ఈరోజంతా ఒక వీడియో, ఒక ఫోటో డిస్టర్బ్ చేశాయి… ఒకటి చికాకు పెట్టింది… ఒకటి చివుక్కుమనిపించింది… నిజానికి రెండింటికీ సంబంధం లేదు… ఉందంటే ఉంది… ఒక వీడియో… చిన్న బిట్… కృష్ణ మరణానంతరం ముఖ్యమంత్రి కేసీయార్ పరామర్శకు వెళ్లాడు… మామూలుగానే తన పరిసరాల్లో ఉండి, ఏదేదో ఎక్కువ తక్కువ మాట్లాడాలంటే ఒక్కొక్కరికీ హడల్… పైగా అక్కడ మహేశ్, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నాడు…
విజయనిర్మల కొడుకు సీనియర్ నరేష్ కేసీయార్ పక్కనే నిలబడి, చేతులు ఊపుతూ, ఏదేదో చెబుతుండేసరికి… కేసీయార్ సింపుల్‌గా ఆ చేతిని పక్కకు నెట్టేసి… ఎహె, ఊరుకోరా అనే ఫీలింగ్ ఇచ్చాడు… వెంటనే సంతోష్ నరేష్ చెవిలో ఏదో చెప్పాడు… దాంతో నరేష్ నెమ్మదించాడు… ఆ వీడియో బిట్ ఇప్పుడు వైరల్ అయ్యింది… నిజంగానే మహేశ్ బాబు ఎంతో హుందాగా వ్యవహరించాడు… దుఃఖం ఉన్నా వచ్చీపోయే ప్రముఖులతో మాట్లాడేటప్పుడు ఆ కృష్ణకు వారసుడే అనిపించాడు…
నిజంగానే నరేష్ కృష్ణకు ఏమవుతాడు..? ఏమీ కాడు… తను విజయనిర్మలకు మొదటి సంబంధం ద్వారా పుట్టిన కొడుకు… మూడు పెళ్లిళ్లు పెటాకులయ్యాయి… ఇప్పుడు పవిత్రతో ఉంటున్నాడు… కృష్ణ కుటుంబంతో వేరే బంధమేమీ లేదు తనకు… ఐనా నిన్నటి నుంచి కృష్ణ పార్థివదేహం దగ్గర ఒకటే ఓవరాక్షన్… చిరాకెత్తించాడు… కనీసం జనం ఏమనుకుంటారనే సోయి కూడా లేనట్టుంది మనిషికి… పైగా వయస్సు కూడా తక్కువేమీ కాదు… 62 ఏళ్లు… ఇంకెప్పుడొస్తుందో ఏమో…
Ads
దిగువన ఓ ఫోటో చూడండి… అది నిజమైన ఫోటో అనే అనుకుంటున్నాను… చూడగానే కలుక్కుమంది… ఒకప్పటి హీరో కాంతారావు శతజయంతిని ఆర్భాటంగా నిర్వహించలేని కొడుకులు ఏదో సింపుల్‌గా మమ అనిపించేస్తున్న ఫోటో అది… ఒకప్పుడు ఇదే కృష్ణకు దీటుగా జానపదాలు చేసిన హీరో తను… ఒకవైపు ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు… మరోవైపు అనామకంగా కాంతారావు శతజయంతి… ఎవరేం రాయించుకుని వచ్చారో కదా…
కాంతారావు కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీయార్ తదితరులకు దీటుగా బతికాడు… తరువాత దెబ్బతిన్నాడు… చివరకు చెన్నైలో ఇల్లు కూడా అమ్ముకుని హైదరాబాద్ చేరుకున్నాడు… తన పిల్లలు, తన జీవిత చరిత్ర చెప్పడం లేదు ఇక్కడ… కానీ ఆర్థికంగా చాలా గడ్డురోజుల్ని అనుభవించాడు… డెస్టినీ, టైమ్, విధి ఎలాంటివో కాంతారావు చివరిరోజులు గమనిస్తే అర్థమవుతుంది… ఇండస్ట్రీ, లోకం పోకడలకు ఒక ఉదాహరణ…
అప్పట్లో ఒకటీరెండు బ్రాహ్మణ సంఘాలు పూనుకుని, కొంత ఆర్థికసాయాన్ని చేసినట్టుగా చదివినట్టు గుర్తు… ఇప్పుడు కొడుకులేం చేస్తుంటారో తెలియదు… కానీ తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ నెలనెలా కొంత ఆర్థికసాయం చేసేది… ప్చ్, అంతటి జానపద కథానాయకుడి శతజయంతికి ఇప్పుడు డజను అరటి పళ్లు, ఓ ఇరవై మందికి భోజనం… కృష్ణ మరణవార్తల హోరులో అసలు కాంతారావు శతజయంతి అనే విషయమే మరుగునపడిపోయింది… గుర్తుంచుకుని నివాళి అర్పించినవాళ్లే లేరు… అంతే… ఎవరికెంత ప్రాప్తమో… అంతే…! కృష్ణ సినిమాల్లో కూడా కాంతారావు నటించాడు…!
Share this Article