అసలు ఆ సీరియల్ ఎలా చూడబుద్దయింది నీకు, ఛల్, రిమోట్ ఇవ్వు అని కసిరింది ఇంటావిడ… నిజమే కదా… ఆ చెత్తన్నర సీరియల్ లేడీస్‌కే చిరాకు పుట్టిస్తోంది, మగపురుష్ కు ఎలా నచ్చుతుంది..? నచ్చదు, కానీ టీవీ సీరియళ్లు ఎలా ఉండకూడదో చెప్పడానికి అదొక ఉదాహరణ కదా… చూడకపోతే ఎలా..? ఏదో ఒకటి రాయాలి కదా, దరిద్రమైన సీరియళ్ల పోకడ గురించి…
అవునవును, అంతేలే… ఏక్‌సేఏక్ వెబ్ సీరీస్ వస్తున్న ఈ కాలంలో ఇంకా ఆ దిక్కుమాలిన సీరియళ్లు మాత్రం మారడం లేదు అని చెప్పడానికి త్రినయని ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… అంటే, చాలా సీరియళ్లు అలాంటివే, కాకపోతే ఇది మంచి ఎగ్జాంపుల్… పైగా ది గ్రేట్ నాగార్జున ప్రాపర్టీ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ… ఏదో దిక్కుమాలిన బెంగాలీ సీరియల్‌కు తలకుమాసిన రీమేక్ ఇది…
మంత్రాలు, తంత్రాలు, పాములు, ఆత్మలు, సంభాషణలు, మన్నూమశానం… నిజానికి విఠలాచార్య బతికి ఉంటే, ఈ సీరియల్ చూసి, ఛిఛీ, నేను తీసిన సినిమాలు ఓ లెక్కా అని సిగ్గుపడేవాడు… తాజాగా ఓ ఎపిసోడ్… అసలు ఎపిసోడ్లన్నీ ఏదో సినిమా నుంచో కాపీ అన్నట్టుగానే ఉంది… ఏదో పేరుతెలియని వైరస్ ఆశించిన బుర్రల క్రియేషన్…
Ads
భైరవద్వీపం సినిమా యాదికి ఉంది కదా… అందులో ఓ మాంత్రికుడు మంత్రాలు చదువుతుంటే… ఎక్కడో రాజకోటలో మంచం మీద పడుకుని ఉన్న రాజకుమారి రోజాకుమారి మంచంతోపాటు మాంత్రికుడి గుహ వైపు పోతుంటుంది… హీరో కదా, బాలయ్య మంచాన్ని అమాంతం పట్టుకుని తను కూడా గుహలోకి వెళ్లిపోతాడు… ఇక మంత్రాలు, బలి ప్రయత్నాలు సరేసరి…
అచ్చం దాన్ని దింపేశాడు త్రినయని దిగ్దర్శకుడు ఎవరో గానీ… సినిమాల్లోకి వెళ్తే రాజమౌళిని మించిపోతాడు, కనీసం త్రివిక్రమ శ్రీనివాస్‌నైనా..! ఓ పాప పడుకున్న మంచానికి విలన్లు విభూతి పూస్తారు, ఓ మాంత్రికురాలి సాయం, ఆ మంచం ఎగిరిపోతూ ఉంటుంది, హీరోయిన్ దానిపైకి దూకుతుంది… అచ్చం ఆ సినిమాల్లోలాగే ఓ గుహలోకి వెళ్తుంది… అక్కడ ఓ మాంత్రికుడు… సరే, సరే, ఆ కథలోకి వెళ్లడం లేదులే…
ఇంకెన్నాళ్లురా భయ్, ఈ చెత్తా ప్రజెంటేషన్లు… కాపీలు… పోనీ అదైనా సరిగ్గా చేస్తారా అంటే అదీ చేతకాదు… ఓ సీన్, పాత్రలన్నీ వరుసగా అక్కడికి ఫుల్లు మేకప్పుతో వచ్చి లైన్ కడతాయి… కెమెరాలో అందరూ పడాలి కదా, పద్ధతిగా ఒకరి పక్కన ఒకరు నిలబడతారు… ఏదో పిచ్చి డైలాగు… అక్కడున్న పదీ పదిహేను మంది మొహాలతో ఫ్రీజ్ షాట్లు… నడుమ నడుమ యాడ్స్… జీతెలుగు క్రియేటివ్ టీం ఇంకా ఆ పాత విఠలాచార్య కాలంలోనే ఉన్నట్టుంది… ఫాఫం, నాగార్జున…! తనదే సమర్పణ ఇది..! మారండిర భయ్, సగటు మనిషికి అందుబాటులోని ఏకైక వినోదం టీవీ… దాన్నీ భ్రష్టుపట్టించకండి…!!
Share this Article