ఎస్, సినిమా పాటల తీరు మీద కాస్త స్వరజ్ఞానం, బుద్ధీజ్ఞానం ఉన్నవాడెవడూ సంతృప్తిగా లేడు… పిచ్చి పిచ్చి పదాలు, వెర్రెక్కించే వాక్యాలతో వెగటును, అశ్లీలాన్ని జనం మీదకు వదులుతూ ఉంటారు… అది ఇప్పటి ట్రెండ్ ఏమీ కాదు… నిజానికి ఇప్పుడు చాలా తక్కువ…. ఆత్రేయ, వేటూరి తదితరులు టన్నుల కొద్దీ అశ్లీలాన్ని వండి, తెలుగు ప్రేక్షకుల మీదకు వదిలారు…
ఎన్టీయార్, ఏఎన్నార్ దగ్గర్నుంచి ఎవరూ మినహాయింపు కాదు… బూతును దట్టంగా దట్టించిన పాటల్ని పిచ్చి గెంతులతో జనం మీద జల్లారు… 80 90 దశకాల్లో నర్మగర్భపు బూతులు లేని పాట ఉండేది కాదు… అదేమంటే ప్రేక్షకులకు అదే కావాలి అంటారు… మంచి పాటలు వస్తే ఆదరించామా, ఆ దరిద్రులు అలాగే చెబుతారు అని ప్రేక్షకులు అనేవాళ్లు… అది ఓ ఒడవని సంవాదం…
సేమ్, సినిమాను చూసి ప్రేక్షకులు చెడిపోతారు, లేదు లేదు, సమాజరీతిని బట్టే సినిమాలు అనే సంవాదం చాలా ఏళ్లుగా నలుగుతున్నదే… అది వదిలేస్తే… ఈమధ్య గరికపాటి అనే ఓ ప్రవచనకారుడు… (ప్రవచనం అనగానేమి అనేది పెద్ద మార్మిక, సమాధానరహిత ప్రశ్న) కమ్ అవధాని పుష్ప సినిమా మీద నిప్పులు గక్కాడు… ఆ సుకుమారుడో, ఆ అల్లు అర్జునుడు కనిపిస్తే కడిగేస్తాను అన్నాడు… నాన్సెన్స్, ఓ స్మగ్లర్ హీరో ఏమిటి అన్నాడు… నిజానికి ఇందులో కాస్త తన అజ్ఞానమే కనిపించింది సుమీ… ముందుగా ఆయన ఏమన్నాడో చూడండి…
Ads
పుష్పలో బన్నీది ఓ కేరక్టర్… అసలు హీరో అనే పదమే సినిమాల్లో ఉండదు… జస్ట్, లీడ్ రోల్ అనాలి… మన ఫ్యాన్స్, మన నిర్మాతలు ఓ హైప్ కోసం హీరోయిజాన్ని రుద్దే క్రమంలో ఆ హీరో అనే పదాన్ని లీడ్ రోల్‌కు రుద్దారు… గరికపాటి వాదనలో అర్థం కనిపించలేదు… వీరప్పన్ మీద సినిమా తీస్తే, తన స్మగ్లింగ్, తన రాక్షసత్వం, తను ఎదిగి, చివరకు ఒరిగిన తీరే ఆ కథ… పురాణగాథల్లో బోలెడు మంది విలన్లు లేరా..? ఇదీ అంతే…
ఇక్కడ ‘ముచ్చట’ బన్నీని సమర్థించడమో, గరికపాటిని ఖండించడమో కాదు… ఇష్యూ చెప్పడమే ప్రధానం… నిజానికి ఈ సినిమాలో ఖండించదలిస్తే అందులోని వెగటు, వెకిలి సీన్లను హార్పిక్‌తో కడగాలి… మరీ హీరోయిన్‌ను డబ్బులకు ముద్దులు పెట్టే కేరక్టర్‌గా చిత్రీకరించడం అట్టర్ నాన్సెన్స్… ఎక్కడెక్కడో చేతులు వేస్తాడు, ఆమె పరవశించిపోతుంది… సమంత మరీ దరిద్రం… ఆ ఊపుళ్లు వ్యాంప్ కేరక్టర్లకూ చేతకావు… అన్నింటికీ మించి ఊ అంటావా, ఊఊ అంటావా అనే సినిమా ట్యూన్ మీద దేవిశ్రీప్రసాద్ తలతిక్క కామెంట్లు చేసినప్పుడు గరికపాటిలోని మోరల్ పోలీస్ ఎటు పోయాడు..?
వీఎన్ ఆదిత్య అనే సినిమా మనిషి అదే అడుగుతున్నాడు… ఉక్రోషం, ఆక్రోశం పట్టలేకపోయాడు… గరికపాటి మీద ఎక్కిదిగాడు… (సినిమా భాషకు క్షమించాలి…) ఆఫ్టరాల్ నువ్వు ఓ గరిక పాటి అంటున్నాడు… తన వాదన ఏమిటో యథాతథంగా చదవండి… ‘ముచ్చట’ దాన్ని ఎండార్స్ చేయడం లేదు… చాలా ఖండించదగిన అంశాలున్నయ్… కానీ ఓసారి చదవండి… నాణేనికి మరోవైపు వాద…
‘‘ఎంతమందినని తిట్టాలి..
ఎన్నిసార్లు ఖండించాలి..
ఎందరితో గొడవలు పెట్టుకోవాలి..
ఎందుకురా ఎవ్వరి జోలికీ వెళ్లని సినిమా వాళ్లని ఇలా నోటికొచ్చినట్టు అనేస్తున్నారు..
నిన్న గాక మొన్న హైందవ ధర్మ ప్రచారకర్త, ప్రవచనకర్తగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాయన కూడా ఆల్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయిన పుష్ప సినిమా ని అకారణంగా ఆడిపోసుకున్నారు..
పుష్ప సినిమాని అంత విమర్శించిన ఆ పెద్ద మనిషి, మరి హిందూ ధర్మం గురించి ఒక కమర్షియల్ సినిమాలో కూడా అద్భుతంగా చెప్పిన అఖండ సినిమాని ప్రశంసించలేకపోయారేం..
మంచి ని ప్రశంసించలేని సంకుచిత స్వభావికి చెడుని విమర్శించే హక్కు ఎక్కడ ఏడిసింది..
ఈయనే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటని తిట్టకుండా, ఆకాశం అమ్మాయైతే పాటని పొగుడుతూ, చెడుని వదిలేసి, మంచి ఎక్కడున్నా దాన్ని గుర్తించాలన్నారు…
మరిప్పుడేమైంది ..
కొత్తగా ఏదో పదవి వచ్చి వేదికనెక్కిన ఓ వెర్రి వెధవ పుష్ప సినిమా తీసిన వాళ్లని చెప్పుతో కొట్టాలంటాడు.. సరే కొట్టేద్దాం.. ఆ సినిమా కలెక్షన్ అంతా వాడిని టేబిల్ మీద పెట్టమని, అది ఆ యూనిట్ కి, టికెట్లు కొన్న ప్రజలకి ఇచ్చి అప్పుడు కొడదాం.. ఇవ్వగలడా.. రూపాయి జేబులోంచి తీసి పక్కన ఉన్నవాడికి ఇవ్వలేని ప్రతివెధవా ఆడిన సినిమా గురించి నోటికొచ్చినట్టు వాగేవాడే..
మొన్నామధ్యన హైందవ ధర్మ ప్రచారకర్త గా అన్నమయ్య సంకీర్తనల సాధన కోసం ప్రభుత్వం దగ్గర అప్పనంగా స్థలం చేజిక్కించుకున్న ఒక పెద్దావిడ గీతాజయంతికి అన్నమయ్య భక్తి గీతంతోనో, కృష్ణుడి గీతా శ్లోకంతోనో కాకుండా, అప్పుడే పాపులర్ అయిన పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ ని పేరడీ చేసి, గీతా జయంతి శుభాకాంక్షలు చెప్పారు.. ఎంత సిగ్గుచేటు.. ఆవిడని ఒక్కమాట అనలేని చవట దద్దమ్మలు అందరూ కలిసి ఆ విషయం ప్రెస్ మీట్ లో ఆనందంగా చెప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ని నానా మాటలూ అన్నారు.. దమ్ముంటే ముందు ఆవిడని అనాలి కదా..
సినిమా అనేది చూసే ఇంట్రస్ట్ ఉన్న ప్రేక్షకుడి కోసం తీస్తారు.. నచ్చితే ప్రేక్షకుడు ఆదరిస్తాడు..
నచ్చకపోతే తిరస్కరిస్తాడు..
ఇదొక కళాత్మక వ్యాపారం.. కళ అనే నది వెళ్లి వ్యాపారం అనే సముద్రంలో కలవడమే ప్రేక్షకుల ముందుకి వచ్చే సినిమా.. ఇది కూడా కొన్ని కోట్ల మందికి జీవనోపాధి కలిగించే ఒకానొక రంగం..
రాజకీయం రంగంలో లేని ఒక్క సినిమా వాడన్నా ఎదురెళ్లి ఒక్క విమర్శ ఎవ్వరినన్నా ఎప్పుడన్నా చేశాడా.. ఏ వేదిక మీదన్నా..
ప్రత్యేకంగా ఏదో ఒక కులాన్నో, మతాన్నో కించపరిచే సినిమా తీసినప్పుడు మనోభావాలు దెబ్బ తిని విమర్శించారంటే అర్ధం ఉంది.. అవేమీ లేని సినిమా వాళ్లని, సినిమాలని, ఇంత సంస్కారహీనంగా, ఇంత నిర్లజ్జగా , నిస్సిగ్గుగా , అసహ్యంగా మాట్లాడే నీచ సంస్కారం సమాజానికున్నప్పుడు ఆ సమాజం నుంచి వచ్చిన సినిమా వాడు బూతు సినిమాలు తీయకుండా నీతి సినిమాలు తీస్తాడా..
“నీ అద్దం సినిమా రా దద్దమ్మా.. ”
నువ్వెలా ఉంటే సినిమా రంగం అలా ఉంటుంది..
నువ్వు సంస్కారివైతే బాహుబలి, రంగస్థలం,అతారింటికి దారేది, శతమానంభవతి,సైరా, అఖండ కనిపిస్తాయి..
నువ్వు లోఫరు గాడివైతే నీకు చీకట్లో చితక్కొట్టుడు,
నువ్వు స్టూడెంట్ వైతే అర్జున్ రెడ్డి,
మాస్ గాడివైతే పుష్ప , ఖైదీ నంబర్ 150,
సమరసింహారెడ్డి, ఇంద్ర కనిపిస్తాయి..
నీకేది నచ్చితే అది నీ మానసిక స్థాయి..
నీ తాత్కాలిక ఆనందం. .
అడ్డమైన ప్రతి వెధవా సినిమా ని, సినిమా వాళ్లని నోటికొచ్చినట్టు వాగడానికి కూడా టిక్కెట్ పెడితే,
మీ ఆస్థులమ్ముకుని రోడ్డున పడతారు పిచ్చి వెధవల్లారా..
ఒక సినీ గాయని అభిమానుల కోసం భర్తతో ఫొటో పెడితే .. బాడీ షేమింగ్, నోటికొచ్చినట్టు వాగడం..
అదే పని ఏ సినిమా వాడన్నా ఒక నాన్ సినిమా వాడి పేజ్ మీదకెళ్లి ఒక్క చిన్న విమర్శ చేశారా ఇప్పటిదాకా.. మరి మీకేంట్రా అంత చులకన..
మీకు మొగుళ్లు లేరా.. పెళ్లాలు లేరా..
కళని , కళాకారుల్ని గౌరవించుకోలేని కుసంస్కారమైన కుళ్లిన నీ సమాజాన్ని, ఆలోచనల్ని ముందు నువ్వు శుభ్రం చేసుకో..
ఆటోమేటిక్ గా మా సినిమా రంగం బాగుపడిపోతుంది..
సినిమా వాడు చనిపోయిన రోజు కూడా కడుపుబ్బరం ఆపుకోలేక విషం విరజిమ్ముతున్న సర్పాలు మీరు.. కనీస జీవన మర్యాద కూడా కోల్పోయిన కుళ్లుబోతులు మీరు..
శ్రీచాగంటి గారు శంకరాభరణం సినిమాని పొగిడారు గానీ మరే సినిమానీ ఇంతవరకూ ఆయన విమర్శించలేదు..
అదీ సంస్కారం అంటే..
ధర్మ ప్రవచనాలు వల్లించే వారు, ఆధ్యాత్మిక వేత్తలు , నేర్చుకోవాల్సింది ఇది..
మానవతావాదులు,హేతువాదులు, స్త్రీ వాదులు, ఆస్థికులు, నాస్థికులు, సంఘసంస్కర్తలు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, వాళ్ల తొత్తులు, మైనార్టీలు, మెజార్టీలు అందరూ కలిసి సినిమా వాళ్ల సోషల్ పేజెస్ నుంచి సమాజంలో ఉన్న సమస్యల మీదకి దృష్టి సారిస్తే.. ఎంత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది మీకు, మా సినిమా వాళ్లకు కూడా.. ఆ ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా లేని మీ విషసంస్కృతి చూస్తే ఒక పౌరుడిగా నాకు ఆందోళనగానూ,
మీలో ఒకడిగా లేనందుకు, కేవలం రెండు శాతం సక్సస్ రేటుకే మీరింత కుమిలి కుమిలి ఏడుస్తున్న అత్యంత పవర్ ఫుల్ మాధ్యమం అయిన సినిమారంగంలో ఉన్నందుకు గర్వంగానూ ఉంది..
మమ్మల్ని తిడుతూ మీరు దిగజారుతారా..
మాలో మంచిని ప్రోత్సహిస్తూ మీ స్థాయి పెంచుకుంటారా మీ విచక్షణ కే వదిలేస్తున్నా..
మేమయితే ఆపేదేలే.. తగ్గేదేలే..
హ్యాపీ సండే..
వి.ఎన్. ఆదిత్య ✍️’’
ఆ భాషను, ఆ టెంపర్‌ను, వ్యక్తీకరణ శైలిని ‘ముచ్చట’ ఖండిస్తోంది… కానీ ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని, అన్నమయ్య పేరిట అపరిమిత సంపాదనను సొంతం చేసుకున్న ఓ ఆధ్యాత్మిక ప్రచారిణి కూడా ఊ అంటావా ఊఊ అంటావా పాటకు పరవశించిపోయి, దేవుడికి అర్జెంటుగా రుద్దేసి, పాడి, వెగటు పుట్టించింది… అది కళకు అంకితమో, కళంకితమో… అసహ్యం కలిగింది… అది కదా గరికపాటి ముందు తప్పుపట్టాల్సింది…
https://www.youtube.com/watch?v=oBoq9IOHyEM
ఆదిత్య వాదనలో స్వోత్కర్ష ఉంది… అది సమర్థనీయం ఏమీ కాదు… సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలకు ఓ నైతిక బాధ్యత ఉంటుంది… అది అర్థమయ్యే స్థాయి ఆయనలో ఉందని అనుకోలేం… కానీ ఒక చర్చకు తెరతీశాడు… సమాజంలోని అనేక అంశాల్ని టచ్ చేయలేని, చైతన్యవంతం చేయలేని, కేవలం వెగటుకోణాన్నే పట్టుకుని, అదే ఘనతగా, అనివార్యతగా ఏడ్చేవాళ్లను ఏమీ అనలేం ఇక… ఆత్మవిమర్శ అనేది చేతనైనవాడి వాదన కాదు అది… గరికపాటి బురదలో రాయేశాడు… కడుక్కుంటాడో, ఏమని ఎదురుదాడి చేస్తాడో చూడాలి….!!
Share this Article