Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తాగడు… పొగ తాగడు… ఐనా కవిత్వం ఎలా రాసేవాడో అర్థం కాదు…

November 21, 2023 by M S R

అలా ఎలా వెళిపోతావ్, దేవీప్రియా!

AN UNFORGETTABLE POET OF OUR TIMES

——————————————————————-

Ads

దేవీ ప్రియ గతించి రెండేళ్లు …. Old Post

చుట్టూ గులాబి పూలు

కవి నిద్రపోతున్నాడు…

ఒకపక్క పచ్చని చేమంతి పూలు

నిశ్చింతగా నిద్రపోతున్నాడు కవి…

మేలిమి బంగారం లాంటి ఒక మానవుడు

శనివారం ఉదయం 7.10 నిమిషాలకు ఈ

లోకాన్ని విడిచి వెళిపోయాడు – పేరు దేవీప్రియ.

నాకు 37 సంవత్సరాలుగా తెలిసిన మనిషి.

సంపాదకుడు ఏబీకే ప్రసాద్ కీ, రచయిత పతంజలికీ, ఆర్టిస్ట్ మోహన్ కీ మిత్రుడు.

1983 – 84లో ఉదయం పత్రిక వీళ్ళని కలిపింది.

ఇన్నేళ్ల తర్వాత తను ప్రేమించిన పతంజలిని, మోహన్ లని వెతుక్కుంటూ వెళిపోయాడు దేవీప్రియ.

****

1980 కావచ్చు. విశాఖ ‘ ఈనాడు ‘లో పనిచేస్తూ, సింగిల్ రూం లో బతుకుతున్నప్పుడు –

‘ అమ్మచెట్టు ‘ అనే పుస్తకం దొరికింది.

కవిత్వం పూసిన ఆ చెట్టుకొమ్మలు నన్ను చుట్టుకున్నాయి. ఆత్మ లోపలి చీకటి పొరల మీద ఒక మట్టి దీపమేదో వెలిగినట్టయింది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా, కుర్రతనపు ఆవేశాన్ని అక్షరాలుగా మారుస్తూ ఒక 20 పేజీల ఉత్తరం రాశాను. అది దేవీప్రియకి పోస్ట్ చేశాను.

అచ్చూ తెలుగు సినిమాలా 1983లో హైదరాబాద్ వచ్చి ఉదయం లో చేరాను.

ఏబికే, కొమ్మినేని వాసుదేవరావు, దేవీప్రియ, మోహన్ అప్పుడే ఉదయంలో అడుగుపెట్టారు. రన్నింగ్ కామెంటరీ జంటగా దేవీ, మోహన్ పేర్లు ఆంధ్రప్రభ నుంచే మోతమోగాయి.

దేవీప్రియ అప్పటికే ఎస్టాబ్లిష్డ్ స్టార్. ప్రజాతంత్ర నడిపాడు. శ్రీశ్రీ కి సన్నిహితుడయ్యాడు. ‘మాభూమి’ కి పనిచేశాడు. రంగులకలల్లో తేలుతున్నాడు.

ఆయనా, భార్య రాజ్యలక్ష్మి బాగా పలకరించేవాళ్లు. మంచి భోజనం పెట్టేవాళ్ళు.

భోజనానిదేముందీ అనుకునేరు!

దేవీప్రియ మందు ముట్టుకోడు.

సిగరెట్ వాసన కూడా పడదు.

మరి కవిత్వం ఎలా రాసేవారో నాకు అర్థం కాదు.

ఇలా తాగని, పొగతాగని tribe దారుణమైన భోజనప్రియులై వుంటారు.

ఖాజా హుస్సేన్ ఖాన్ సాబ్ అయిదారు రకాల నాన్ వెజ్ వంటకాల్ని మస్తుగా తిని, ఎంజాయ్ చేసేవారు. చేస్తూ.. ఓ జోకూ, చమత్కారమూ, నవ్వులతో కలిపి పండించేవాడు. పెద్దగా పేచీలు పెట్టుకోటం, ఫిర్యాదులు చేయటం వుండదు.

హేపీ గో లక్కీ .. అన్నట్టుగానే కబుర్లు నడిచేవి. హుందాతనం అనే పైమెట్టు మీదే వుంటాడు. ఒక్క మెట్టు దిగడానికీ ససేమిరా, సుతరామూ వొప్పుకోడు.

****

30 సంవత్సారాల తర్వాత హైదరాబాద్ లో ఒక సభలో దేవీని పలకరించాను. చేతులు పట్టుకుని – కూర్చో అన్నాడు. అమ్మచెట్టు చదివి నువ్వు రాసిన వుత్తరం నేను భద్రంగా దాచుకున్నాను, తెలుసా? – అన్నాడు. ఎపుడన్నా రా మా ఇంటికి, చూపిస్తా – అనీ అన్నాడు.

దరిద్రుణ్ణి, ఎప్పుడూ వెళ్ళలేదు.

****

మొన్నటికి మొన్న, నవంబర్ 13 ఏమో, తెల్లవారుజామున అయిదింటికి ఫోను మోగింది.

“నేను దేవీప్రియని ” అన్నాడు.

“చెప్పండి. లేచే వున్నాను” అన్నా. ఇంతకుముందే చెప్పాగా ఆరోగ్యం బాగోలేదని. షుగర్ ఎక్కువైపోయింది. ఒక కాలు కొంత భాగం తీసేయాలన్నారు. రామచంద్రమూర్తి గారిని పిలిచాను. నీకూ చెప్పాలని అనిపించించింది. పదిన్నరకి ఆపరేషన్ అయిపోతుంది, వస్తావుగా – అన్నాడు.

తప్పకుండా వస్తానని చెప్పాను.

వెళ్ళలేకపోయాను. ఒక ఆర్టిఫిషియల్ లెగ్ వేస్తారు, వెళ్లొచ్చులే అనుకున్నాను. ప్రాణం మీదికొస్తుందని ఆయనా అనుకోలేదు.

****

2020 నవంబర్ 20 : రాత్రి 8 గంటలు. దేవీప్రియ పరిస్థితి విషమం – అని వాసిరెడ్డి నవీన్ FB లో Post చేశారు. గుండె జారిపోయింది.

get well soon అంటున్నారు మిత్రులంతా.

రెండు గంటలు గడిచాయి.

‘ దేవీప్రియ బతికే ఆశ లేనేలేదు ‘ – అని దేశపతి శ్రీనివాస్ confirm చేశారు.

ఉదయం 7.10 కి అంతా అయిపోయిందని వాసిరెడ్డి నవీన్… చివరి మాట చెప్పారు.

***

కవి ఎమ్మెస్ నాయుడు నుంచి పొద్దున్నే ఫోన్.

దేవీప్రియని చూసొద్దాం అన్నాడు.

తిరుమలగిరిలో క్రిమెటోరియం.

ఇంటికి ఆల్వాల్ వెళ్ళాం.

గులాబీ పూల మధ్య నిద్రపోతున్నాడు కవి.

ఒక్కరోజులో అన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి – అన్నారు కుప్పిలి పద్మ.

మౌనంగా వున్న సంపాదకుడు కె. శ్రీనివాస్ కవి ఫొటో ముందు కాసిని గులాబీలు ఉంచారు.

కే శివారెడ్డి, బీ నర్సింగరావు, కే రామచంద్రమూర్తి, ఘంటా చక్రపాణి, జగన్నాధ శర్మ,

నాళేస్వరం శంకరం, నందిని సిధారెడ్డి… ఇంకా శిఖామణి, ప్రసాదమూర్తి, జీవీ రమణ, యాకూబ్, పసునూరి శ్రీధర్ బాబు, జీ శ్రీనివాస్, బాల్ రెడ్డి, పాశం యాదగిరి ఇంకా అనేకమంది కవులూ, జర్నలిస్టులూ దిగులు గా కూర్చుని ఉన్నారు.

దేవీప్రియ కూతురు సమత, కొడుకు ఇవా …

ఎవరో ఏడుస్తున్నారు. కొందరు వోదారుస్తున్నారు.

“ఎన్ని యుగాలను తడిపిందో ఈ వాన” అని రాసిన కవి మాత్రం ‘ చలనం లేని శయనంబు ‘ అన్నట్టుగా… లోకంతో యిక పని లేనట్టుగా…

****

నేనోసారి కలేకూరి ప్రసాద్ ని గుర్తుచేసుకుంటూ కంచికచర్ల కోటేశు దారుణ హత్య గురించి రాశాను. పొద్దున్నే దేవీప్రియ ఫోను. “కోటేశు గురించి అప్పట్లో నేను పోయెం రాశాను. నువ్వయితే సంపాదించగలవు. ‘ జ్వాల ‘ పత్రికలో అచ్చయింది” అని చెప్పారు. మరికొందర్ని కూడా ఆ పోయెం గురించి అడిగారు. ఇప్పటికయినా ఆ కవిత సంపాదించగలమా? బండ్ల మాధవరావు గారూ ..

****

అమ్మచెట్టు, నీటిపుట్ట, చేపచిలుక, తుపాను తుమ్మెద, గాలిరంగు, గంధకుటి, గరీబు గీతాలు .. ఎంత మంచిపేర్లు పెడతాడో తన కవితా సంకలనాలకి!

ఆయన రచనల సర్వస్వం కవి ఖాదర్ మొహియుద్దీన్ తెస్తున్నాడని పెర్స్పెక్టివ్స్ ఆర్కే చెబుతున్నారు.

తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం వున్న దేవీప్రియ – 50 సంవత్సరాలు కవిత్వం రాశారు, నాన్ స్టాప్ గా.

***

రాయడం బాధ్యతగా స్వీకరించిన మనిషి

ఒక్క అక్షరాన్నీ వృథాగా పోనివ్వడు – అంటున్నాడు కవి నూకతోటి రవికుమార్.

***

అడవిపై దేవీప్రియ కవిత :

అడవీ, నువ్వంటే నాకిష్టం

రేపటి లోకానికి ఈనాటి తల్లివి నీవు

రేపటి ఆకాశానికి ఈనాడే పూచిన

సూర్యపుష్పానివి నువ్వు

నీ పేరు వింటేచాలు

నాకు పూనకం వస్తుంది

నీ చల్లని కనురెప్పల నీడల్లో

నావాళ్ళు సేదదీరారు

నీ కొమ్మలే, నీ గాలులే,

నీ ఆకులే సాక్షిగా

నావాళ్ళు నేలకి వొరిగారు

ఆ ఆయుధాలు దాచివుంచు

ఆ భాగాలను ఏరి వుంచు

నీతోడు అడవీ, ఈ దేశాన్ని

ప్లాస్టిక్ విషపుష్పాల ఉద్యానవనాల నుంచి

రక్షించటానికి ఏదో ఒకనాడు

నేనూ నీ సాయమే కోరతాను

***

గుంటూరు జిల్లా తాడి కొండకి చెందిన దేవిప్రియకు కాలేజి రోజుల్లో గురువు జంధ్యాల పాపయ్య శాస్త్రి . ఆయన సౌందర్య దృష్టి నీ

సుకుమారమైన పదాలువాడే నై పుణ్యాన్ని అద్భుతం గా ఒడిసిపట్టుకున్నాడని దేవిప్రియ కవిత్వం చదివితే అర్థం అవుతుంది.

***

“జమ్ జమ్మల్ మర్రీ” వంటి ఆయన సినిమా పాటలు నేటికీ నిత్య నూతనంగా ప్రజలు పాడుకుంటూనే వున్నారు. పాటకు పదాలతో ప్రాణంపోసే కళ తెలిసినవాడు దేవీప్రియ.

దేవీప్రియది అనునయ కంఠం. ఆగ్రహాన్ని కూడా అనునయంగా వ్యక్తీకరించడం ఆయన ప్రత్యేకత – అంటున్నాడు కవి యాకూబ్.

జమ్మల్ మర్రీ పాటలో “ధారలు కట్టిన చెమటే జరీపైట నీకు, చల్ …” అంటాడు దేవి. అలా కవితాధారలు కురిపించే శక్తిమంతుడైన కవి, మనకి మాత్రం అశ్రుధారలు మిగిల్చి వెళిపోయాడు.

***

దేవీ భార్య రాజ్యలక్ష్మి ముందే వెళిపోయింది.

ఆమె లేని వొంటరితనాన్నీ, చీకటితెరల్లా కమ్ముకుంటున్న వేదననీ ఆయన అరుదైన కవితాశిల్పాలుగా మలిచాడు.

“నేనెక్కడా ఉండలేను, మోహన్ నీ దగ్గరికి వచ్చేస్తాను” అని ఎన్నోసార్లు మా అన్నకి ఫోన్లు చేశారు. ఒకరోజంతా మా బంజారా హిల్స్ ఆఫీసులో వున్నారు. మోహన్ని పీడించి మంచి కేరికేచర్ వేయించుకున్నారు. ఆరోగ్యంగా, చెరగని చిరునవ్వుతో హేపీగా కనిపించే మనిషిలో వొంటరితనం గూడుకట్టుకోవడం కనిపించింది.

మంచి కవిత్వం రాయడం, ఒక కొత్త పుస్తకం వేయడం … వొంటరితనాన్ని జయించడం కోసం పెద్ద పోరాటమే చేశాడు. నవ్యకవితా శిఖరాల్ని అలవోకగా అధిరోహించిన కవి, షుగర్ వ్యాధి అనే లోయల్లోలోపలి కోమాలోకి జారిపోయాడు. చల్లని చావు చేతుల్లోకి దొర్లిపోయాడు. కాలం కత్తుల వంతెన మీద ఎర్రని సూర్యాస్తమం అయి కన్నీటి వీడ్కోలు – అంటున్నాడు.

***

ఎంత నిరాశ ఆవరించిందో మరి,

“అందరం వెళ్ళిపోవాల్సినవాళ్లమే”

అంటున్నాడు కవి ప్రసాదమూర్తి.

***

మరణం గురించిన దేవీప్రియ చివరి కవిత :

“మిగిలేదేముంది ఇంక

పులినోటికి పూర్తిగా

చిక్కినట్టే వుంది ఈ జింక” –

***

చివరిరోజుల్లో దేవీప్రియ గారితో ఆత్మీయంగా మాట్లాడి ధైర్యం చెప్పిన రచయిత్రి కుప్పిలి పద్మ చివరిచూపులకు వచ్చిన వారందరితో మాట్లాడి, దుఃఖాన్ని పంచుకున్నారు. సాయంత్రానికో ఆర్టికల్ రాసివ్వకూడదూ.. అన్న పద్మ గారి అభ్యర్ధనని కాదనలేకపోయాను….  – TAADI PRAKASH 9704541559

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions