మన ప్రేక్షకులంటే మన దర్శకులకు మరీ చిన్నచూపు… మేమే సర్వజ్ఞులం, మేమేం చెబితే అదే వేదం, ఎడ్డి ప్రేక్షకులకేం తెలుసు అనుకుంటారు… దీనికి తగ్గట్టు మాటల మాంత్రికుడు గట్రా బిరుదులతో మీడియా, తోటి ఇండస్ట్రీ పర్సనాలిటీలు భుజకీర్తులు తొడిగేసరికి… ఏమో, నిజమేనేమో, మేం మహాతోపులమే కావచ్చు సుమా, లేకపోతే ఇంతమంది ఎలా భజిస్తారు అని మరింతగా కిక్కెత్తిపోతుంది… త్రివిక్రమ్ శ్రీనివాస్ బీమ్లానాయక్ సినిమాలో ‘‘గజినీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు, వాడి మీద నెగ్గినవాడి పేరు ఎవరికీ గుర్తు లేదు, ఓడిపోయిన వీడి పేరే ఎందుకు గుర్తుందో తెలుసా, వీడికి యుద్ధం అంటే భయం లేదు కాబట్టి…” అని ఏదో డైలాగ్ రాశాడు… దీని మీద మిత్రుడు Jagannadh Goud త్రివిక్రముడికి చరిత్ర ఇలా చెబుతున్నాడు…
నీకు కావాల్సింది తెలుగు డిక్షనరీ “శబ్ధ రత్నాకరం” కాదురా అయ్యా.., 7 వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకం. ఏమంటివి, ఏమంటివి… “గజినీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు, వాడి మీద నెగ్గినవాడి పేరు ఎవరికీ గుర్తు లేదు, ఓడిపోయిన వీడి పేరే ఎందుకు గుర్తుందో తెలుసా వీడికి యుద్ధం అంటే భయం లేదు కాబట్టి”… ఇవే కదా…
ఇదేం మూర్ఖత్వం..? ఇదేం పిచ్చి..? గజినీ మహమ్మద్ ప్రస్తుత అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ తురుష్కరాజు… అప్ఘనిస్థాన్‌కు భారత్‌కు నడుమ ఇప్పటి పాకిస్థాన్ ఉంటుంది… ఆ ప్రాంతాన్ని అప్పట్లో, ఆనాటి భారత్‌లో… హిందూ షాహీలు పాలించేవారు, రాజా జయపాలకుడు పరిపాలిస్తూ ఉండేవాడు… అప్పట్లో అంతా అఖండ భారతమే…
Ads
పాకిస్థానీ ప్రాంతాన్ని జయించకుండా ప్రస్తుత ఇండియాలోకి అడుగుపెట్టే చాన్సే లేదు… నిజానికి గజినీ ప్రధాన సమస్య ఆగ్నేయ ఆసియాలో ముస్లిం రాజులు… వారిని ఎదిరించాలంటే డబ్బు కావాలి, సైన్యం కావాలి, అందుకే భారత్ మీద కన్నుపడింది… మొదట పాకిస్థాన్ ప్రాంతం మీద దాడి చేసి, జయపాలకుడిని ఓడించి, హిందూషాహిల రాజ్యాన్ని తన సామంతరాజ్యం చేసుకున్నాడు… ఆ తరువాతే 16 సార్లు భారత్ మీద పడ్డాడు… దేనికి..? డబ్బు కోసం, బంగారం కోసం…
గజినీ తండ్రి ఇస్మాయిల్… ఇద్దరు పిల్లలు… గజినీ పెద్దవాడు… యుద్ధతంత్రం లేదు, ఏమీ లేదు, రూల్స్ ఉండవు పాలన సామర్థ్యం లేదు, గజినీ తత్వం గ్రహించిన తండ్రి చిన్నవాడిని తన వారసుడిగా ప్రకటించి, రాజును చేసి చచ్చిపోతాడు… కోపంతో గజినీ నిద్రపోతున్న తన తమ్ముడిని పొడిచి చంపి, తను రాజుగా ప్రకటించుకుంటాడు… ఎక్కడ పక్కనున్న ముస్లింరాజులు దండయాత్రలు చేస్తారేమోననే భయం… అందుకే తన చూపు భారత్ మీద పడింది…
మొదట జయపాలకుడిని ఓడించి, తరువాత 16సార్లు భారత్ మీదకు వచ్చాడు… ప్రతిసారీ మెరుపు దాడులు చేయడం, అందినకాడికి దోచుకుపోవడం… ఎప్పుడూ స్థిరంగా నిలబడి యుద్ధం చేసింది లేదు… అందుకే తండ్రి తనను వారసుడిగా ప్రకటించలేదు… తన మొదటి దండయాత్ర 1001లో… అదే పెషావర్ యుద్ధం… మిగతావన్నీ దారిదోపిడీ దొంగతనాల దాడులే…
అయ్యా…. త్రివిక్రం గారూ… వాడి పేరు ఎందుకు గుర్తు ఉంది అంటే వాడొక సైకో, అంతేగానీ పోరాట యోధుడు కాదు. తమరు అన్నట్లు 17 సార్లు ఓడిపోలేదు…; మొదటిసారి పెషావర్ యుద్ధంలో గెలిచాడు… మిగతా 16 సార్లు వాడు భారత్ పై చేసింది దారి దోపిడీ దాడులే కానీ, యుద్ధం కాదు… మీ ఊరి గ్రంథాలయంలోకి వెళ్ళి, 7 వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకం కానీ, ఏదైనా చరిత్ర పుస్తకం కానీ – అదీ దిక్కు లేకపోతే గూగుల్ లో గజినీ మహమ్మద్ వికీపీడియా చదువుకో….
Share this Article