ప్రతి వాక్యానికీ చివర్లో రాధికా అని యాడ్ చేయడం, అట్లుంటది మనతోటి అని తరచూ చెప్పడం, డీజే టిల్లూ అనే సూపర్ హిట్ సాంగు, దాన్నే పదే పదే బీజీఎంగా మార్చుకోవడం, హీరో – హీరోయిన్ల కెమిస్ట్రీ, హీరో సరదా కేరక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ తీరు, జస్ట్ ఫన్ ఓరియెంటెడ్ కథాకథనాలు… ఇవే కదా డీజే టిల్లూ సినిమా బంపర్ హిట్ కావడానికి కారణాలు…
టిల్లూ స్క్కేర్ పేరిట సీక్వెల్‌లోనూ ఆ సరదాతనం అలాగే కొనసాగింది… ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ దాకా సిద్ధూ విశ్వరూపం… అంటే ఇదేమీ నటనకు చాలెంజింగ్ రోల్ కాదు, కానీ అలా ప్రేక్షకులను థియేటర్లో కూర్చున్నంతసేపూ నవ్వించడం అనేది పెద్ద టాస్కే… దాన్ని సిద్ధూ పర్‌ఫెక్ట్‌గా పోషించాడు… కాకపోతే ఫస్ట్ పార్టులో నేహా- సిద్ధూల నడుమ సీన్లు, కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యాయి… అది సీక్వెల్‌లో అనుపమ- సిద్ధూ నడుమ అంతగా వర్కవుట్ కాలేదు…
ఏదో లిప్ లాకులు, మీద మీద పడిపోవడాలు గట్రా ఉన్నా… మరీ హాట్ బూతు బాపతు థర్డ్ స్టాండర్డ్ సినిమా స్థాయికి ఏమీ తీసుకుపోలేదు, రక్షించారు… ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ గురించి కాదు, ఆమె పాత్ర గురించే మాట్లాడుకుంటారు అన్నాడు కదా సిద్ధూ ఏదో ప్రెస్‌మీట్‌లో… అంత సీనేమీ లేదు… అనుపమ పెద్ద ప్లస్ పాయింటేమీ కాదు సినిమాలో… అసలు ఎవరూ కనిపించరు సినిమాలో సిద్ధూ తప్ప… ఐనా సరే, బాగానే ఉంది… ఫాఫం బిర్యానీలు, పులిహోరలు అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పి, గ్లామర్‌కూ బోల్డ్‌కూ నడుమ గీతలు చెరిపేసినా సరే, తనను తాను అనుపమ తగ్గించుకున్నా సరే ఫాయిదా లేకుండా పోయింది…
Ads
ఈ సినిమాలో మరీ మరీ చెప్పుకోవాల్సింది వన్ లైనర్లు… డైలాగులు ఎవరు రాశారో, ఎంత మథనం చేశారో గానీ… దాదాపు ప్రతి సీన్‌లో ఇవి సిద్ధూ నోటి వెంట వినబడుతూ థియేటర్లలో నవ్వులు పేలాయి… ఒక ఫన్ ఓరియెంటెడ్ సినిమాకు అంతకుమించి ఏం కావాలి..? ఈమధ్యకాలంలో ఇంతగా పేలిన వన్ లైనర్స్‌ను మరో సినిమాలో చూసి ఉండం…
ఫస్ట్ పార్టు సక్సెస్‌కు కారణాల్లో ఒకటి డీజే టిల్లూ అనే పాట… లాలాగూడ, అంబర్ పేట, మల్లేపల్లి, మలకపేట అని సాగుతుంది కదా… సెకండ్ పార్టులో అంతగా జోష్ నింపే పాటేమీ లేదు… కానీ భీమ్స్ బీజీఎం సీన్లకు తగినట్టు బాగానే ఎలివేట్ చేసింది… ఇలాంటి సినిమాల్లో కథాకాకరకాయ చెప్పుకునేంత పెద్దగా, గొప్పగా ఏమీ ఉండదు కదా… ఫస్టాఫ్ అయితే కథ గురించి ఆలోచించేంత వ్యవధి ఇవ్వకుండా పుల్లు ఫన్‌తో లాగించేశారు…
నిజానికి ఫస్ట్ పార్ట్‌తో పోలిక లేకుండా ఈ సెకండ్ పార్ట్ గురించి చెప్పుకోలేం… ఫస్ట్ పార్ట్ చూడనివాళ్లు ఈ సెకండ్ పార్ట్, అనగా ఈ సీక్వెల్‌ను ఎంజాయ్ చేయడం కాస్త కష్టమే… ఈ సీక్వెల్ ఏమాత్రం డౌనయినా ఫాఫం దర్శకుడిని తిట్టిపోసేవాళ్లు… ఫస్ట్ పార్ట్ దర్శకుడు వేరు, ఈ సీక్వెల్ దర్శకుడు వేరు కదా… మరీ చప్పట్లు కొట్టి పదే పదే మెచ్చుకోదగినంత సీనేమీ లేకపోయినా… ఏ ఫన్ కోసం ఈ సినిమా చూడటానికి థియేటర్‌కు వస్తారో ఆ ప్రేక్షకులను మాత్రం ఏమాత్రం నిరాశపరచలేదు సిద్ధూ… ప్రస్తుతం మార్కెట్‌లో పెద్దగా చూడబుల్ సినిమాలు కూడా ఏమీలేవు కదా… సో, టిల్లూ స్క్వేర్‌కు కాసులు కురుస్తాయి…!! అన్నట్టు… మూడో పార్ట్ కూడా గ్యారంటీ, కాకపోతే అనుపమ ఉండదు..!!
Share this Article