సాఫీగా, సజావుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సాగిపోతున్న దశలో… టోల్ చార్జీలపై కూడా ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా వినిపించని దశలో… హఠాత్తుగా కేసీయార్ ఓఆర్ఆర్ మొత్తాన్ని 30 ఏళ్ల లీజుకు ఇచ్చిపారేశాడు… దాని ఖరీదు 7380 కోట్లు… అదేదో ఐఆర్భీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థకు కట్టబెట్టేశారు… ఇక మొదలైంది దారుణమైన బాదుడు…
నిజానికి ఓ ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇవ్వాలి..? హెచ్ఎండీఏకు చేతకాదా..? ఈ దుందుడుకు చర్యకు కేసీయార్ ప్రభుత్వం ఎందుకు పాల్పడినట్టు..? కారణం ఏమిటి..? ఇదే డౌట్ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికీ వచ్చింది అప్పట్లో… ఆ టెండర్లపై సమాచారం అడిగినా కేసీయార్ ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ హైకోర్టు దాకా వెళ్లాడు… చాలా చౌకగా టెండర్ ఎందుకు కట్టబెట్టినట్టు అని ప్రశ్నించాడు… ఇదొక అవినీతి దందా అని విమర్శలు చేశాడు…
తరువాత ఏమైంది..? ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ద్వారా రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసు ఇప్పించింది కేసీయార్ ప్రభుత్వం… ఎవరూ ఏమీ అడగొద్దు కదా తమ హయాంలో..? సరే, తరువాత ఈ వివాదానికి సంబంధించి ఏం జరిగిందో ఎవరికీ ఏమీ తెలియదు… ఈలోపు కేసీయార్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది… ఇదే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు…
Ads
సరే, జరిగిన అన్యాయాన్ని రేవంత్‌రెడ్డి సరిదిద్దుతాడు, ఈ బాగోతాన్ని మొత్తం తవ్వి అక్రమాల బాధ్యులను గుర్తించి తాటతీస్తాడు అనుకున్నారు కదా… ఇప్పుడు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది… అడ్డగోలు నిర్వహణకు తోడు మరింత అడ్డగోలుగా ఛార్జీలను పెంచి పారేసింది సదరు సంస్థ…
ఉజ్జాయింపుగా చూస్తే ఏకంగా మూడు రెట్ల వరకూ ఎక్కువ వసూలు చేస్తున్నారు… దానికి ఓ లెక్కాపత్రం లేదు… నిజానికి హెచ్‌ఎండీఏతో సంప్రదింపులు లేక ఛార్జీలను పెంచకూడదు… మరి ఈ ఛార్జీల బాదుడుకు ఏ ఉన్నతాధికారి బాధ్యుడు..? వాహనదారులను అడిగితే వేలకువేల ఉదాహరణలు చూపిస్తారు… దారుణమైన దోపిడీ సాగుతోంది… జాతీయ రహదారులపై విధించే టోల్ ఛార్జీల విధానమే దీనికీ వర్తిస్తుంది కదా, మరి ఇక్కడ ఇదేమిటి..?
కేసీయార్ తెలంగాణ జనంపై రుద్దిన ఈ దోపిడీ బాగోతాన్ని రేవంత్‌రెడ్డి ఛేదిస్తాడా..? అసలు ఓఆర్ఆర్ మీద ఏం జరుగుతున్నదో తనకు సమాచారం ఉందా..? దీనిపై తనే పోరాడిన తీరు గుర్తుందా..? ఆ అర్వింద్ కుమార్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించడం కాదు, ఈ వంకర టెండర్ల అసలు యవ్వారం ఏమిటో తేలుస్తాడా..? నిజానికి ఇది ఓ హైదరాబాద్ సమస్యో, తెలంగాణ సమస్యో కాదు… నార్త్, సౌత్ నడుమ ఓ ప్రధాన రోడ్ జంక్షన్ సమస్య…
సరే, కేసీయార్ తమ దోస్తే కాబట్టి బీజేపీ కిమ్మనదు… నేషనల్ హైవే కదా తను ఇన్వాల్వ్ కావొచ్చా..? అయ్యే అవకాశమున్నా దానికి ఏమీ పట్టదు… ఆశించడం దండుగ… సో, ఈ అడ్డగోలు టోల్ దోపిడీ ప్రభావం రేవంత్ ప్రభుత్వం మీదే నెగెటివ్‌గా పడుతుంది… తిన్నవాడెవడో సేఫ్‌గానే ఉంటాడు… తిన్నదెక్కడో భద్రంగానే ఉంటుంది… కానీ జనంపై పడే భారం మాటేమిటి..? ఈ ప్రభుత్వం కర్తవ్యం మాటేమిటి..? రేవంత్ చేధించాల్సిన అవినీతి, అక్రమాల బాగోతాల్లో ఓఆర్ఆర్ కూడా ప్రయారిటీ లిస్టులో ఉన్నట్టా..? లేనట్టా..?
పెద్ద జోక్ ఏమిటంటే… బీఎల్ఎన్‌రెడ్డి అనే ఓ చీఫ్ ఇంజినీర్, హెచ్ఎండీఏలో కొలువు… ఒకవేళ ఎక్కువ డబ్బులు తీసుకున్నట్టు రుజువైతే వాళ్ల ఖాతాల్లో జమ అవుతాయట… ఫిర్యాదులు విచారిస్తారట… ఈ టోల్ కోసం ఎవరు ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎవరు విచారిస్తారు, ఎందరి డబ్బులు వాపస్ ఇప్పించారు..? సగటు రాజకీయ నాయకుడి యవ్వారంకన్నా దరిద్రంగా ఉంది ఆయన వివరణ… మేడిగడ్డ నుంచి ఓఆర్ఆర్ లీజు దాకా కేసీయార్ ప్రభుత్వం ఉద్దరించినవి ఇంకా ఎన్ని బయటపడాల్సి ఉందో..!!
ఈ వార్త రచయిత అనుభవం… ఘట్‌కేసర్ నుంచి బొంగులూరుకు 60 రూపాయలు… బొంగులూరు నుంచి కోెకాపేటకు 100 రూపాయలు… అంటే ఘట్‌కేసర్ నుంచి కోకాపేటకు 170 కట్టాల్సి వచ్చింది, కట్టయింది… ఘోరం ఏమిటంటే, రిటర్న్‌లో కోకాపేట నుంచి బొంగులూరు వరకు 110 రూపాయలు ఫాస్టాగ్‌లో కట్… ఇక పాఠకుడే అర్థం చేసుకోవాలి, దోపిడీ ఏ రేంజులో సాగుతున్నదో…!!
రామోజీరావుకు ఎలాగూ ఇవి రాయడం చేతకాదు… రాధాకృష్ణ ఇంకా నిద్ర నుంచి లేచినట్టు లేడు… ఇది రాసిన సాక్షికి అభినందనలు… ఏమో, రేపు కొంపదీసి నమస్తే తెలంగాణలో సాక్షి కథనం మీద తీవ్రాతితీవ్ర ఖండన రాదు కదా… టీవీ మీడియాకు జనం కష్టనష్టాలు ఎలాగూ పట్టవు కదా…!!
Share this Article