మనం ఇంతకుముందే అబ్రహాం ఓజ్లర్ అనే మలయాళ సినిమా గురించి రాసుకున్నాం కదా… లెజెండరీ స్టార్ మమ్ముట్టి ఉన్నంత మాత్రాన అది చూడబుల్ సినిమా అయిపోదని కూడా చెప్పేసుకున్నాం కదా… ఫాఫం, ఈమధ్య మంచి పేరు తెచ్చుకున్న మలయాళ సినిమాల్లో ఇలాంటివి కూడా వస్తున్నాయనీ అనుకున్నాం కదా… అదేమో హాట్ స్టార్ ఓటీటీలో ప్రవహిస్తోంది… అనగా స్ట్రీమవుతోంది…
ఆగండాగండి, నేనేం తక్కువ, నేనూ ఈ అన్ చూడబుల్ సినిమాల జాబితాలో ఉన్నాను అంటూ తాజాగా తుండు అనే మలయాళ సినిమా ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది… కాకపోతే ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రవహిస్తోంది… ఈమధ్య తమిళ, మలయాళ సినిమాలకు తెలుగు టైటిల్స్ ఎవడు వెతుకుతాడులే అనుకుని ఆ సేమ్ పేర్లే పెట్టేస్తున్నారు కదా… ఇదీ అంతే… అవునూ, తుండు అంటే ఏమిటీ అంటారా..? మన తెలుగులో అయితే తుండు గుడ్డ అంటే అందరికీ తెలుసు…
మలయాళంలో తుండు అంటే కాగితపు ముక్క… (అశ్లీల బూతు వీడియోలను కూడా ఇలాగే పిలుస్తారట కొందరు…) పరీక్షల్లో కాపీ కొట్టడానికి చిట్టీలు తీసుకుపోతారు కదా, నకల్ అంటారు… సో, తుండు అనగా నకల్ చిట్టీలు అని మనం అర్థం చేసుకోవాలి పెద్ద మనస్సుతో… సరే, ఇందులో హీరో బిజూ మీనన్… తెలుగులో కూడా పరిచయమే.., రణం, ఖతర్నాక్ సినిమాల్లో చేశాడుగా … పెద్ద స్టారేమీ కాదు… కానీ నటన బాగా తెలిసినవాడు…
Ads
తుండు విషయానికి వస్తే సినిమా ఫ్లాప్… ఏదో కోటీకోటిన్నర వరకూ వసూలు చేసింది కనాకష్టంగా… దాన్ని ఇప్పుడు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో డబ్ చేసి ఓటీటీలో పెట్టేశారు… ఏదో కామెడీ సినిమా అన్నారు గానీ పెద్ద కామెడీ ఏమీ లేదు… సిల్లీ కథ… నకల్ చిట్టీవంటి కథ… నకల్ చిట్టీలపైనే కథ… కాసేపు చూశాక భుజం మీద తుండు గుడ్డను తీసి, గట్టిగా దులిపి, మనం ఎటుపోతున్నామో తెలియకుండా నడుచుకుంటూ వెళ్లిపోవడమే అన్నమాట.,.
కేరళలోని త్రిసూర్… ఓ ఠాణా… అక్కడ హీరో ఓ కానిస్టేబుల్… భార్య ట్యూషన్లు చెబుతుంది… టీనేజీ కొడుకు, స్కూలింగ్… ఓసారి చిట్టీలు కొట్టి దొరికిపోతే ప్రిన్సిపాల్ హీరోను పిలిచి చీవాట్లు పెడుతుంది… ఏదో బతిమిలాడుకుంటాడు… ఈలోపు తనే డిపార్ట్‌మెంట్ టెస్ట్ రాయలని నిర్ణయించుకుంటాడు… అది పాసయితేనే ప్రమోషన్, అది వస్తేనే తనపై పెత్తనం చేసే హెడ్ కానిస్టేబుల్ పీడ నుంచి విముక్తి… కానీ పుస్తకం పట్టక 21 ఏళ్లు, చదవలేడు, రాయలేడు, ఎలా..?
పరిష్కారం చిట్టీలు… చిట్టీలు రాస్తుంటే స్క్వాడ్ వచ్చి పట్టుకుంటుంది… మీడియాలో కథనాలు… అవమానం… కథంతా ఇలాగే నడుస్తూ ఉంటుంది… ఒకే తరహాలో కథనం సాగుతూ ఉంటుంది, నీరసంగా, నిస్పారంగా… మామూలుగా సినిమా కథల్లో కానిస్టేబుల్ హీరో అవుతే సూపర్ కాప్‌గా చూపిస్తారు… ఫైట్లు, ఇన్వెస్టిగేషన్లు, హీరోయిజం మన్నూమశానం… కానీ ఇదేమో పూర్తి భిన్నంగా సాగుతుంది సినిమా… బలమైన విలన్ ఎవరూ లేరు… బలమైన లక్ష్యమూ లేదు హీరోకు…
పోలీస్ వ్యానులో పొరపాటున టియర్ గ్యాస్ ప్రయోగం, పోలీస్ ట్రైనింగ్ డాగ్ సీన్లు కొన్ని అక్కడక్కడా మెరిసినా… రెండు గంటల సినిమాకు అవేం సరిపోతాయి..? ఓటీటీ కదా, గబగబా మౌజ్ కదిలిస్తూ మనమే కథనంలో వేగాన్ని పెంచుకోవాలి, త్వరగా పూర్తి చేసి హమ్మయ్య ఈ పరీక్షను గట్టెక్కాం అనుకోవాలి..!!
Share this Article