ఇప్పుడు టెక్నాలజీపరంగా పదే పదే వినిపిస్తున్న మాట… కృత్రిమ మేధ… అనగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్…! చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి సెర్చ్ బేస్డ్ ఏఐ ప్లాట్‌ఫారాలే కాదు… ప్రతి రంగంలోకీ ఈ కృత్రిమ మేధ వ్యాపిస్తోంది… ఇది క్రమేపీ మనిషి బుర్రను చంపేస్తుందనీ, టెక్నాలజీ మీదే మనిషి పూర్తిగా ఆధారపడి, సొంతంగా ఆలోచించే తెలివిని కోల్పోతాడనీ భయాందోళనల్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కదా…
ప్రభుత్వ పాలసీల్ని నిర్దేశించే బ్యూరోక్రాట్లు, ప్రభుత్వంలో ఉండే పాలకపెద్దలకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ భావి థ్రెట్స్ మీద అవగాహన లేకపోవడం కూడా ఓ కారణం… మనిషి పూర్తిగా డిపెండెంట్‌గా మారిపోతాడనీ, మానవత్వం విలుప్తం కాబోతుందని చెప్పడానికి ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… ఆ వివరాల్లోకి వెళ్దాం…
ఇప్పుడు యుద్ధాల్లో పైలట్లు ఉండే యుద్ధవిమానాల్ని వాడుతున్నాం కదా… మనుషుల్ని కోల్పోయే ప్రమాదాలే అధికం… భూమి మీద జరిగే యుద్ధాలకన్నా అంతరిక్షంలో, గగనతలంలో జరిగే యుద్ధాలే జయాపజయాల్ని నిర్దేశిస్తాయి… మనుషుల్ని పోగొట్టుకునే ప్రమాదాలకన్నా మనుషులు అవసరం లేకుండా, భూమ్మీద ఉన్న కమాండ్ సెంటర్ల నుంచి ఎఐ ఆధారంగా డ్రోన్లను ప్రయోగించాలనేది అమెరికా యుద్ధ నిపుణుల ఆలోచన… దీనిపై ప్రయోగాలు కూడా స్టార్ట్ చేసింది…
Ads
అయితే ఎఐ వికటిస్తే… అది ప్రయోగించినవాడినే భస్మాసురుడిలా హతం చేసే కొత్త ప్రమాదం అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు అనుభవంలోకి వచ్చింది… మొన్నామధ్య యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా నడిచే డ్రోన్‌ను ప్రయోగించింది… అన్‌మ్యాన్‌డ్ ఎయిర్ వెహికిల్… యూఏవీ… రిజల్ట్ ముందే చెబుతున్నాను… సదరు డ్రోన్ ఆపరేటర్‌నే చంపేసింది… పాపం శమించుగాక…
‘‘హే, ఆపరేటర్‌ను చంపేయొద్దు, వదిలెయ్’’ అని గ్రౌండ్ నుంచి ఆదేశాలు ఇస్తున్నా జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది… చివరకు దాని భాషలోనే ఆపరేటర్‌ను చంపేస్తే పాయింట్లు కోల్పోతావు అని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది… ఈ ప్రయోగపరీక్ష పరిధికి బయట ఉన్న ఎవరూ గాయపడలేదు, డ్రోన్ వారి వెంట పడలేదు… అక్కడికి రిలీఫ్… ఎథిక్స్ మన్నూమశానం పక్కన పెడితే… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లర్నింగ్, అటానమీ వంటి ఎంతగా విస్తరిస్తే అంతగా థ్రెట్స్ మన ఎదుట నిలుస్తాయి… అని టాప్ ఎఐ ఇండస్ట్రీ ముఖ్యులు తేల్చిచెబుతున్నారు… ఎఐ భస్మాసుర హస్తం అయితే చివరకు మనిషి పరిస్థితి..?!
Share this Article