ఒక కథ కచ్చితంగా చర్చనీయాంశమే… ఎందుకంటే, ఈ కథ వెనుక అనేక పార్శ్వాలు, కన్నీళ్లు, మరణాలు, సంక్షోభం ఉన్నాయి కాబట్టి… తల్లడిల్లిన అనేక తెలంగాణ పల్లెలున్నాయి కాబట్టి….. నక్సలైట్ల పేరిట, సానుభూతిపరుల పేరిట పోలీసులు వందల మందిని చంపేశారు… ఇన్‌ఫార్మర్ల పేరిట నక్సలైట్లు బోలెడు మందిని ఖతం చేశారు… వందల కుటుంబాల్లో కన్నీళ్లు, రక్తం కలగలిసి పారింది…
నిజంగా పోలీసుల చేతిలో హతమారిన ప్రతివాడూ నక్సలైటేనా..? నక్సలైట్లు చేతుల్లో ఖతమారిపోయిన ప్రతివాడూ ఇన్‌ఫార్మరేనా..? నక్సలైట్ అంటే ఎన్‌కౌంటర్ చేసేయవచ్చా..? ఇన్‌ఫార్మర్ అయితే బతుకు నక్సలైట్లకు బలి కావాల్సిందేనా..? ఇలా బోలెడు ప్రశ్నలు… అవును, విరాటపర్వం అనే సినిమా ఎన్ని కోణాల మీద ఫోకస్ చేసిందో తెలియదు కానీ… దర్శకుడు చెబుతున్న కథ చాలా లోతైనది… తను ఎంత లోతుకు వెళ్లాడు, వెళ్లగలిగాడు అనేది ఆసక్తికరం…
ముందుగా విరాటపర్వం సినిమా వెనుక ఉన్న ఒరిజినల్ కథలోకి వెళ్దాం… సంక్షిప్తంగానే… సరళ అనే అమ్మాయి… చైతన్యం ఎక్కువ… నక్సలైట్లలో కలవడానికి అడవుల్లోకి వెళ్తుంది… ఇలా స్వచ్చందంగా వచ్చే వాళ్లను అనుమానించడం సహజమే కదా… అయితే అప్పట్లో నిజామాబాద్ పీపుల్స్‌వార్ దళాల దుందుడుకు పోకడలు, సాగించే హత్యలు, దాడుల మీద చాలా విమర్శలు ఉండేవి… తనంతట తానే వచ్చిన సరళను పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా భావించి నక్సలైట్లు చంపేస్తారు… తీవ్రమైన తప్పిదం… ఇన్‌ఫార్మర్ల నిర్ధారణే సరిగ్గా జరిగేది కాదని చెప్పడానికి సరళ మరణం ఓ ఉదాహరణ…
Ads
అప్పటికి ఆమె వయస్సు పదిహేడేళ్లు… దళాన్ని కంటాక్ట్ కావడం ఈజీ కాదు కదా… దళంతో టచ్‌లోకి వెళ్లేంతవరకూ రోజుల తరబడి సిర్నాపల్లి ఏరియాలోనే తిరిగేది… రేయింబవళ్లూ ఏదో ఒక యాక్టివిటీ ఉండేది… తరువాత మిలిటెంట్ల సాయంతో అసలు దళాన్ని కంటాక్ట్ అవుతుంది…
అయితే నక్సలైట్లు దాచిపెట్టుకోలేదు… కప్పిపుచ్చుకోలేదు… తాము చేసింది తప్పేనని ఓ ప్రకటన విడుదల చేశారు… అంగీకరించారు… క్షమించాలని ప్రజలను కోరారు… అయితే విరాటపర్వం అనే కథ మీద ఇప్పుడు ఎందుకు ఆసక్తి క్రియేట్ అయ్యిందీ అంటే… దర్శకుడు నక్సలైట్లది తప్పే అని చెప్పగలిగాడా..? ఒకవేళ చెప్పలేకపోతే, కథను క్రియేటివ్ ఫ్రీడం పేరిట కొత్తగా చెప్పినట్టు భావించాల్సి ఉంటుంది… తన అభిప్రాయాన్ని, నిజాన్ని బలంగా చెప్పలేకపోయాడు అనుకోవాలి…
అప్పట్లో సుప్రభాతం అనే సంచలన పత్రిక వచ్చేది… అడవి మింగిన వెన్నెల సరళ అనే శీర్షికతో ఓ కవర్ పేజీ కథనాన్ని వేసింది… నక్సలైట్లది తప్పు అని ఖండితంగా తేల్చింది… బాలగోపాల్ అభిప్రాయం సహా అసలు సరళ విషయంలో ఏం జరిగిందో రాసింది… ఆ నిజమైన సంఘటనల్ని ఓ ప్రేమకథ రూపంలో చెప్పాను అంటున్నాడు విరాటపర్వం దర్శకుడు… కానీ..?
విరాటపర్వం ప్రోమోలు చూస్తేనేమో సరళ దళంతో కలిసి పనిచేసినట్టు కనిపిస్తోంది… నిజంగా సరళను నక్సలైట్లు దళసభ్యురాలిగా తీసుకున్నారా..? కలిసి పనిచేయడానికి చాన్స్ ఇచ్చారా..? అదీ డౌట్… కాదు, అదే అసలు డౌట్… ఉద్యమం కోసం ఆమెను బలిపెట్టడానికి హీరో గనుక అనివార్యంగా నిర్ణయం తీసుకున్నట్టు సినిమాలో చెప్పి ఉంటే దర్శకుడు ఇంకా ఎక్కువ క్రియేటివ్ ఫ్రీడం వాడుకున్నట్టు భావించాలి…
అసలు సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది… ఆపారు… ఆపారు… నిర్మాతలు ఎందుకో వెనుకాడారు… పలు రీషూట్లు జరిగాయని సమాచారం… అంటే కథలో ఎడాపెడా మార్పులు చేశారా..? ఆ తరువాతే రిలీజుకు సిద్ధమయ్యారా..? అందుకే కొన్ని డౌట్లు… సరళ కుటుంబీకులు హన్మకొండలో ఉంటారు… వాళ్లు కన్విన్స్ అయ్యారా కథనం మీద..? దర్శకుడు వేణు ఫేస్‌బుక్‌లో ఓ ఫోటో షేర్ చేసుకున్నాడు… అది సరళ కుటుంబమే… దిశ డిజిటల్ పేపర్ ఓనర్, వరంగల్ ప్రశాంతి హాస్పిటల్స్ ఎండీ తూము మోహన్‌రావు సొంత సోదరి ఆ సరళ… ఇదీ ఆ ఫోటో…
వరంగల్‌లో ఆత్మీయసభ పేరిట సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు కదా… పనిలోపనిగా హీరోయిన్ సాయిపల్లవి, హీరో రానాను కూడా ఆ కుటుంబం దగ్గరకు తీసుకుపోయారు… ఆ ఇంటి సభ్యులు సాయిపల్లవిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు… స్థూలంగా చూస్తే సరళ కథను దర్శకుడు చిత్రీకరించిన తీరుకు, ఆ కథనానికి ఆ కుటుంబం ఆమోదముద్ర వేసినట్టే లెక్క… నందితాదాస్, ప్రియమణి, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర పాత్రలు నిజజీవితంలో ఎవరివి..? ఏమో… సినిమా విడుదల కానివ్వండి… చెప్పుకోవచ్చు…!! దిగువన ఉన్న ఫోటోలో సాయిపల్లవితో మాట్లాడుతున్నది సరళ తల్లి సరోజ…
Share this Article