కొండ నాలుకకు మందు వేస్తే సాధారణంగా అసలు నాలుక ఊడిపోవాలి. ఎలుకతోలు తెచ్చి ఏడాదికి ఒక్కరోజు తక్కువకాకుండా ఉతికినా నలుపు నలుపుగానే ఉంటుంది కానీ- తెలుపు కాదు. కొయ్యబొమ్మను తెచ్చి ఎంతగా కొట్టినా పలకదు. ఇవన్నీ లోకంలో స్థిరమయిన అభిప్రాయాలు. ఎలుకతోలు ఏడాదిలో తెలుపుగాకపోయినా పెద్ద ఫరక్ పడదు. మనిషి తోలు నాలుగు వారాలు ఉతికితే నలుపు తెలుపవుతుందని ఒక కాస్మొటిక్ లేజర్ సర్జరీ కేంద్రం ఘనంగా, పబ్లిగ్గా ప్రకటనలు ఇచ్చుకుంది. తెలా వెలా పోయేంత తళతళలాడే తెలుపు సాధారణంగా మనం చేరుకోవాల్సిన గమ్యం. ఆరాధించాల్సిన వర్ణం. ఆనందించాల్సిన అందం. కొరుక్కు తినాల్సిన రంగు. ఎంత అనారోగ్యమయినా కేవలం తెలుపు మీద మోజు వల్ల తెల తెల్లటి అన్నమే తింటాం. తెల తెల్లటి చక్కెరే తియ్యగా మింగుతాం. నెత్తిన జుట్టులో ఒక వెంట్రుక తెలుపును తెలుపగానే పట్టుకుని నలుగుపెట్టి నలుపు పులుముతాము. ఐటీ వారికి తెలుపంటే చులకన. తెలుపు గురించి ఎంత తెలిపినా- తెలియనట్లు మౌనంగా ఉండిపోతారు. అదే నలుపు గురించి ఏ మాత్రం ఉప్పందినా తోక తొక్కిన తాచుపాములా బుసకొట్టి వెంటపడతారు. నల్లని కృష్ణుడి అల్లరి పూజింపదగినది. నల్ల కలువ అందం గురించి రాయడానికి భాష చాలడంలేదని కవులు చేతులెత్తేశారు. నల్లటి బొగ్గుకు కొనసాగింపు అయిన రసాయన కర్బన పదార్థమే వజ్రంగా మారుతుంది. అంటే- నలుపు ఇక నలుపెక్కాడానికి వీల్లేకపోతే నిగనిగలాడే వజ్రంగా మారుతుంది అని తాత్వికంగా అనుకోవచ్చు.
ఏది అందం? ఏది కాదు? అన్న విచికిత్స ఏర్పడినప్పుడు, ఒక అందాల పోటీల వేళ మన ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న ఒక పాట రాశాడు.
Ads
“కంచె రేగి తీపివోలె లచ్చుమమ్మ…
నీ కంఠమెంత మధురమే లచ్చుమమ్మ?”
అంటూ ఒక గ్రామీణ మహిళ నెత్తిన గడ్డి మోపు పెట్టుకుని చెరువు కట్టమీద వయ్యారంగా నడిచి వెళుతుంటే సూర్యకిరణాలకు ఆమె మొహం కందిపోకుండా మేఘాలు గొడుగు పట్టాయట. నుదుట జారిన చెమట బిందువులు ఆమె మెడలో ముత్యాల హారంలా మెరుస్తున్నాయట. ఆమె కళ్లు మాట్లాడే మౌనభాషకు మేకలు తినడం మరచిపోయి విగ్రహాల్లా ఉన్నాయట. తల్లి పొదుగులో పాలు తాగే లేగదూడలు ఆమె పాటకు పరవశించి చెంగు చెంగున దగ్గరికి వచ్చాయట. ఆమె పాట పాడితే వాడిపోయిన కంకులు మళ్లీ తలెత్తుకుని నిలుచుని పక్షులకు ఆహ్వాన గీతాలు పలుకుతాయట. ఆమె పాట పాడితే మోడులు మళ్ళీ పచ్చగా పూత పూస్తాయట. ఆమె నడిచి వెళుతూ గొంతెత్తితే క్రూరమృగాలు సాధుజంతువులవుతాయట. ఆమె నడిచే దారిలో పల్లేరు ముళ్లు మల్లెలవుతాయట. మొత్తం సమస్త ప్రకృతి ఆమెకు పాదాక్రాంతం. లేదా సమస్త ప్రకృతి అందం ఆమెలో ప్రతిఫలిస్తోంది. ఇంత అందాన్ని ఊహించడానికి కూడా మనకిప్పుడు శక్తి లేదు. అనంతమయిన అంతటి సహజమయిన అందాన్ని చూసే కళ్లు కూడా మనకు లేవు.
లేజర్ సర్జరీ అందాలు, స్నోలు, టాల్కమ్ పౌడర్లు, పొట్టలావు తగ్గించే కడుపుకోతలు, బండపెదవులకు దొండకాయల అందాలను అద్దే కత్తిరింపులు, ఫేషియళ్ళు, కనురెప్పల సర్దుబాట్లు, జుట్టుకు మెరుపులు, ఒంటి రంగుకు కొత్త రంగుల అద్దకాలు…ఇలా అందాల మార్కెట్ విలువ ఏటా భారత్ లో డెబ్బయ్ అయిదు వేల కోట్లకు పైనే ఉంటుంది. హైదరాబాద్ లో ఒక కాస్మొటిక్ కేంద్రం అందమయిన ప్రకటన ఇచ్చింది. అది నమ్మి ఒక బుల్లితెర నటి తన నలుపు మొహాన్ని తెలుపు చేయాలంటూ వెళ్లింది. ట్రీట్మెంట్ ముగిసింది. నలభై రోజుల్లో దాదాపు డెబ్బయ్ వేలు చేతి చమురు వదిలింది. తీరా అద్దంలో చూసుకుంటే మునుపటికంటే నలుపు పెరిగింది. ఉన్న కొద్దిపాటి అవకాశాలు పోయి-లబోదిబోమంటూ వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించింది. కేసు గెలిచి సర్జరీకి అయిన సొమ్ము, నామమాత్రపు పరిహారం రాబట్టుకోగలిగింది కానీ- నలుపు ఇంకా నలుపెక్కి శాశ్వతంగా బుల్లి తెరకు దూరమయ్యింది. శరీరం రంగుమీద ప్రకటలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని సౌందర్యసాధనాలు ఉత్పత్తి చేసే కంపెనీల మీద ఆంక్షలున్నాయి. అయినా ఫెయిర్ అండ్ లవ్లీ గ్లో అండ్ లవ్లీ పేరిట ఎండ ముసుగులో మళ్లీ మళ్లీ శరీరం రంగును కాపాడుకోండి అంటూ మొదటి పేజీ రంగుల ప్రకటనలు ఇస్తూనే ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఫెయిర్ అండ్ అగ్లీ!………… By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article