా మీ అమ్మ ఏది అని ఆరా తియ్యలేదా…. వారికి రోజువారీ చదువులు హోవవర్కులు చెప్పేదెవరు…? ఆ ఇల్లు కూడా ఎంత దరిద్రంగా వుందో… ఒక హెల్తీ ఫామిలీ ఒక ఆరోగ్యకరమైన మనుషులుండే వాతావరణమే లేదు… వంటిల్లు కూడా చాలా గందరగోళంగా shabby గా అశుభ్రంగా వుంది…. ఇంటిని అమర్చుకున్న పద్ధతి బట్టి వారి మానసిక స్థితిని అంచనా వెయ్యవచ్చు… సుప్రియ కూడా మొదట్లో అన్నీ చక్కబెట్టినా రానురాను తన జీవితం మీద విరక్తితో అన్మీ వదిలేసి జీవచ్ఛవంలాగా బతికిందని అర్థమవుతోంది….!
హ్యూమన్ రైట్స్ వారు, మహిళా శిశుసంక్షేమం వారు మరియు కోర్టు జోక్యం చేసుకుని పిల్లల్ని వారి చెర నుండి విడిపించి ఆ ప్రబుద్ధుల డిగ్రీలను రద్దు చేసి, బార్ కౌన్సిల్ నుండి తక్షణమే డీబార్ చెయ్యాలి… తదుపరి శిక్షలు కూడా అంతకంత కఠినంగా వుండాలి…!
Share this Article