.
( రమణ కొంటికర్ల ) .. …. మంచి సమయం రాకపోతుందా అని వేచిచూడకు.. సమయాన్ని నీకనుకూలంగా మల్చుకో. తద్వారా అవకాశాలు సృష్టించుకో. వచ్చిన అవకాశాలతో మరిన్ని మెరుగైన అవకాశాలను సృష్టించుకో. జీవితంలో దాన్నో నిరంతర ప్రక్రియగా మార్చుకొమ్మంటూ దివంగత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పన మాటలు ఆ బాలికను వెంటాడాయి.
కట్ చేస్తే ఇప్పుడామె ఐఏఎస్ ను కాదనుకున్న ఐపీఎస్. అంతా ఐఏఎస్ కావాలనుకుంటే.. ఆమె మాత్రం ఐపీఎస్ వైపుకెందుకు మొగ్గింది..? అబ్దుల్ కలాం తన దస్తూరీతో రాసిన లేఖ ఓ బాలికను ఉన్నత చదువులవైపు అడుగులేసేలా చేసింది.
Ads
ఆమే తృప్తి భట్. ప్రస్తుతం డెహ్రాడూన్ లో ఇంటలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. విధానపరమైన నిర్ణయాలు వేగవంతంగా తీసుకోవడంలోనూ, నిర్భయంగా ముందడుగు వేయడంలోనూ తృప్తి భట్ ప్రత్యేక పేరు సంపాదించుకుంది. భద్రతతో పాటు, ప్రకృతి వైపరీత్యాల విషయంలో ఆమె చూపిన చొరవ ప్రశంసలందుకుంది.
9వ తరగతిలో ఏపీజే అబ్దుల్ కలాం రాసిన లేఖతో ప్రేరణ పొందిన తృప్తి భట్.. దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతోనే తన చదువులు కొనసాగించింది. అప్పుడే ఆమెకు నేరుగా కూడా కలాంను కలిసే అవకాశం లభించింది. తృప్తి భట్ ది ఉపాధ్యాయుల కుటుంబం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తర్వాత చదువులతల్లి తృప్తి భట్ కు ఇస్రో నుంచి కూడా అవకాశం లభించింది. కానీ, ఉన్నత చదువు సివిల్ సర్వీసెస్ కోసం ఆ అవకాశాన్ని వదిలేసింది.
ఆ తర్వాత కలాం మాటల స్ఫూర్తితో ఎన్టీపీసీలో వచ్చిన ఉద్యోగంలో జాయినైంది. అసిస్టెంట్ మేనేజర్ స్థాయికెదిగింది. కానీ, ఏదో వెలితి. దాంతో సివిల్ సర్వీసెస్ పై పట్టుదలతో ప్రయత్నించింది. అదే సమయంలో మరో 16 ఉద్యోగాలు ఆమెను వరించాయి. కానీ, అవేవీ ఆమెను సంతృప్తి పర్చలేకపోయాయి. దాంతో యూపీఎస్సీపై ఫోకస్ చేసింది.
2013లో తొలి ప్రయత్నంలోనే తృప్తి భట్ ఆల్ ఇండియా 165వ ర్యాంక్ సాధించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)కే అర్హత సాధించినప్పటికీ… ఆమె ఐపీఎస్ వైపే మొగ్గు చూపింది. పైగా పోలీస్ డ్రెస్ లో తీసుకొచ్చే మార్పుపై కలలుగన్న తనకు.. ఐపీఎస్ అధికారిగా వాటిని సాకారం చేసే అవకాశముంటుందని నమ్మి.. సవాళ్లను స్వీకరిస్తూ ఐపీఎస్ గా అవతరించింది.
సాధారణంగా ఐపీఎస్ కు సెలక్టైనవాళ్లు.. తిరిగి ఐఏఎస్ కావాలనే పట్టుదలతో ప్రయత్నించి సక్సెస్ అయినవారెందరి సక్సెస్ స్టోరీస్ నో చూస్తుంటాం. కానీ, అందుకు పూర్తి భిన్నమైంది తృప్తి భట్ కథ.
అయితే, తృప్తి చదువుల తల్లే కాదు.. వృత్తిపరంగా అదే స్థాయి పనితీరుతో మెప్పిస్తోంది. మారథాన్ రన్నర్ గా బంగారు పతకం సాధించిన తృప్తి, స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్. టైక్వాండో, కరాటేలో నిపుణురాలు. క్రమశిక్షణ, స్థితప్రజ్ఞత తృప్తిభట్ ప్రత్యేకతలు. అందుకే, ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తూనే.. మరోవైపు వృత్తిపరంగా క్రమశిక్షణ కల్గిన అధికారిగా కూడా తన చదువు, హోదాకు తగ్గట్టు పేరు తెచ్చుకుంది.
Share this Article