Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వి‘శేషన్’… నాకు హోం మినిస్ట్రీ ఇవ్వండి, అన్నీ చక్కదిద్దుతా…

April 20, 2025 by M S R

.

( రమణ కొంటికర్ల) కేంద్ర ఎన్నికల కమిషనర్స్ ఎందరో వస్తున్నారు, మరెందరో పోతున్నారు. కానీ, ఒక్క పేరు మాత్రం ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలతో పాటు… ఆ సీటుపై ఆయన చూపించిన ఆటిట్యూడ్ కూడా అందుకు కారణమేమో! అయితే, ఆయన ఎన్నికల కమిషనర్ గా ఓవైపు పనిచేస్తూనే… కేంద్ర హోంమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకూ ఉవ్విళ్లూరారా…? ఆ తర్వాతేమైంది..?

టీ. ఎన్. శేషన్.. ఈ పేరు ఎన్నికల కమిషనర్లందరిలోకి ప్రత్యేకమైన పేరు. అలాంటి శేషన్ రాజీవ్ గాంధీ హత్య తర్వాత హోంమంత్రి పదవీ, బాధ్యతలు చేపట్టాలనే యోచన చేశారా..? ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తన పుస్తకంలో పేర్కొన్నారు.

Ads

ఈ క్రమంలో గోపాలకృష్ణ దేవదాస్ గాంధీ గురించి కూడా కొంచెం చెప్పుకుని.. ఇక శేషన్ విషయంలోకి వెళ్దాం. సి. రాజగోపాలాచారీకి, మహాత్మాగాంధీకి మనవడు. 1968 నుంచి 1992 వరకూ సివిల్ సర్వెంట్ గా పనిచేశాడు. తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ.. ఆ తర్వాత వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీగా.. రాష్ట్రపతిగా జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.

పశ్చిమబెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. దక్షిణాఫ్రికా హై కమిషనర్ గా భారత్ తరపున సమర్థవంతమైన బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా కూడా గోపాలకృష్ణకు పేరుంది. ఆ తర్వాత శ్రీలంక హైకమిషనర్ గా, నార్వేలో భారత అంబాసిడర్ గా పలు హోదాల్లో సుదీర్ఘ అనుభవం కల్గిన బ్యూరోక్రాట్ గోపాలకృష్ణ గాంధీ.
సీఈసీ నుంచి హోం మినిస్టర్ గా ఎదగాలనే ఆలోచన!

సరిగ్గా భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయమది. మరోవైపు శ్రీలంకలో సివిల్ వార్ ముగుస్తున్న సమయం కూడాను. శ్రీలంక దేశ వ్యవహారాల్లో భారత ప్రభుత్వ జోక్యాన్ని అక్కడి నిషేధిత లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE) ఏమాత్రం జీర్ణించుకోలేదు. సివిల్ వార్ ముగిసి శాంతి నెలకొంటుందనుకున్న సమయంలో సూసైడ్ బాంబర్స్ అటాక్ తో రాజీవ్ హత్య భారత్ నే కాదు, ప్రపంచాన్నే నివ్వెరపర్చింది.

1991, మే 20న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొదటి షెడ్యూల్ పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత రెండో షెడ్యూల్ లో భాగంగా తమిళనాడులో మే 24న ఎన్నికలు జరగాల్సి ఉంది. మొదటి విడత పోలింగ్ ముగిసిన తెల్లవారే మే 21న రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూరుకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లాడు. ఆత్మాహుతి దళం దాడిలో రాజీవ్ అసువులు బాసాడు.

అప్పుడు ఎన్నికల కమిషనర్ గా ఉన్న శేషన్.. వెంటనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ఆపేసి.. శాంతిభద్రతల కోణంలో తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలనే యోచనను నాటి రాష్ట్రపతి వెంకట్రామన్ ముందుంచారు. అప్పటి రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా పనిచేసిన, వెస్ట్ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.

“The Undying Light: A Personal History of Independent India” పుస్తకాన్ని న్యూఢిల్లీలో నిన్న ఏప్రిల్ 17వ తేదీ, బుధవారం రోజున షర్మిలా ఠాగూర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో జరగ్గా.. ఆ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది. తమిళనాడు శ్రీపెరంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయాన్ని ఆనాడు వెంటనే రాష్ట్రపతి వెంకట్రామన్ కు శేషన్ అందించారని గోపాలకృష్ణ వెల్లడించారు. ఆ రాత్రి శేషన్ కూడా అత్యవసరంగా హుటాహుటీన రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న విషయాల్నీ ఆయన ప్రస్తావించారు.

ఆ సమయంలో రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి వెంకట్రామన్, ఆయన కార్యదర్శి మురారీ, శేషన్ తో పాటు, తాను ఉన్నట్టు గోపాలకృష్ణ పేర్కొన్నారు.

రాష్ట్రపతికి కేవలం ఓ 12 అడుగుల దూరంలోనే కూర్చున్న శేషన్.. అప్పటి సిచ్యుయేషన్స్ ని ఆయనకు వివరిస్తున్నారు. ఆ సమయం ఎంత క్రిటికలో ఆయనకు అర్థం చేయించే యత్నం చేసిన శేషన్… చేతులు తిప్పుతూ, విశాలమైన కళ్లు చేసుకుని ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరారు. శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశమున్నందున.. అత్యవసరంగా నియంత్రణలోకి తీసుకురావల్సి ఉంటుందన్నారు.

అందుకు, తాను సీఈసీ పదవిని మించి బాధ్యతలను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి వెంకట్రామన్ గనుక తాను హోంమంత్రి పాత్ర పోషించేందుకు సమర్థుడని నమ్మితే… సంసిద్ధంగా ఉన్నట్టుగా కూడా సుముఖత వ్యక్తం చేశారట శేషన్.

ఆ సమయంలో శేషన్ లో ఒక రకమైన ఆనందం, శక్తితో పాటు.. తనకు మరింత మెరుగైన అధికారం దక్కుతుందనే భావన కనిపించాయంటారు గోపాలకృష్ణ తన పుస్తకంలో.

1991లో అప్పటి జనతాదళ్ ప్రభుత్వంలోని ప్రధాని చంద్రశేఖర్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతును ఉపసంహరించుకుంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జనతా ప్రభుత్వ నిఘా లోపించిందని, రాజీవ్ హత్యలో ఏదో కుట్ర దాగుందన్న ఆరోపణలు చేసింది.

దాంతోపాటు, అదే సమయంలో ఇండియన్ ఎకనామీ వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. వరల్డ్ బ్యాంక్ నుంచిగానీ, ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) నుంచి గానీ కనీసం స్వల్పకాలిక రుణాలు కూడా అందని ఒక ఆర్థిక సంక్షోభంతో నాడు చంద్రశేఖర్ పదవి నుంచి తప్పుకున్నాడు.

మరే ఇతర పార్టీ కూడా ప్రత్యామ్నాయంగా మేజిక్ ఫిగర్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించలేదు. అలా చంద్రశేఖర్ ఆపద్ధర్మ ప్రధానిగా ఉండగా.. మళ్లీ లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.

సరిగ్గా ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న సమయంలో తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)తో సంబంధమున్న ఆత్మాహుతిదళం రాజీవ్ గాంధీ హత్యకు పాల్పడింది. ఆ ఘటన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ ఘటన భారత్ కు ఓ చీకటిరోజును మిగిల్చింది.

1990 డిసెంబర్ 12వ తేదీ నుంచి.. 1996, డిసెంబర్ 11వ తేదీ వరకూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా టీ.ఎన్. శేషన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల సంస్కరణల్లోనూ శేషన్ పేరు మారుమ్రోగింది. రాజీవ్ గాంధీ హత్య తర్వాత తను ఇంకా మంచి పదవిని ఆశించారు. తన సత్తా చాటాలనుకున్నారు. కానీ, ఏమైంది…?

శేషన్ ప్రతిపాదనల్ని ఎవరైనా పట్టించుకున్నారా..? లేదు. ఆయన సూచనలెవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. పరిగణనలోకే తీసుకోలేదు. ఎందుకంటే, ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రధాని చంద్రశేఖర్ తో పాటు, క్యాబినెట్ కార్యదర్శి నరేష్ చంద్ర రాష్ట్రపతి వెంకట్రామన్ ను కలిశారు.

శాంతిభద్రతల సమస్యతో పాటు, ఏ సంక్షోభాన్నైనా అరికట్టేందుకు అవసరమైన దేనికైనా సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. భయపడాల్సిన పనేం లేదని భరోసా కల్పించారు. పైగా ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఆ ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపేయాల్సిన పనీ లేదన్నారు.

ఆ సమయంలో రాష్ట్రపతి కూడా చంద్రశేఖర్ తో మాట్లాడుతూ ఎలాంటి అంతర్గత కలహాలుగానీ.. బయట నుంచి వచ్చే విచ్ఛినకర శక్తుల నుంచిగానీ ఏ హానీ లేకుండా సజావుగా నియంత్రించే శాంతిభద్రతల బాధ్యత మీపై ఉంది. కాబట్టి, మీరు హామీ ఇస్తున్న ప్రకారం ప్రతీది బాధ్యతాయుతంగా పరిస్థితులను చక్కదిద్దండి అని చెప్పినట్టు క్యాబినెట్ సెక్రటరీ నరేష్ చంద్ర చెప్పినట్టుగా కూడా గోపాలకృష్ణ రాసిన పుస్తకం పేర్కొంది.

అయితే, ఎన్నికల ప్రక్రియనే అవసరమైతే ఆపేసి, తను అంతకంటే ఉన్నత అధికారమైన హోంమంత్రి పోస్ట్ వైపు చూస్తున్న టీ.ఎన్. శేషన్… అప్పటికే మొదటిదశ పోలింగ్ అయిపోయిన ఎన్నికల షెడ్యూల్ ను మళ్లీ వాయిదా వేశారు.

రెండు, మూడు దశల్లో మేలోనే పూర్తి కావల్సిన రెండో విడత, మూడో విడత ఎన్నికలను ఏకంగా జూన్ 12, జూన్ 15కు వాయిదా వేశారు. పైగా పోలింగ్ తేదీలను ప్రభుత్వ సూచన మేరకే వాయిదా వేసినట్టు చెప్పుకొచ్చారు రామన్ మెగాసెసే గ్రహీత టీ.ఎన్. శేషన్. కానీ, దాన్ని అప్పటి ప్రధాని చంద్రశేఖర్ తిరస్కరించారు.

సీఈసీగా శేషన్ ఏకపక్ష నిర్ణయాలు అప్పటి రాజకీయ నాయకులను ఆశ్చర్యపర్చాయి. దాంతో ఐకే గుజ్రాల్, వీపీ సింగ్ వంటివాళ్లు నేరుగా రాష్ట్రపతి వెంకట్రామన్ కు సీఈసీపై ఫిర్యాదు చేశారు. జూనే 15వ తేదీన ఈసీ వింత వ్యవహారశైలిపై నేరుగా వెళ్లి రాష్ట్రపతికి విన్నవించినట్టు గాంధీ తన పుస్తకంలో తెలిపారు.

The Undying Light అనే పుస్తకంలో నాటి సీఈసీని రాష్ట్రపతి వెంకట్రామన్ ఎలా చూసేవారో, ఏమనుకునేవారు అనే అంశాలపై కూడా The President Years అనే పార్ట్ లో పొందుపర్చారు. శేషన్ ఎన్నికల కమిషనర్ గా తన పనిని నిష్పాక్షికంగానే నిర్వర్తించారు.

కానీ, అనవసరంగా ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఇంకా ఉన్నత పదవి కోసం వెంపర్లాడాడనే విషయాన్నీ రాష్ట్రపతి అంగీకరించినట్టూ ఆ పుస్తకం పేర్కొంటోంది. ప్రతీ రోజూ ప్రెస్ కాన్ఫరెన్సెస్ నిర్వహిస్తూ.. సమస్యలపై తన వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఒక ఉన్నతస్థాయి ఉద్యోగిగా సరైంది కాదనే విషయాలన్నీ ఎలా ప్రస్తావనకొచ్చాయో గోపాలకృష్ణ గాంధీ బుక్ చెబుతోంది.

స్వాతంత్ర పోరాట సమయం నుంచి నేటివరకూ దేశంలోని ముఖ్యమైన రాజకీయ ఘటనలపై The Undying Light పలు అంశాలను స్పృశించింది……..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions