Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరపురాని ఓ వాస్తవ కథనం… కొడుకులు ‘రాజులైనా’ చేతిలో చీపురు వదల్లేదు…

August 19, 2023 by M S R

కొన్ని కథలు ఓ పట్టాన నమ్మేట్టుగా ఉండవు… కానీ నిజాలు… ఎవరినీ ఎవరూ తేలికగా తీసిపారేయకూడదు అనే నీతిని బలంగా చెప్పే నిజ కథనం ఇది… ఆరేడేళ్ల క్రితం ‘ముచ్చట’ పబ్లిష్ చేసింది… తరువాత చాలామంది ఆ కథకు చిలవలు పలవలు జోడించి ఏదేదో రాసేసి సర్క్యులేట్ చేశారు… నాటి ముచ్చట కథనమే ఇప్పుడు మరోసారి తిరగరాత… చదవండి…

సుమిత్రాదేవి… ఓ స్వీపర్… జార్ఖండ్‌, రాజరప్పలోని సీసీఎల్ టౌన్‌షిప్ వీథుల్ని 30 ఏళ్లుగా ఊడుస్తోంది… రిటైర్మెంట్ దగ్గరకొచ్చింది… నిజానికి ఓ స్వీపర్ రిటైరయిపోతే ఆఫీసు పెద్దగా పట్టించుకోదు… ఆ వివక్ష కనిపిస్తూనే ఉంటుంది… కానీ సుమిత్రాదేవి రిటైర్మెంట్‌ గొప్పగా జరిగింది… గొప్ప అంటే గుర్తుంచుకునేంత… అందరూ తమ పిల్లలకు ఈ నీతికథ చెప్పేంత… ఆత్మన్యూనత వద్దు అని అందరికీ చాటి చెప్పేంత…

ఆమె పదవీ విరమణ రోజున ఆమె సహచరులు, పొరుగు వారు వీడ్కోలు భేటీ ఏర్పాటు చేశారు… ఆ ఏర్పాట్లు చూస్తే ఓ సగటు నాలుగో తరగతి ఉద్యోగికి సాదాసీదా వీడ్కోలు చెబుతున్నట్టే ఉంది… కానీ అక్కడికి మూడు కార్లు వచ్చేసరికి ఆ సీన్ మొత్తం మారిపోయింది… అక్కడంతా ఓ ఆశ్చర్య వాతావరణం అలుముకుంది…

Ads

స్వీపర్

మొదట వచ్చింది ఓ నీలం రంగు కారు… అది బీహార్‌లోని సివాన్ జిల్లా కలెక్టర్ కారు… ఆ కలెక్టర్ చేతులు ఆ స్వీపర్ పాదాల్ని తాకాయి… ఈలోపు మరో రెండు కార్లు వచ్చాయి… వాటిల్లో నుంచి దిగిన మరో ఇద్దరు కూడా సేమ్ ఆ కలెక్టర్‌లాగే ఆమె పాదాల్ని తాకారు… ఆ ముగ్గురూ ఎవరో తెలుసా..? ఈ స్వీపర్ సుమిత్రాదేవి కొడుకులు… నిజం… అక్షరాలా నిజం…

Sumitra Devi

ఆమె పెద్ద కుమారుడు వీరేంద్ర కుమార్… రైల్వేలో ఇంజనీర్.., ఆమె రెండవ కుమారుడు ధీరేంద్ర కుమార్… డాక్టర్… ఆమె మూడవ కుమారుడు మహేంద్ర కుమార్… ఇప్పుడు బీహార్‌లోని సివాన్ జిల్లా కలెక్టర్‌… ముగ్గురు కొడుకులూ ఆమె పాదాలను తాకడంతో సుమిత్ర ఏడవసాగింది… ఆఖరి రోజున ఆమెను సత్కరించేందుకు అక్కడికి చేరుకున్న ఆమె ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి లోనవుతుండగా… ఆమె దుఖం మరింత ఎక్కువైంది… అవి కన్నీళ్లు కావు, ఆనందాశ్రువులు…

Sumitra Devi

‘‘సార్, 30 ఏళ్లుగా నేను ఈ కాలనీ వీథుల్ని ఊడుస్తున్నాను… నా పిల్లలు కూడా మీలాంటి పెద్ద సార్లే’’ అని అక్కడికి వచ్చిన ఉన్నతాధికారులకు తన పిల్లల్ని పరిచయం చేసింది… కలెక్టర్ కొడుకు ఏమంటాడంటే… ‘‘మా అమ్మ మా కోసం చాలా త్యాగం చేసింది… ఆమె మమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచలేదు… ఎప్పుడూ కష్టపడి చదవమని మమ్మల్ని ప్రోత్సహించేది.., ఏదైనా ఒక రోజు ఇలాంటి ఆఫీసులలో ఆఫీసర్లుగా ఉండగలం అని చెప్పేది…. ఆమె నా తల్లి అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను..’’

Sumitra Devi

ఈ కథనంలో విశేషం ఏమిటంటే… కొడుకులు భిన్నరంగాల్లో పెద్దగా ఎదిగినా సరే, ఆమె తన వృత్తిని మానుకోలేదు, వీథులు ఊడుస్తూనే ఉంది… తన కొలువు, తన గౌరవం… కొడుకులు మంచి పొజిషన్లకు చేరుకున్నాక నిజానికి ఆమె వృత్తి నిబద్ధత మరింత పెరిగింది… ‘‘నా పిల్లలు రాణిస్తున్నప్పటికీ నేను ఈ ఉద్యోగాన్ని వదల్లేదు… ఎందుకంటే నా పిల్లలను చదివించడానికి ఈ ఉద్యోగం ఉపయోగపడింది… నా కలలను నిజం చేసినదాన్ని నేను ఎలా వదిలివేయగలను..” అని చెప్పిందామె కళ్లు తుడుచుకుంటూ…

నిజానికి ఆ పిల్లలు కూడా గ్రేటే… తమ తల్లి ఒక స్వీపర్ అని చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించలేదు… చాలామంది పిల్లలకు వాళ్లు ఆదర్శం… అంతేకాదు, అంతమందిలో బహిరంగంగా తల్లి పాదాల్ని తాకి ఉద్వేగానికి గురయ్యారు… “జీవితంలో ఏ ఉద్యోగమూ కష్టం కాదు… చిన్నతనం కానేకాదు… నిజాయితీతో కూడిన కృషితోనే ప్రతిదీ సాధ్యమవుతుంది… మా అమ్మ, మేం మా జీవితంలో చాలా కష్టమైన దశల్ని అనుభవించాం, ఐనా సరే మమ్మల్ని తను ఎప్పుడూ నిరాశకు గురిచేయలేదు… ఆమె అంచనాలకు అనుగుణంగా జీవిస్తున్నందుకు మేం గర్విస్తున్నాం…” అన్నాడు ఆ కలెక్టర్… అసలు ఇవి కదా వార్తలు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions