టీవీ9 మీద ఏ చిన్న సందు దొరికినా సరే విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది… ప్రేక్షకుల్లో ఈ టీవీ కవరేజీ తీరు పట్ల అసహనం స్పష్టంగానే కనిపిస్తుంది… పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నవాళ్లకే రుధిరం, పోస్కోల భాష తప్ప ఇంకేమీ తెలియదంటే ప్రజల్లో ఈ చులకనభావం ఏర్పడటం సహజమే అనుకుందాం… పైగా స్టోరీ ప్రజెంటేషన్‌లో చిత్రవిచిత్ర ప్రయోగాలు కూడా టీవీ9ను మరింత చులకన చేశాయి… వెరసి నెంబర్‌టూ ప్లేసుకు పడిపోయింది…
ఈరోజు టీవీ9 మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెద్ద ఎత్తున కనిపిస్తోంది… ఎందుకు అంటే..? శ్రీకాకుళం జిల్లాలో వీరంగం వేసిన ఓ ఎలుగుబంటిని ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు కలిసి కష్టమ్మీద బంధించారు… వెంటనే మత్తుమందు ఇచ్చి, జూకు తరలించారు… ఇదీ వార్త… మొత్తం ఎలుగుబంటి ఎపిసోడ్ మీద టీవీ9 కవరేజీలో ‘అతి’ కనిపించింది… దానికి ఆపరేషన్ భల్లూక్ అని పేరుపెట్టి, అసలు ఇంతటి భీకర భల్లూకం కనిపించడమే మొదటిసారి అన్నట్టుగా ఎడాపెడా ఏదేదో రాసేసి, తీసేసి, చూపించేసి హంగామా చేసింది… దాన్నలా వదిలేస్తే…
Ads
దాన్ని బంధించి తీసుకెళ్తున్న వీడియో ఫీడ్ మొదట టీవీ9కే దొరికినట్టుంది… ఆ దృశ్యాలను చూపిస్తూ ఓచోట రిపోర్టర్ మైకును మత్తులో ఉన్న ఎలుగుబంటి మూత దగ్గర పెట్టినట్టు కనిపిస్తోంది… ఈ బిట్ చూపిస్తూ ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది… ‘‘ఇప్పుడు మనం ఎలుగుబంటి అభిప్రాయం తెలుసుకుందాం… ఎలుగుబంటీ ఈ మొత్తం వ్యవహారంపై నీకేమనిపిస్తోంది…’’ ‘‘ఎలుగుబంటీ, నువ్వు మా టీవీ9 వాహనం మీదే దాడికి ప్రయత్నించావు, అసలేమిటి నీ ఉద్దేశం..?’’ ‘‘టీవీ9 వాహనాన్ని వెంబడించి, తరిమావు, అసలు దీని వెనుక ఎవరున్నారు..?’’ ఇలా రిపోర్టర్ ప్రశ్నిస్తున్నట్టుగా బోలెడు చెణుకులు పడుతున్నయ్…
నిజానికి ఈ పర్టిక్యులర్ సీన్‌లో రిపోర్టర్‌ను మరీ అంత భారీ ట్రోలింగ్ చేయాల్సినంత తప్పేమీ కనిపించడం లేదు… ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంది… తనకు ఓ చేతిలో మైకు బాపతు వైర్ ఉంది, మరో చేతిలో మైక్ ఉంది… తరలిస్తున్న ఎలుగుబంటిని మనం ఇక్కడ చూడొచ్చు అంటూ టీవీ రిపోర్టర్ల సహజశైలిలో తను చెబుతూ పోయాడు, ఆ మైక్‌తోనే ఎలుగుబంటి మొహాన్ని చూపిస్తున్నాడు… అంతేతప్ప ఎలుగుబంటి మొహం దగ్గర మైక్ పెట్టి ప్రశ్నలడగడం కాదు… సరే, ట్రోలింగుకు ఏ మీడియా అయినా అతీతం ఏమీ కాదు… కానీ ఇక్కడ మాత్రం అనవసరం..!!
Share this Article