మడత పెట్టి కుమ్మిన పాట! మడతోద్భవ సందర్భం:-
రెండు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని వెళ్లిపోతున్న త్రివిక్రమ్ ను సరస్వతీ పుత్ర రామజోగయ్య, సంగీత పుత్ర థమన్ రెండు చేతులు పట్టుకుని ఆపారు. సందర్భానికి ఉదాత్తమైన పాట కావాలని కోరుకున్న త్రివిక్రమ్ కు ఉదాత్తమైన సాహిత్యం ఇస్తానని సరస్వతీపుత్ర, అంతే ఉదాత్తమైన సంగీతం ఇస్తానని సంగీత పుత్ర ఇద్దరూ హామీ ఇచ్చారు. అప్పుడు పుట్టిందే మడత పెట్టి పాట!
జ్ఞానం ప్రవచించిన మడత:-
Ads
త్రివిక్రమ్ సైన్స్ చదువుకున్నవాడు. సాహిత్యం లోతులు చూసినవాడు. పికె లాంటి వారి ఉద్ధండులకే రాజకీయ దిశా నిర్దేశం చేయగలవాడు. సిరివెన్నెల లాంటివారి పాటల లోతులను లోకానికి చెప్పగలిగినవాడు. గుంటూరు కారం సినిమాకు దర్శకుడు. హారిక హాసిని నిర్మాణ సంస్థ కాబట్టి ఒక రకంగా నిర్మాత కూడా…
పాటకు కొన్ని మాటలు ఉండాలి. కొన్ని స్వరాలు కావాలి. డిజిటల్ యుగంలో న బూతో న భవిష్యతి కాబట్టి తేలిక బూతు, గట్టి బూతు, బండ బూతు, పచ్చి బూతు, నాటు బూతు మిశ్రమంలో ఒక బూతు రంజకమైన గీతాన్ని సందర్భం డిమాండ్ చేసింది.
“కాగితం మడత పెడతాం. న్యూస్ పేపర్ మడత పెడతాం. బట్టలు మడత పెడతాం. చివరకు తినే కాజాలను కూడా మడత పెడతాం. నిత్య జీవితంలో మడత ఒక భాగం. మడత లేనిదే నడత లేదు. మడత లేనిదే మనుగడ లేదు. మ- డ- త అన్న మూడక్షరాల్లో అనంతమైన జ్ఞానం నిక్షిప్తమై ఉంది. ఇందులో వాడిన మడత కాన్సెప్ట్ ఓంకారం లాంటిది” లాంటి జ్ఞానం పొంగి పొర్లే మాటలు త్రివిక్రమ్ ఇంకా చెప్పకపోవడం మాటల మాంత్రికుడి అభిమానులకు నచ్చలేదు. సృష్టికి ఆ మడతే మూలం అని వేదాలతో మొదలు పెట్టి త్రివిక్రమ్ ఈపాటికే చెప్పి ఉండాల్సింది.
లేకపోతే… మన మట్టి బుర్రలకు అది పరమ బూతుగా ధ్వనించి… సరస్వతీ పుత్రులను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది!
చివరగా హెచ్చరిక మడత:-
# సరస్వతీ పుత్ర రామజోగయ్య “కుర్చీని మడత పెట్టి ..తే” మహా ప్రసాదంగా స్వీకరించకుండా బూతు అంటార్రా?
# మాటల మాంత్రికుడు, ప్రముఖ ప్రవచనకర్త త్రివిక్రమ్ మాటలను పాటల్లో మడత పెట్టి కొడితే… అమృతగుళికలుగా మింగకుండా కక్కుతార్రా?
# కాపీ క్యాట్ థమన్ సోషల్ మీడియా ట్రెండీ డిజె మడత పాట విప్పుకుని, మడత కాపీ కొడితే… మడత కాజా అనుకుని రుచి చూడకుండా ట్రోల్ చేస్తార్రా?
# సంసార పక్ష ఘట్టమనేని మహేష్ బాబులుంగారు తెలుగు మడత భాష తెలియక బూతు భంగిమకు చక్కగా నాట్యాభినయం కూడా చేస్తే… కనులారా చూడకుండా… చెవులారా వినకుండా… బూతుపురాణం అంటార్రా?
# అంత నాటు నాటుకే ఆస్కార్ వచ్చినప్పుడు… ఇంత మడతకు రావా ఆస్కార్లు? అప్పుడు మీరే దేభ్యపు మొహాలేసుకుని మడత గీతా మహిమలను వేనోళ్ల పొగడరా…
# కాబట్టి- మడత పాట మీద నాలుక మడత మాటలు మాట్లాడితే ఒక్కొక్కరికి నవరంధ్రాల్లో “గుంటూరు కారం” దట్టించి మడత పెట్టి కుమ్ముతాం. ఖబడ్డార్! -వినోద్
Share this Article