గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు… అంటాడు వేమన… ఫాఫం, రోజులు ఈ పద్యపాదాన్ని ఉల్టాపల్టా చేయబోతున్నాయని..! ఏమిరా, చదువుకోకుండా ఏం చేస్తున్నావు, గాడిదలు కాస్తున్నావా..? అని తిట్టేవాళ్లు గతంలో పెద్దలు… గాడిదలు కాయడమే పెద్ద పని అవబోతున్నదని వాళ్లకేం తెలుసు ఫాఫం..! వాడొక ఎదవ గాడిద, ఏదీ చేతకాదు అని కూడా తిట్టేవాళ్లు గతంలో… ఎందుకూ పనికిరాని వాడివిరా అనేందుకు… కానీ గాడిదలు కూడా బొచ్చెడు సంపాదించి పెట్టబోతున్నాయని వాళ్లకు తెలియదు కదా…
ఇంత ఉపోద్ఘాతం దేనికీ అంటే… ఓ రియల్ సక్సెస్ స్టోరీ చెప్పడానికి… ఇది భిన్నమైన సక్సెస్ స్టోరీ… సంపాదనకు భిన్నమైన మార్గం ఆలోచించేవాడు భేషజాలకు పోడు…, లోకనిందలకు, వెక్కిరింపులకు భయపడడు… తన బాటలో తను తలెత్తుకుని వెళ్లిపోతాడు అని చెప్పడానికి ఈ సక్సెస్ స్టోరీ… తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా, వానార్‌పేటకు చెందిన యు.బాబు పదకొండు దాకా చదువుకున్నాడు… ఇంట్రస్ట్ లేదు, డ్రాపవుట్… కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు… ప్చ్, థ్రిల్ కనిపించలేదు…
ఆలోచనల్లో ఏదో మెరిసింది… గాడిదలు పెంచితే ఎలా ఉంటుందీ అని..! తప్పేముంది..? డెయిరీ ఫామ్స్, పౌల్ట్రీ ఫామ్స్, పిగ్ ఫామ్స్, గోట్ ఫామ్స్‌లాగే డంకీ ఫామ్స్… తన ఆలోచన విని కొందరు నవ్వారు… కొందరు వెక్కిరించారు… కొందరు వద్దురా అని హితవు చెప్పారు… మొత్తానికి అందరూ కాళ్లకు అడ్డం పడ్డారు… కానీ బాబు వినలేదు… ఇంకాస్త ఆలోచించాడు…
Ads
స్టడీ చేశాడు… అందరూ గాడిదపాలు అంటారు గానీ ఆ పాలకు ఉపయోగాలు బాగా ఉన్నయ్… బెంగుళూరులో ఓ కాస్మెటిక్ కంపెనీ 28 రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటుంది… వాటి తయారీలో గాడిద పాలకే ఇంపార్టెన్స్… నెలకు వెయ్యి లీటర్లు కావాలి… అంత భారీగా సప్లయ్ చేసేవాళ్లు లేరు… వాళ్లే డంకీ ఫామ్ పెట్టుకోవాలనే ఆలోచనా రాలేదు… తమిళనాడు మొత్తమ్మీద ఉన్నవే రెండు వేల గాడిదలు… ఆడ గాడిద ఆరు నెలలపాటు రోజుకు పావు లీటర్ నుంచి 350 ఎంఎల్ వరకు ఇస్తుంది… ఇదుగో ఈ డిమాండ్ క్యాష్ చేసుకోవాలనేది బాబు ప్లాన్… విరుదాచలంలో గాడిదపాలు అమ్మేవాళ్ల దగ్గరకు కుటుంబసభ్యుల్ని తీసుకుపోయాడు… 10 ఎంఎల్ పాలను 50 రూపాయలకు అమ్ముతున్నారు వాళ్లు… అప్పుడు గానీ బాబు ప్లాన్ మంచిదేనని అంగీకరించలేదు వాళ్లు…
ఆ కుటుంబానికి పొలం ఉంది… కొంత అమ్మేశాడు… 100 గాడిదలను కొన్నాడు… తన మిత్రుడి నుంచి 17 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, అందులో ఈ డంకీ ఫామ్ పెట్టేశాడు… కానీ వాటి పోషణ అందరికీ చేతకాదు… గాడిదల గురించి అవగాహన ఉండాలిగా… అందుకని పూవనూరులో గాడిదలను కాసే ఓ కుటుంబాన్ని పనికి పెట్టుకున్నాడు. దేశీ గాడిదలతో పోలిస్తే గుజరాత్ హలారీ గాడిదలకు రేటు ఎక్కువ… పాలు ఎక్కువిస్తాయి… అవీ తెప్పించాడు…
వాటికి దాణా కావాలి కదా… 5 ఎకరాల్లో రాగులు, తృణధాన్యాలు పండిస్తున్నాడు… ఓ వెటర్నరీ డాక్టర్‌ను ఎంగేజ్ చేసుకున్నాడు… మరి పాలకు రెగ్యులర్ గిరాకీ ఎలా..? ఆ బెంగళూరు కాస్మొటిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు… లీటర్‌కు 7 వేల ధర… మళ్లీ చదవండి… గాడిద పాలకు టోకు ధర లీటరుకు ఏడు వేలు… కానీ సరిపోదు, ఇంకా కావాలి… యూరప్ కంపెనీలు ఏ రేటు ఇస్తాయో స్టడీ చేస్తున్నాడు… చాలా ఎక్కువ… కానీ ముందుగా ఒప్పందం కుదిరితే, ఎలా రవాణా చేయాలనేది తరువాత ఆలోచించవచ్చు… బాబు ఆ పనిలోనే ఉన్నాడు… ఈ గాడిద బాగానే సంపాదిస్తున్నాడు అనేయండి పర్లేదు… నవ్వుతూ స్వీకరిస్తాడు… గాడిద ఎలాంటి బంగారు బాతో తనకే కదా ఎక్కువ తెలిసింది…!!
Share this Article