సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో జరిగే ఏ ఎన్నికైనా సరే… ఎజెండా ఫిక్స్ చేసేది కేసీయార్… ఆ ఎజెండా చుట్టే ఎన్నిక తిరుగుతుంది… చివరకు అది కేసీయార్ బుట్టలోకి వచ్చి పడుతుంది… ఆరేళ్లుగా చూస్తున్నది అదే… అంతకుముందు ఎన్నికల్లో కూడా కేసీయార్ తెలంగాణనే ఎజెండాగా నిలబెట్టేవాడు… అయితే మొదటిసారి ఓ విభిన్నచిత్రాన్ని చూస్తున్నది తెలంగాణ… గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఓ ట్రాప్‌లోకి టీఆర్ఎస్ను లాగుతోంది… విశేషమేమిటంటే టీఆర్ఎస్ కూడా బీజేపీ లాగుతున్న వైపే వెళ్తోంది… బీజేపీ మతం చుట్టూ ఈ గ్రేటర్ ఎన్నికల్ని తిప్పాలని, సెంటిమెంటే అస్త్రంగా కథ నడిపించాలని భావిస్తోంది… టీఆర్ఎస్ కూడా బీజేపీ సెట్ చేస్తున్న మతం ఎజెండా చుట్టే గిరికీలు కొడుతోంది…
హైదరాబాదులో ముస్లిం వోట్లు ఎక్కువ… మజ్లిస్ పార్టీకి ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో తిరుగులేదు… కాస్తోకూస్తో పోటీ ఇవ్వగలదు అనుకుంటే అది బీజేపీయే… కాంగ్రెస్, టీఆర్ఎస్ నామ్కేవాస్తే పోటీ మాత్రమే ఇస్తాయి కొన్ని ప్రాంతాల్లో… మంత్రి తలసాని వంటి నేతలు కూడా మేం 104 గెలుస్తాం అని గంభీరంగా చెబుతుంటాడు… మిగతావి మజ్లిస్‌కే అని పరోక్షంగా చెప్పడం… అది నష్టదాయకమే… గతంలో లోకసభ ఎన్నికల్లో కూడా ‘కారు, సారు, సర్కారు, పదహారు’ అని చెప్పుకున్నది, ఒకటి మజ్లిస్‌కే కేటాయించాం అన్నట్టుగా… పొత్తులో భాగంగా ఏవో సీట్లు పంచుకున్నట్టుగా…
Ads
హిందూ వోట్లకు మేమే ఛాంపియన్లం అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తూ ఉంటుంది… గ్రేటర్లో మతం ఎలాగూ ఓ ప్రధాన ఎన్నికల అంశమే కాబట్టి ఈసారి మతం చుట్టే ఈ ఎన్నికల్ని తిప్పాలని బీజేపీ ప్లాన్… మజ్లిస్‌దే పెత్తనం, ఒవైసీ చెప్పినట్టే పాలన సాగుతుంది, కేసీయార్ ముస్లిం పక్షపాతి అన్నట్టుగా బీజేపీ ప్రచారం సాగుతూ ఉంటుంది… ఇష్యూ ఏదయినా సరే బీజేపీ మళ్లీ మతం దగ్గరకు తీసుకుపోతోంది దాన్ని… ఓ ఎత్తుగడ…
బీజేపీ ఆలోచన ఏమిటంటే… మతం వైపు ఎన్నికల్ని లాగేకొద్దీ… టీఆర్ఎస్ ఎన్ని కౌంటర్లు ఇస్తున్నా సరే, మతం అనేదే చర్చనీయాంశంగా ఉంటుంది… ఒక అంశంపై పాజిటివ్ గానీ, నెగెటివ్ గానీ పదే పదే ప్రచారం సాగుతూ ఉంటే… వోటర్లు మెదళ్లలో రిజిష్టర్ అయిపోతూ ఉంటుంది… అందుకని టీఆర్ఎస్ క్యాంపు చాకచక్యంగా మతం నుంచి ఎన్నికల్ని డైవర్ట్ చేయడానికి… వరదసాయం పంపిణీకి బీజేపీ అడ్డుపడుతోందనీ, బాధితులకు ద్రోహం చేస్తోందనీ ప్రచారం స్టార్ట్ చేసింది… ఓ ఫేక్ లెటర్ తెరపైకి వచ్చింది… ఎన్నికల కమిషనర్ స్వయంగా అలాంటి లేఖ ఏదీ లేదని చెబుతున్నా సరే, ఈ ప్రచారం ఆగడం లేదు…
దీంతో బండి సంజయ్ దీన్ని కూడా అటూఇటూ తిప్పి మతం దగ్గరకు తీసుకెళ్లాడు… చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం, దీక్ష ప్లాన్ చేశాడు… కావాలనే టెన్షన్ క్రియేట్ చేయడం, సిటీలో చర్చకు తెరతీయడం ఆ ఆలోచన… ‘‘భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు రావడం నీకు ఇష్టం లేదు, కానీ కనీసం మక్కా మసీదుకైనా వస్తావని అనుకున్నా’’ అంటూ వెటకారాన్ని దట్టించి సంజయ్ మాట్లాడుతున్నాడు… అంటే నీకు ముస్లింలు తప్ప హిందువులు పట్టరు అని ఆక్షేపించడం… గతంలో హిందుగాళ్లు బొందుగాళ్లు అని కేసీయార్ చేసిన వ్యాఖ్యను కూడా సంజయ్ తన ఎన్నికలో విస్తృతంగా వాడుకున్నాడు… సో, ఇష్యూ ఎటో మళ్లుతోందని గమనించిన కేటీయార్ దీని తీవ్రత తగ్గించటానికి మజ్లిస్‌తో మాకేమీ పొత్తు లేదు అని ప్రకటించాడు… మతకల్లోలాలకు ప్రయత్నిస్తే బాగుండదు అని హెచ్చరించాడు… ఈలోపు ఇదుగో కేకే వంటి నేతలు ఇలాంటి అనవసర ప్రకటనలకు దిగారు…
కేసీయార్‌ను మించిన హిందువు లేరు… ఆయన చేసినన్ని పూజలు, యాగాలు ఎవరూ చేయలేదు అంటూ సెల్ఫ్ సర్టిఫికెట్ అవసరమా ఇప్పుడు..? సరిగ్గా బీజేపీ కోరుకుంటున్నదీ ఇదే… టీఆర్ఎస్ ఆ ట్రాపులోకి నడుస్తున్నదీ ఇలాగే… హిందుత్వ, మతం, మైనారిటీలు అనే అంశం చుట్టే ఎన్నిక తిరగాలని అది కోరుకుంటుంటే, టీఆర్ఎస్ కూడా అటే నడుస్తోంది… వెరసి చర్చ మొత్తం ఈ అంశాల చుట్టే కేంద్రీకృతం అవుతోంది… టీఆర్ఎస్ 24 గంటల కోతల్లేని కరెంటు, పుష్కలంగా తాగునీరు, స్థిరంగా శాంతిభద్రతలు వంటి ప్రభుత్వ సానుకూల, ప్రజాసౌకర్యాల అంశాల వైపు ఈ చర్చను మళ్లించలేకపోతోంది… ఆ చర్చ జరిగితే తనకే నయం… కానీ జరగనిది అదే… బీజేపీ కోరుకునేదీ అదే… టీఆర్ఎస్ చేస్తున్నదీ అదే… ప్రచారం మరో ఏడెనిమిది రోజులే… ఇప్పుడైనా టీఆర్ఎస్ ప్రచారాంశాలు మారితే తనకు మేలు… లేదంటే బీజేపీకి చేజేతులా సాయం చేస్తున్నట్టే…!
చివరగా :: ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏ అంశాల్ని ప్రచారం చేసుకోవాలో తెలియని అయోమయంలో చిక్కుపడిపోయింది…
Share this Article