అతడు … అతడే. కొందరు వ్యక్తులకు మరే ఇతరులతోనూ పోలికలుండవు .. వారి పని తీరుకు కొలబద్దలుండవు .. వారి ఆశయాలకు అవధులుండవు .. ఆకాంక్షలకు హద్దులుండవు ..అదే యూనిక్ నెస్ .. నూటికో కోటికో ఒక్కరుంటారు ..నేను నేనే అని సగర్వంగా చాటి చెప్పగల .. ప్రపంచం చేత చాటింపు వేయించుకోగల సమర్థులు వీరు ..టార్చ్ బేరర్లు అందామా? చరిత్ర పురుషులు అందామా? మార్గదర్శులు అందామా? శకకర్తలు అందామా? ఏమైనా అనుకోవచ్చు ..
వాళ్ల ప్రస్థానం నవీనం .. ప్రతి ఆలోచన ఉత్తేజితం .. నూతన పథ నిర్దేశంలో ఉషోదయం .. ఇంటి పేరు ఈనాడుగా మారి పోయిన రామోజీరావు .. తెలుగు మీడియా రంగంలో సృష్టించిన చరిత్ర .. తీసుకొచ్చిన మార్పులు .. సమాచార విప్లవాన్ని సామాన్యునికి చేరువ చేసిన వైనం అనన్య సామాన్యం .. జాతీయ, అంతర్జాతీయ , సాహిత్య వార్తలతో నిండిపోయిన పత్రికా రంగాన్ని నేల మీదకు దింపి ,సగటు మనిషి కష్టాలు కడగండ్లు , మంచి చెడ్డల వైపు దృష్టి సారించేలా చేసిన దార్శనికుడు ..చుక్కల్లో చూపు నింపుకున్న పత్రికా మాధ్యమాన్ని చుట్టూ పక్కల చూడమంటా న్యూస్ ని లోకలైజ్ చేసి చూపించారు రామోజీరావు .. అయిదు దశాబ్దాల క్రితం ఆయన వేసిన ఈ బాటలోనే తెలుగు పత్రికా రంగం నడుస్తోంది ..
జయాపజయాలు ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి .. దేనిపైనా మమకారం పెంచుకోకూడదనే స్థిత ప్రజ్ఞత ఆయన సొంతమనే చెప్పాలి .. తాను ప్రారంభించిన ఫెర్టిలైజర్స్ .. సోమా డ్రింక్స్ ۔۔ న్యూస్ టైమ్ వంటి వాటిని నిరపేక్షంగా వదిలేశారు .. తనతో విభేదించిన చిన్నకుమారుడిని కూడా వదులుకోవడానికి వెనుకాడలేదు .. ఉపయోగపడని వాటిని .. ఉపయోగం లేని వాటిని నిరంతరం భరించడం వ్యాపార సూత్రం కాబోదన్న ఆయన ఆచరణ. ఏ IIM లోనూ నేర్చుకోవాల్సిన అవసరం లేనంత ప్రాక్టికాలిటీ ..
Ads
సా..“ధిక్కారం ….” పత్రికా రంగం అంటేనే నిరంతర ఘర్షణ .. రాజకీయంగా తాను తీసుకున్న విధాన పరమైన వైఖరితో ఎంతటి ఒత్తిడులు ఎదురైనా యుద్ధమే చేశారు తప్ప రాజీ పడలేదు .. కాంగ్రెస్ పార్టీతో ఎన్టీయార్ .. వైఎస్సార్ వంటి నాయకులనూ లెక్క చేయక ఎదురొడ్డి పోరాటమే చేశారు .. కొత్త తరం రాజకీయ నాయకుడు జగన్ ను గద్దె దించేందుకు అలుపెరుగక చేసిన అక్షర పోరాటం ఆయన చివరి విజయం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వ్యవస్థాపన.. ఆ పార్టీని అధికారంలోకి తేవడం .. రాజకీయ చరిత్రను మలుపు తిప్పడంలో రామోజీరావు రాసిన రాత చెరగని పేజీ .. కమ్యూనిస్టు భావజాలంతో నడక ప్రారంభించిన ఆయన కాలానుగుణంగా గతిశీలత చెందడం మార్పును ఆహ్వానించడం ట్రన్స్ఫార్మేషన్ కు సిద్ధంగా ఉండటం ప్రగతిశీల లక్షణాలు .. ఆయన పట్టిందల్లా బంగారం అంటుంటారు .. అది నిజం కాదు ..
ప్రతి దశలోనూ అంతరాంతరాల లోతులను శోధిస్తూ.। అన్వేషిస్తూ .. సాన పెట్టుకుంటూ తానే బంగారంగా మారిపోయిన సంపూర్ణ వ్యక్తిత్వం ఆయన .. ఎవరైనా కులం ముద్రతో ఆయనను చూడాలని ప్రయత్నిస్తే ఆయన చెప్పింది ఒక్కటే .. పుట్టుకతో వచ్చింది పోదు .. కానీ ఇంటి పేరే వదిలేసుకున్న నేను ఇంకా ఆ గుంజాటనలోనే ఉంటానా? ఏ ప్రయాణికుడైనా సురక్షితంగా తన గమ్యం చేరానుకుంటాడు. డ్రైవర్ కులం .. మతం చూస్తాడా? సమర్థుడైన వాడిని ఎంచుకుంటాడా? నా కంపెనీలు సేఫ్ హ్సాండ్స్ లో భద్రంగా లక్ష్యం చేరాలనేదే నా ప్రయారిటీ అంటారు రామోజీరావు .. ఇంతకు మించిన పర్సనాలిటీ డెవలప్ మెంట్ ప్రిన్సిపుల్ .. బిజినెస్ సక్సెస్ సీక్రెట్ ఉంటుందా?
ప్రభాత సూర్యుడు నా ప్రత్యక్ష దైవం .. ఉషోదయం నా నిత్య చైతన్య క్షేత్రం అంటూ క్రియాశీలిగా .. కర్మ యోగిగా చివరి క్షణం వరకూ జీవించిన రామోజీరావు గారికి నివాళులు .. చరిత్రలో అతడు అతడే .. వెలుగు నీడ ఒకదాన్నొకటి ఎలా విడిచి పెట్టి ఉండవో ..క్రియాశీలుడైన వ్యక్తి .. అతని కర్మాచరణ ఒకదానిని వదిలి పెట్టి మరొకటి ఉండవు .. రామోజీరావు జీవితంలో చివరి రోజుల వరకూ తన పత్రికను చదివి ఎడిటోరియల్ సిబ్బందికి సలహాలివ్వడం ఇందుకు నిదర్శనం .. యథా ఛాయ తపౌ నిత్యం ..సుసంబద్ధో పరస్పరం .. ఏవం కర్మ చ కర్తా చ సంశ్లిష్టా వితరేతరమ్ …. (కృష్ణ సాయిరాం)
Share this Article