నట చిరస్వీ…. రంగారావు ఎస్వీ…. జులై 18 ఎస్వీఆర్ 49 వ వర్ధంతి… నట యశస్వి ఎస్వీ రంగారావు నటనలో నిజంగా యశశ్వినే. ఆయన పరమపదించి నలబై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యింది. 1974 లో ఇదే రోజున కన్నుమూశారు. ఇప్పటికీ ఆయన పాత్రలు చిరస్థాయిగా నిలుస్తున్నాయి. ఆయన నటనకు ఈ తరం సైతం ముగ్దులవుతున్నారు. అనేక పాత్రలను అవలీలగా పోషించిన రంగారావును స్మరించుకుంటూ డాక్టర్ పురాణపండ వైజయంతి రచన ఇది…
స్వర్గలోకం సందడిసందడిగా ఉంది. చిత్రమేమిటంటే స్వర్గంలో దేవతల స్థానంలో దానవులు కొలువు తీరడానికి సన్నద్ధమవుతున్నారు. అంతకంటే ముందుగా అందంగా ఉండే స్వర్గాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఘటోత్కచుడు భూలోకం నుంచి ఎర్రటి మామిడి చిగుళ్లను తెచ్చి, అందమైన బంగారు దారాలతో వాటిని బంధించి, తోరణాలు కడుతున్నాడు. స్తంభం పగులగొట్టి, నరసింహ సాక్షాత్కారం పొందిన హిరణ్యకశిపుడు రంగమండపాన్ని అందమైన స్తంభాలతో, ఉన్నతాసనాలతో సిద్ధం చేస్తున్నాడు.
శ్రీకృష్ణుడి పిడిగుద్దులతో హతుడైన కంసుడు అంబారీ ఏనుగులను సర్వాంగసుందరంగా అలంకరించి, తీర్చిదిద్దుతున్నాడు. సైరంధ్రిని చేపట్టబోయి, భీముడి చేతిలో హతమైన కీచకుడు నర్తనశాలను పోలే హంగులు తీసుకువస్తున్నాడు. సత్యవాక్పాలన కోసం సర్వం త్యాగం చేసిన హరిశ్చంద్రుడు అతిథులను ఆప్యాయంగా ఆహ్వానించి, వారికి అందచేయడానికి అనువుగా బహుమతులను ఒకచోట అమర్చి ఉంచాడు. దుర్యోధనుడి గురువుగా పేరు పొందిన బలరాముడు… వచ్చిన అతిథులను పలకరిస్తూ, సాదరంగా ఉన్నతాసనాలలో ఉపవిష్టులను చేస్తున్నాడు.
Ads
శ్రీకృష్ణుని చేతిలో హతుడైన నరకాసురుడు నేలంతా ముగ్గులు పెట్టించి, వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతున్నాడు. భీముడి గదాఘాతంతో ఊరువులు కోల్పోయి, కన్నుమూసిన దుర్యోధనుడు వచ్చిన అతిథులకు ఆహ్లాదం కలిగించేలా ఉపన్యసిస్తున్నాడు. సలీం తండ్రి అక్బర్, బొబ్బిలి సింహం తాండ్రపాపారాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశాడు. ఎంతోమంది రాజకుమార్తెలను ఎత్తుకుపోయిన మాంత్రికులంతా వివిధ దేశాల రాజకుమార్తెలను గౌరవంతో ఆశీసులను చేస్తున్నారు. ఇక చివరగా రాముని చేతిలో హతుడైన రావణాసురుడు అతిథికి ప్రత్యేకమైన సింహాసనం ఏర్పాటుచేయించి, స్వయంగా దగ్గరుండి అతిథి మర్యాదలు చేస్తున్నాడు.
ఇంతమంది రాక్షసులకు స్వర్గంలోకి ప్రవేశం ఎలా కలిగిందో దేవేంద్రాదులకు అర్థం కాలేదు. అసలు తన నగరంలో తన ప్రమేయం లేకుండా ఇంత హడావుడి ఎందుకు జరుగుతోందో కూడా తెలియట్లేదు. మొత్తం విషయం సావిత్రి చేతిలో పరాజితుడైన నరకాధిపతి యమధర్మరాజుకి పూర్తిగా తెలుసు. మౌనంగా తన పని తను చేసుకుంటున్నాడు. ఇంద్రాది దేవతలకు ఉత్కంఠ ఆగట్లేదు. ఏం జరుగుతోందని అడగడానికి అహం అడ్డు వచ్చింది. యముడే నెమ్మదిగా చెబుతాడులే అని దూరం నుంచి అంతా గమనిస్తున్నాడు దేవేంద్రుడు.
సమయం అసన్నమైంది.
దూరం నుంచి గజరాజు అడుగుల సవ్వడి వినపడుతోంది…
అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తూ ఒక ఐరావతంలాంటి ఏనుగు అటుగా అడుగులు వేస్తోంది…
వైతాళికులు ఆ నిలువెత్తు విగ్రహానికి స్వాగతం పలుకుతున్నారు…
విశ్వవిఖ్యాత, విశ్వ నటచక్రవర్తి శ్రీశ్రీశ్రీ యశస్వీ రంగారావు జయహో జయహో అంటున్నారు.
స్వాగతం సుస్వాగతం అంటూ అతిలోకసుందరులు నాట్యం చేస్తూ స్వాగతం పలికారు.
ఆరడుగులు ఎత్తయిన విగ్రహం…
చిరు చుబుకం, మరింత ముచ్చటైన చిన్న నోరు…
నవరసాలు పలికే కళ్లు, ముఖంలోనే భావాలు పలికించే ఆ నట రంగారావు అంబారీ ఏనుగు మీద సభలోకి ప్రవేశించి, నెమ్మదిగా కిందకు దిగి, తనకు రావణుడు కేటాయించిన సింహాసనాన్ని అధివసించారు.
ఆ పక్కనే కె. వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఎన్‌టిఆర్, బాపు, ముళ్లపూడి రమణ, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం, ఛాయాదేవిలతో పాటు మరింతమంది ప్రముఖులకు కూడా ఉచితాసనాలు వేశారు. వారు కూడా మౌనంగా ఆసనాలలో కూర్చుని జరుగుతున్న కార్యక్రమాన్ని వారి వారి కోణంలో మురిసిపోతూ చూస్తున్నారు.
దేవేంద్రుడికి ఏమీ అర్థం కావట్లేదు. ఈ ఎస్వీ రంగారావును ఎందుకు ఈ దానవులంతా సత్కరిస్తున్నారో తెలియక అయోమయంగా ఉన్నాడు. ఏం జరుగుతోందని అడగడానికి అహం అడ్డు వచ్చి, జరిగేదేదో జరగనీ అనుకుంటూ చూస్తున్నాడు. దానవులు ఒక్కొక్కరు వచ్చి ఎస్వీరంగారావును అభినందిస్తున్నారు. అసలు వీరంతా ఎందుకు ఈయనను అభినందిస్తున్నారు. ఈ పురాణపాత్రలకు, ఆయనకు సంబంధం ఏమిటో అర్థం కాలేదు సురపతికి.
ఘటోత్కచుడు వేదిక మీదకు వచ్చి, రంగారావుని పూలమాలతో అలంకరించి, పాదాలకు సాష్టాంగపడి, ‘‘తాతా! ఇలా పిలుస్తున్నాననుకోవద్దు. నిన్ను తాత అని పిలవాలనిపిస్తుంది నాకు. అందుకే పిలిచాను. భారత కథలో నాది చిన్న పాత్ర. కాని మాయాబజార్ సినిమాలో నా పాత్రను ప్రధానపాత్రగా చేసి, ఎంత కథ నడిపావు… అక్షరాలు తెలియని చిన్నపిల్లలకు సైతం ఘటోత్కచుడు అంటే ఇంత పెద్ద విగ్రహం అనేలా నన్ను ఎంతో హుందాగా, శౌర్యవంతునిగా, ధైర్యవంతునిగా చూపావు. నీ వల్ల నాకు మంచి పేరు వచ్చింది. మాయాబజార్ సినిమా మొదలయ్యాక నా మహిమలు చూడటానికి పిల్లలు ఎంతో ముచ్చటపడేలా నటించావు. నీ అద్భుతమైన ప్రతిభ వల్లే నాకు ఇంత గుర్తింపు వచ్చింది. నీ వాచికం, నీ అభినయం, నీ ముఖ కవళికలు, నీ భావ వ్యక్తీకరణ… నువ్వు పుట్టి ఉండకపోతే నాకు గుర్తింపు వచ్చి ఉండేది కాదు’ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు ఘటోత్కచుడు.
పక్కనే కూర్చున్న హిరణ్యకశిపుడు సిగ్గుపడుతూ లేచి, రంగారావు దగ్గరకు వచ్చి, ‘మీకు నమస్కరించడానికి సిగ్గుగా ఉంది. కన్న కుమారుడిని చంపడానికి కూడా వెనుకాడని దుర్మార్గుడిని నేను. అంతటి నీచుడనైన నాకు కూడా ఎంత ఔన్నత్యాన్ని తీసుకువచ్చావు నువ్వు. ఒక కంట క్రోధం, మరో కంట బాధ చూపడం నీకు మాత్రమే సాధ్యం. ఎంత గొప్పగా నటించావు. ప్రహ్లాదుడు తన తియ్యని కంఠంతో పోతన పద్యాలు సుమధురంగా చదువుతుంటే, కనికరం కూడా లేని తండ్రిగా నువ్వు నాకు గుర్తింపు తెచ్చావు. నీకు ఏమిచ్చి మా ఋణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. నీ వల్ల మావంటి దుష్టపాత్రలకు సైతం గౌరవం ఏర్పడింది ప్రజలలో. నీ జన్మ ధన్యం కావడం కాదు, మా జన్మలను ధన్యం చేశావు. నీకు శతకోటి వందనాలు సమర్పించినా తక్కువే’ అంటూ తిరిగి తన ఆసనంలో కూర్చున్నాడు హిరణ్యకశిపుడు.
ఆ పక్కనే కూర్చున్న కంసుడు లేచి నిలబడి, రంగారావుకి భక్తిపూర్వకంగా నమస్సులు సమర్పించి, ‘మీరు యశస్వులు. మీ వల్ల నా వంటి దుష్టుడికి సైతం ప్రచారం కలిగింది. నేను ఎంత దురాత్ముడిని, ఎంత దుర్మార్గుడిని, స్వయంగా నా మేనల్లుడిని సంహరించడానికి పూనుకున్నాను. నా సోదరి కుమారుడి వల్ల నాకు చావు ఉందని తెలిసి, ఇంత పెద్దవాడిని అయి కూడా పసిబాలలను సంహరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణుడిని కూడా సంహరించడానికి సిద్ధపడ్డాను. ఆ శ్రీకృష్ణుడి చేతిలోనే హతమైన నన్ను కూడా ఎంత ప్రసిద్ధుడిని చేశావు. పోతన పద్యాల ద్వారా కొందరికి దగ్గరైతే, నీవు నటించడం ద్వారా మా పాత్రలు మరింతమందికి చేరువయ్యాయి. నీవు మహానుభావుడివయ్యా. నీ మనసు వెన్నపూసలాంటిదని చెబుతారు అందరూ. కాని ఇంతటి క్రూరత్వాన్ని నీ కళ్లలో ఎంత బాగా చూపించావు. నువ్వు కాదు ధన్యుడివి, నీ నటన ద్వారా మేం ధన్యులమయ్యాం. మా జీవితానికి సార్థకత కల్పించావు’ అంటూ ఆసనాన్ని అలంకరించాడు కంసుడు.
పక్కనే ఉన్న కీచకుడు సిగ్గుతో ఒదిగిపోతూ, ‘తండ్రీ! మీకు వేనవేల నమస్కారాలు. భారతంలో విరాటపర్వంలో కొద్దిసేపు మాత్రమే కనిపించే నా పాత్ర ఎంత దుష్ట పాత్రో నీకు తెలుసు. విరాటరాజు కొలువులో సైరంధ్రిని చేపట్టడానికి సిగ్గువిడిచి ప్రవర్తించిన నన్ను భీముడు సంహరించాడు. నా అంత సిగ్గుమాలిన వాడు మరొకడు ఉండడు. నర్తనశాల చిత్రంలో నా పాత్రను పోషించిన నీ నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నావు. ఎంత గొప్పవాడివయ్యా. ఒక వ్యతిరేక పాత్రకు ఈ స్థాయి అవార్డు అందుకోవడం తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో ఇదే ప్రథమం కదా. అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నావు. కీచకుడిగా పుట్టినందుకు నేను నన్ను ఎంత అసహ్యించుకున్నానో, నీకు అవార్డు అందడం చూసి అంత ఆనందించాను. నిజంగా నువ్వు గొప్పవాడివయ్యా. కీచకుడికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చావు. ‘ఆహ్’ అని ఒక్కసారి నువ్వు తల విదిలిస్తూ చిన్న డైలాగు చెప్పగానే ప్రేక్షకులు నీకు నీరాజనాలు పట్టారు. ‘కీచకుడి పాత్రకు ఇంత ఖ్యాతి తీసుకు రావొచ్చా, అనే ఆలోచన దర్శకులకు కూడా వచ్చి ఉండకపోవచ్చు. నీకు శతసహస్ర వందనాలు’ అంటూ సుఖాసీనుడయ్యాడు కీచకుడు.
ఆ పక్కన కూర్చున్న సత్యవాక్పాలకుడు హరిశ్చంద్రుడు లేని నిలబడి, మహానుభావా! నువ్వు కూడా సత్యవాక్పాలకుడివని విన్నాను. షూటింగ్‌కి ఆలస్యంగా వచ్చినా, ఏ మాత్రం సమయం తీసుకోకుండా, ఒకే నిమిషంలో నీ సంభాషణలు చెప్పేసి త్వరగా ముగించేసేవాడివని అందరూ చెప్పుకోవడం విన్నాను. నీ వల్ల నాకు కూడా మంచి పేరు వచ్చిందయ్యా. పుస్తకాలు, కథలు చదివేవారికి మాత్రమే నా గురించి తెలుసు. కాని నీ నటన వల్ల నేను సామాన్యులకు కూడా చేరువయ్యాను. కాటికాపరిగా నువ్వు అద్భుతంగా నటించావని అందరూ అనుకుంటుంటే నేను ఎంత గర్వపడ్డానో. నా జీవితానికి నువ్వు సార్థకత తీసుకువచ్చావని పరమానందించాను. నిన్ను ఆశీర్వదించడానికే ఇక్కడికి వచ్చాను. నీ కీర్తికి శతాయుష్మాన్‌భవ’ అంటూ రంగారావును ఆశీర్వదించి తన ఆసనంలో కూర్చున్నాడు.
ఆయన కూర్చోగానే పక్కన ఆసనంలో కూర్చున్న సుయోధనుడు లేచి నిలబడి, ‘భారతకథలో నేను చేసినన్ని అరాచకాలు ఎవ్వరూ చేయలేదు. ఇంటి కోడలిని తల్లితో సమానురాలైన వదినగారిని నిండు కొలువులోకి పిలిపించి, వస్త్రాపహరణం చేయించాను. పాండవులకు చెప్పరాని ద్రోహం చేశాను. రాజ్యకాంక్షతో వారి రాజ్యాన్ని అపహరించాను. అంతటి దుష్టుడినైన నా పాత్రను పోషించి, నా పాత్రకే వన్నె తెచ్చావు నువ్వు. అందుకే ఈ స్వర్గంలో నీ నూరేళ్ల పండుగకు హాజరై నిన్ను సత్కరించుకోవాలనుకుని వచ్చాను’ అంటూ తన ఉపన్యాసం ముగించి సుఖాసీనంలో కూర్చున్నాడు రారాజు.
చిట్టచివరగా రావణాసురుడు లేచి నిలబడ్డాడు. అక్కడున్నవారంతా అహో రూపం, అహో ధైర్యం అంటూ ప్రస్తుతిస్తున్నారు. అందరూ కళ్లు తిప్పుకోలేకపోతున్నారు ఆయన సౌందర్యానికి. రావణాసురుడు మాత్రం రంగారావు వైపు చూస్తూ, ‘నువ్వు గొప్పవాడివయ్యా. నన్ను వాల్మీకి వర్ణించిన దాని కంటే నిన్ను ఆ బాపు ఎంత అందంగా చూపాడయ్యా. ఇప్పటికీ సంపూర్ణరామాయణం సినిమా చూసేవారు, నిన్ను, నీ నటనను ప్రస్తుతిస్తుంటే, ఎంతటి ఘనుడవో అనిపించింది. మేమందరం ఒక్కరొక్కరమే, మరి నువ్వు, కొన్ని వందల పాత్రలలో జీవించావు. అందరినీ మెప్పించావు, అలరించావు. కళామతల్లి ఋణం నువ్వు తీర్చుకున్నావు, కాని ఆ తల్లి నీ ఋణం తీర్చుకోవడం ఎన్నటికీ కుదరదు. ఆవిడను చిర ఋణగ్రస్తురాలిని చేశావు. ఎంత గొప్పవాడివయ్యా. నాకు తగ్గ వాడిగా నిన్ను ఆ భగవంతుడు సృష్టించాడు. నా కోసం మాత్రమే కాదు, మా పాత్రల కోసమే నువ్వు పుట్టావు. నీ జన్మను సార్థకం చేసుకున్నావు. నీకు సహస్రాయురస్తు’ అంటూ రావణాసురుడు రంగారావును చూస్తూ తన ఆసనంలో కూర్చున్నాడు.
రంగారావు నటించిన పాత్రలన్నీ ఒకరి తరవాత ఒకరు మాట్లాడుతూ ఆయనను ఉచితరీతిని సత్కరించుకుంటూ, పరమానందం చెందారు.
దేవేంద్రుడికి పట్టరానంత ఆనందం కలిగింది. ఈ రాక్షసులంతా దేవలోకానికి ఎందుకు వచ్చారా అనుకున్న ఇంద్రుడు, తన లోకంలో ఇంత గొప్ప పండుగ జరగడం ఇదే ప్రథమం అనుకున్నాడు. తన లోకానికి ఈ కార్యక్రమం మరింత వన్నె తెచ్చిందని భావించాడు. పక్కనే కూర్చున్న బాపురమణలు, కెవి రెడ్డి వంటి వారిని చూస్తూ – ‘‘బ్రహ్మదేవుడు రంగారావుని పుట్టిస్తే, ఈ దర్శకులంతా రంగారావును చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దారు. కారణజన్ముడు రంగారావు. జయహో రంగారావు’’ అంటూ, అతిథులకు విందు భోజనం ఏర్పాటుచేశాడు ఇంద్రుడు.
ఇవీ పోషించిన పాత్రలు
మాయాబజార్ – ఘటోత్కచుడు
సతీ సావిత్రి – యముడు
భక్త ప్రహ్లాద – హిరణ్యకశిపుడు
యశోదకృష్ణ – కంసుడు
శ్రీకృష్ణలీలలు – కంసుడు
నర్తనశాల – కీచకుడు
హరిశ్చంద్ర – హరిశ్చంద్రుడు
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం – బలరాముడు
సంపూర్ణ రామాయణం – రావణుడు
దీపావళి – నరకాసురుడు
అనార్కలి – అక్బర్
మహాకవి కాళిదాసు – భోజరాజు
పాతాళభైరవి – మాంత్రికుడు
భట్టివిక్రమార్క – మాంత్రికుడు
బాలనాగమ్మ – మాంత్రికుడు
విక్రమార్క – మాంత్రికుడు
బొబ్బిలియుద్ధం – తాండ్రపాపారాయుడు
రెండు చిత్రాలకు దర్శకత్వం
రంగారావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం చిత్రానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు, రెండో చిత్రం బాంధవ్యాలు .. తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు.
నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమనటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.
దర్శకుడు చిత్రకారుడు బాపు వేసిన చిత్రానికి ముళ్లపూడి వ్యాఖ్యానం చమత్కారంగా…
క్లిష్టపాత్రలో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సులో పూలరంగారావు
నిర్మాతల కొంగుబంగారావు
స్వభావానికి ఉంగారంగారావు
నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్లక్కట్టినట్టు కనపడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు
2013లో భారత సినీ పరిశ్రమ వందేళ్ల సందర్భంగా తపాలాబిళ్ల…. (సృజన రచన: డా. వైజయంతి పురాణపండ)
Share this Article