రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, జాతీయ అవార్డులు, ఫిలిమ్ ఫేర్ అవార్డులు, ఫైమా అవార్డులు… మన్నూమశానం ఏవేవో అవార్డులు… బోలెడు కేటగిరీలు… కొన్నిసార్లు ఈ కేటగిరీ కూడా ఉందా..? ఇందులో కూడా అవార్డులు ఇస్తారా అని హాశ్చర్యపోతుంటాం… సరే, చాలామందిని సంతృప్తి పరచడానికి చాలా అవార్డులు ఇస్తుంటారు… అది కూడా ఓ దందా… దాన్నలా వదిలేస్తే… ఇదుగో ఈయనకు ఏ కేటగిరీలో అవార్డు ఇవ్వాలి…? ఎందుకీ డౌట్ అంటారా..?
ఈయనకు స్వతహాగా సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు… పేరు ప్రమోద్ బీసీ… తనొక శునక శిక్షకుడు… అనగా డాగ్ ట్రెయినర్… వాటిని ఆడిస్తాడు, ట్రెయినింగ్ ఇస్తాడు… మంచి పెట్‌గా మలుస్తాడు… బోలెడు మంది కష్టమర్లు… తనను చార్లి 777 సినిమా దర్శకుడు కిరణ్ రాజ్, హీరో రక్షిత్ శెట్టి గట్టిగా పట్టేసుకున్నారు… మేం ఓ సినిమా తీస్తున్నాం, నువ్వు ఓ కుక్కతో నటింపజేయాలి అని… విషయం అర్థం గాక బుర్ర గిర్రున తిరిగి పారిపోబోయాడు… ఊహించి మరింత గట్టిగా పట్టుకున్నారు…
తనకు స్క్రిప్టు ఇచ్చారు… కీలకమైన సీన్లలో నటించేలా ట్రిక్కులు నేర్పించమన్నారు… మిగతాది చిత్రీకరణలో మేం చూసుకుంటాం అన్నారు… రే అని చాలెంజ్‌గా తీసుకున్నాడు ప్రమోద్… గ్రాఫిక్స్‌కు ససేమిరా అనేశారు హీరో, దర్శకుడు… నిజమైన కుక్కను చూస్తున్న ఫీల్ గ్రాఫిక్ కుక్కలో ఉండదు అని భీష్మించారు… ప్రమోద్ ఎందుకైనా మంచిదని ఒకటి కాదు, రెండు కుక్కలను తీసుకొచ్చాడు… తనకు కుక్కల మనసు తెలుసు… నిపుణుడు… 450 రకరకాల ట్రిక్స్ నేర్పించాడు… ప్రతి షెడ్యూల్‌కు ముందు 20, 30 ట్రిక్కులు నేర్పించేవాడు… ఎప్పుడంటే అప్పుడు అందుబాటులోకి వచ్చేవాడు…
Ads
మనుషులకు నటన నేర్పడమే పెద్ద టాస్క్… ఇక కుక్కలతో నటింపజేయడం చిన్న విషయమేమీ కాదుగా… మామూలు షాట్లకు దీనికీ పదిరెట్ల తేడా… పైగా షూటింగ్ ఏ బెంగుళూరులోనో, మైసూరులోనో కాదు… కథానుసారం గోవా, మహారాష్ట్ర, ఉత్తర కర్నాటక, పంజాబ్, రాజస్థాన్, సిమ్లా, కాశ్మీర్ అంతటా తిరిగారు… సినిమా క్లైమాక్సే మంచు కొండల్లో… ప్రతి పెట్ లవర్‌కు ఈ సినిమా కనెక్ట్ కావాలనేది దర్శకుడి కోరిక… అందుకే మలయాళం, తమిళం, కన్నడం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు…
మరి రివ్యూలు ఏవి..? అని అమాయకంగా అడక్కండి… వాళ్లకు బాహుబలి టైపు మీడియా మేనేజ్‌మెంట్ తెలియలేదు… అందుకే రివ్యూలు కనిపించవు… నిజానికి మంచి ఎమోషనల్ మూవీ… మీరు పెట్ లవర్స్ గనుక అయితే థియేటర్‌లోకి కర్చీఫులు, టిష్యూ పేపర్లను తీసుకెళ్లండి… నవ్వుతారు, ఏడుస్తారు, ఆ కుక్కతో పాటు మీరూ బోలెడు సీన్లలోకి ప్రయాణిస్తారు, ప్రవేశిస్తారు… హీరో పేరు ధర్మ…
ఒక ఒంటరి పక్షి… ఏదో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో పనిచేస్తుంటాడు… దేని మీద ధ్యాస ఉండదు… పెద్ద ఇంట్రావర్ట్… ఎవరితోనూ కలవడు… పైగా నెగెటివ్ మెంటాలిటీ, కోపం… నాలుగు ఇడ్లీలు, రెండు పెగ్గులు, ఆరు సిగరెట్లు అన్నట్టుగా సాగే నిస్సారమైన జీవితం… అనుకోకుండా ఓ కుక్కను తన ఇంట్లోకి తీసుకెళ్లాల్సి వస్తుంది… వదిలించుకోవడం కుదరదు… అదేమో చాలా యాక్టివ్…
రకరకాల సన్నివేశాలతో కుక్క ధర్మ జీవితాన్నే మార్చేస్తుంది… దానికి చార్లి అని పేరు పెడతాడు… అది తన మెంటాలిటీని, తన ఆలోచన ధోరణిని మార్చేస్తుంది… ఆ కుక్కను వెంటేసుకుని ఓ మోటార్ సైకిల్ మీద దేశాటనం బయల్దేరతాడు… ఆయా మాండలికాల్ని కూడా వాడుకుంటూ దర్శకుడు ఓ టూరిస్టు వ్లాగ్ అనిపిస్తాడు పలుసార్లు…
నిజానికి ఈ సినిమాలో హీరో, హీరోయిన్ అన్నీ ఆ కుక్కే… దేశంలో లక్షల కుటుంబాల్లో డాగ్స్ ఉంటయ్… అత్యంత విశ్వసనీయమైన పెంపుడు జంతువు అది… మనిషికి బాగా దగ్గరయ్యేదీ అదే… అందుకని సినిమా కనెక్టవుతుంది వాళ్లకు సులభంగా… ఇలాంటి సినిమాలు అరుదు కాదు, అత్యంత అరుదు… టఫ్ టాస్క్ కూడా… ఇప్పుడు చెప్పండి… హీరోను, దర్శకుడిని ఎట్సెట్రా రొటీన్ కేటగిరీలను వదిలేద్దాం… ఈ కుక్కకు ఏ కేటగిరీ కింద అవార్డు ఇవ్వాలి… అవార్డు మాత్రం ఇవ్వాల్సిందే… సేమ్, ఆ శిక్షకుడు ప్రమోద్‌కు కూడా తప్పకుండా ఇవ్వాలి… మరి తనకు ఏ కేటగిరీ కింద…!! సినిమా రివ్యూ అంటారా..? వేరే రివ్యూ అక్కర్లేదు… ఇది చాలు…!! నిజం చెప్పాలా..? రక్షిత్ శెట్టిలో ఇంత మంచి నటుడున్నాడని ఊహించం… మన తెలుగు వాళ్లకు ఇలాంటి టేస్టు ఉండదు… తీయరు… అది మనం సిగ్గుపడే మరో విషాదం…
ఫేస్‌బుక్‌లో మిత్రురాలు సుజాత వేల్పుూరి చెప్పినట్టు….. ధర్మ చెత్తలో విసిరే ఒక ఇడ్లీతో అతని మీద ప్రేమ పెంచుకుని,అతనితో హిమాలయాల వరకూ ప్రయాణించే ఒక ప్రిన్సెస్ చార్లీ… “కావాలని అడిగితే కానీ ఏదీ ఇవ్వని వాడు దేవుడెలా అవుతాడు. మనకేది కావాలో అదివ్వాలి గానీ” అని ధర్మ అంటుండగానే అతని వెనకాల వెంటబడి వస్తూ చార్లీని చూపిస్తాడు దర్శకుడు… ఎంత చీదరించుకున్నా, కొట్టినా వదలని చార్లీ అతనికి స్పృహ తప్పి హాస్పిటల్లో ఉన్నపుడు, అంబులెన్స్ వెనక వాహనాలను తప్పించుకుంటూ శరవేగంతో పరిగెత్తుకువచ్చిన చార్లీ ప్రేమకు ధర్మ, కట్టుబడిపోక ఏమవుతాడు? కమర్షియల్ సినిమాల హోరులో, గోలలో, ఊపిరాడనివ్వని ఆ హంగామాలో, తోటలోకి కిటికీ తీస్తే లోపలికి వచ్చిన ఒక శీతల పవనం చార్లీ… ఈ సినిమాలో చెప్పినట్టు.. “మీరు లక్కీ అయితే.. మీ జీవితంలోకి ఒక కుక్క వస్తుంది”…
Share this Article