Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘సరసం.కామ్‌’కు శ్రీరమణ రాత, మోహన్‌ గీత, వసంత లక్ష్మి అనుసంధానకర్త…

July 19, 2023 by M S R

Mohammed Khadeerbabu……   సాహితీ సభల్లో మాట్లాడేవారిపై బాగానే జోకులు వేసేవారు శ్రీరమణ. ఏ హెచ్చరికా లేకుండా ఎక్కువ సేపు మాట్లాడేవారి కంటే ‘పెద్దగేం మాట్లాడను అని పాయింట్లు రాసుకున్న చిన్న కాగితమ్ముక్కను బయటకు తీసేవారు ఎక్కువ ప్రమాదకారులు’ అనేవారాయన. ఇలాంటి వారు మైకు ముందుకు రాగానే మనం పలాయనం చిత్తగించాలని హితవు పలికేవారు.

ముళ్లపూడి వెంకటరమణ, బాపుగార్లతో సినిమా తీయాలని తలాతోకా తెలియని డబ్బున్న ఆసాములు వచ్చి, తోడు తెచ్చుకున్న బామరిదికి ముళ్లపూడి వారిని చూపిస్తూ ‘ఎవరనుకున్నావు. పెద్ద రచయిత. బాపు గారికి ఈయన ఎంత చెప్తే అంత. ముళ్లపూడి శ్రీనివాసరావనీ.. అబ్బో చాలా రాశారులే. తులసీదళం తమరిదే కదా గురువు గారూ’ అంటూ ఉంటే ఆ సమావేశ గదిలో ఉన్న శ్రీరమణ గారు ఆ ఉదంతాన్ని చెప్పాలి.. మనం వినాలి.

తానా సభలు ఎంత ఘనంగా జరిగినా అక్కడ జరిగే సాహితీ సమావేశాలకు తగు హడావిడి వల్ల పదీ పదిహేను మందికి మించి రారని ఆ రోజుల్లో మాకు తెలుసు. ఒక రచయిత్రి ఆ సంవత్సరం గెస్టుగా పాల్గొని రిపోర్ట్‌ రాసి ఆంధ్రజ్యోతికి పంపింది. నేను చదివి ‘నూటయాభై మంది వరకూ పాల్గొన్న ఈ విశేష సమావేశంలో అని రాశారీమె శ్రీరమణ గారూ’ అన్నాను. వెంటనే ఆయన ‘నిజమే అయి ఉంటుందిలేండి. ఈమె ఒక్కతి వందమందికి పెట్టు గదా. తక్కినవాళ్లు యాభై ఉంటారు’ అన్నారు.

శ్రీరమణ అనే మనిషిని నేను చూడక ముందు శ్రీరమణ అనే పేరును చెవిన మోత మోగించినవాడు నామిని. ‘గొప్ప వాక్యం ఉన్నవాడయ్యా’ అనేవాడు. నామిని ఆంధ్రజ్యోతికి ఎడిటర్‌ అయినప్పుడు శ్రీరమణ ఆంధ్రప్రభ వీక్లీలో ఉండేవారు. అక్కడ శ్రీకాంత శర్మగారు రిటైరయ్యి వల్లూరి రాఘవ ఎడిటర్‌ అయ్యాక శ్రీరమణ మానేసే ముందు మొదటిసారి ఆయన్ను ఆంధ్రప్రభ ఆఫీసులో చూశాను. ఆ తర్వాత ముళ్లపూడి వెంకటరమణ గారు హైదరాబాద్‌ వచ్చారని తెలిసి గెస్ట్‌హౌస్‌కు నామినితో వెళితే అక్కడా కనిపించారు.

శ్రీరమణ ప్రయివేటు వ్యక్తి. ఆయనే రాసినట్టు ‘దొరికేవాడు ల్యాండ్‌లైనుకు కూడా దొరుకుతాడు. దొరకనివాడు సెల్‌ఫోన్‌కు కూడా దొరకడు’ అన్నట్టు తాను కలవాలనుకున్నవారిని, తన దగ్గరకు వచ్చి కలవాలనుకున్నవారిని మాత్రమే కలిసేవారు. ఆంధ్రజ్యోతి మూతపడి నేను నీహార్‌ ఆనలైన్‌లో పని చేస్తున్నప్పుడు మా ఆఫీసుకు వచ్చేవారు. ‘సరసం డాట్‌ కామ్‌’కు శ్రీరమణ రాత, మోహన్‌ గీత. వసంత లక్ష్మి గారు ఎడిటర్‌గా అనుసంధానకర్త. ఎంతో మనోఉల్లాస, రసరమ్య కంటెంట్‌ అది. కప్పగంతుల సత్యనారాయణ గారి ‘తెల్లవారుజాము పాఠాలు’ కథ ఆ సందర్భంలో శ్రీరమణ చెప్పగా వినడం ఒక ముసిముసి మందారం.

ఆంధ్రజ్యోతి తిరిగి ప్రారంభమైనప్పుడు సండే మేగజీన్‌కు డమ్మీ వేస్తూ నేను సెంటర్‌స్ప్రెడ్‌ రెండు పేజీలూ శ్రీరమణ గారివైతే బాగుంటుంది అన్నాను వసంతలక్ష్మి గారితో. వసంత గారు ఎడిటర్‌ కె.రామచంద్రమూర్తి గారితో ఆ సంగతి చెప్పి ‘అడిగి రాయిద్దాం’ అన్నారు. అడగడానికి ఇద్దరూ శ్రీరమణ ఇంటికి వెళ్లారు. అప్పటికే శ్రీరమణ మనసులో తన మాతృసంస్థలో మళ్లీ పని చేయాలని ఉన్నట్టుంది. మాటలు అక్కడి వరకూ చేరి ఆయన ఆంధ్రజ్యోతిలో అడుగుపెట్టారు. మేము కొలీగ్స్‌ అయ్యాం. ఆ తర్వాత ఆయన ‘నవ్య’ ఎడిటర్‌ అయ్యారు.

శ్రీరమణ గారు నండూరి గారి డిస్కవరీ. తెనాలి నుంచి టీనేజీ వయసులో ఏవో రాతలు రాసి పంపితే ఆ పదును చూసి ఆంధ్రజ్యోతిలో తెచ్చి పెట్టారాయన. అక్కడ రాస్తుండగా ముళ్లపూడి, బాపుగార్లు గమనించి మద్రాసు పట్టుకుపోయారు. చాలా ఏళ్లు అక్కడే ఉండిపోయారు. సినిమాలు ఏ మేలు చేశాయోగాని సాహిత్యానికి మాత్రం ఆయన చేయవలసినంతగా చేయలేదు. ‘ఒక సిట్టింగ్‌లో కూచుంటే మనం రాయాలనుకున్న కథలు నాలుగైదు ఆ సినిమా కథ కోసం ఖర్చయిపోతాయండీ’ అన్నారు నాతో ఒకసారి. బహుశా అందుకని శ్రీ రమణ రాయవలసినన్ని కథలు రాయలేదు.

‘పరోపకారం ఇదం సాహిత్యం’ అని విశ్వసించనివారు శ్రీరమణ. రసాస్వాదన సాహిత్యం ప్రథమ లక్షణం అని భావిస్తారు. ఆర్ట్‌ సినిమాల పిచ్చి ఒక దశలో ఇంటెలెక్చువల్స్‌కు పట్టినట్టే మాండలికం పిచ్చి రచయితలకు పట్టిందని అనేవారు. ‘చెంగయ్య నోట్లో బీడీ తీసి తుపుక్కున ఊశాడు… అని ఇంకా ఎన్నిసార్లు రాస్తారండీ’ అని నాతో ఒకసారి దబాయించారు. మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీపాద ఇష్టరచయితలు. సత్యం శంకరమంచి రాసిన ‘ఒక రోజెళ్లిపోయింది’ కథ, శ్రీపాద రాసిన ‘షట్కర్మయుక్త’ కథలు శ్రీ రమణ ‘మిథునం’ రాయడానికి ఇన్‌స్పయిర్‌ చేసి ఉంటాయని ‘కథలు ఇలా కూడా రాస్తారు’ పుస్తకంలో రాశాను. ఆయనేం అన్లేదు.
శ్రీరమణ

‘బంగారు మురుగు’, ‘పెళ్లి’, ‘వరహాల బావి’, ‘షోడా నాయుడు’, ‘మిథునం’… అన్నీ మానవ ప్రవర్తనల బలాలు, బలహీనతలు… వాటిని వాసాలుగా చేసుకుని కట్టుకున్న తెలుగు జీవన గృహాలు… ఇవీ శ్రీరమణ చూపినవి. అయితే ‘సిస్టమ్‌’లో ఉంటూనే స్త్రీ ఏమేరకు స్వావలంబన సాధించగలదో ‘ధనలక్ష్మి’ కథలో చూపించారు. ఆయన ఇవ్వదగిన అనుమతి, ఉపదేశం అంత వరకే. కాని తాను ఆశించిన సంస్కరణ అంతా వెక్కిరింతలో చూపేవారు. సరి చేయాలనుకునేవాడే వెక్కిరిస్తాడు.

శ్రీరమణతో ఎన్నో కబుర్లు, మాటల యాలకలు. తెలుగు కథకుల్లో ఆయన వలే ఎత్తు పలువరుస, మంచి వాక్యం కలిగి ఉన్నది నేనేనని, ఆ మేరకు మా ఇద్దరికీ పోలిక ఉందని నా ఆత్మవిశ్వాసం. శ్రీరమణ నుడి, స్వాదిష్టం తెలిసిన రచయిత. one of the few best storytellers. ఆయన రాసిన అక్షరాలు ఎందరో పాఠకుల నోళ్లు పండించాయి. తెలుగు కథ ధరించిన బంగారు మురుగు– శ్రీరమణ… – జూలై 19, 2023…(ఫొటో: కేశవరెడ్డి గారు, నేను, శ్రీరమణ గారు, మోహన్‌ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు)

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions