Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అర శతాబ్దంపాటు అదే చోట, అదే పార్టీ నుంచి… వరుసగా 12 సార్లు ఎన్నిక…

July 18, 2023 by M S R

Siva Racharla…..   Mass Contact… ప్రజలతో సన్నిహితంగా ఉంటే అనేక సమస్యలను సులభముగా పరిష్కరించవచ్చు అంటారు ఆయన. ప్రజాస్వామ్యానికి కావలసింది సైన్యం, ఆయుధాలు కాదు ప్రజల విశ్వాసం అని నమ్మిన, ఆచరించిన నాయకుడు ఊమెన్ చాందీ . వర్తమాన రాజకీయాల్లో విశ్లేషణకు సరిపడా సరుకు ఉండటం లేదు. సిద్ధాంతం వదిలేసినా తలలు తీసుకుంటాం అన్న మూడు నెలలకే మరో పార్టీలో చేరి పాత పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. జీవితం మొత్తం ఒకే పార్టీలో ఉంటే రాబోయే రోజుల్లో గిన్నీస్ రికార్డ్ కూడా ఇస్తారేమో!

కేరళ మాజీ సీఎం, 79 సంవత్సరాల ఊమెన్ చాందీ ఈ ఉదయం అనారోగ్యంతో చనిపోయారు. దేశంలో ఒకే నియోజకవర్గం నుంచి , ఒకే పార్టీ నుంచి ఓటమి అనేది లేకుండా వరుసగా పన్నెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నేత ఊమెన్ చాందీ. పూతుపల్లి నియోజకవర్గం నుంచి ఊమెన్ చాందీ 1970 నుంచి 2021లో జరిగిన ఎన్నికల వరకు కాంగ్రెస్ తరుపున 12 సార్లు వరుసగా ఎమ్మెల్యే గా గెలిచారు.
గతంలో పత్రికల్లో జాతీయ రాజకీయాల మీద మంచి కవరేజి ఉండేది. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు , ఇతర సీనియర్ నేతల గురించి తెలుసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పత్రికల్లో / ఛానల్స్ లో స్పేస్ అంతా సామాజిక విలువ లేని అనవసర వ్యర్ధాల మీదనే. ఇప్పుడు పక్కరాష్ట్రాల సీఎంల పేర్లు తెలియటం కూడా అరుదే!
నాకు రాజకీయ ఊహ వచ్చిన తొలి రోజుల్లో అంటే నేను ఏడో తరగతి (1989) నుంచే కేరళ రాజకీయాల మీద ఆసక్తి ఉండేది. పొట్టిగా ఉండే (గట్టివాడని ) కరుణాకరణ్ ఢిల్లీకి వెళుతున్నాడంటే పెద్ద సంచలనం అయ్యేది. కరుణాకరణ్ ఢిల్లీకి వెళ్లిన రెండు రోజులకో మూడు రోజులకో ఆంటోనికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చేది.. ఏమవుతుందన్న ఉత్సుకత ఉండేది.
పారీలు ఏవైనా కామరాజ్ నాడార్, దేవరాజ్ అర్స్ , సంజీవరెడ్డి (సీఎం పదవి కోసం ఎన్ని రాజ్జకీయాలు చేసినా సరే ), ఆంటోని , ఊమెన్ చాందీ లాంటి వారు నిజమైన స్టేట్స్ మెన్ . వాళ్ళు వేసిన బీజాలు ఆయా రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగ పడ్డాయి. 2004 జనరల్ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా గెలవలేదు. కమ్యూనిస్ట్ కూటమి 18కి 18 స్థానాలు గెలిచింది. సీఎంగా ఉన్న ఆంటోనీని నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయమని అధిష్టానం అడిగింది. ఆంటోని ఎలాంటి తిరుగుబాటు లేకుండా పదవి నుంచి తప్పుకున్నారు.
కాంగ్రెస్‌లో సీఎం మార్పు అంటే కొత్త చీలిక పార్టీ పుట్టినట్లే లెక్క. కానీ 2004 లో మాత్రం సోనియా గాంధీ కరుణాకరణ్ మరియు ఆంటోనీ వర్గాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజానేత అయిన ఊమెన్ చాందీని సీఎం చేశారు. వర్గ రాజకీయాలను ,పెద్ద నేతల ఒత్తిళ్లను పట్టించుకోకుండా కొత్త నేతలకు సీఎం అవకాశం ఇవ్వటం కాంగ్రెస్‌లో ఊమెన్ చాందీతోనే మొదలయ్యింది చెప్పొచ్చు.
కేరళ రాష్ట్రానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండుసార్లు మాత్రమే అధికారపక్షం గెలిచింది… 2006 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది కానీ ఊమెన్ చాందీ నాయకత్వంలో 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 16 సీట్లు గెలిచింది. 2011లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఊమెన్ చాందీ మరోసారి సీఎం అయ్యారు.
సీఎం హోదాలో తన ఆఫీసులో సీసీ కెమెరా పెట్టించిన ధీశాలి ఊమెన్ చాందీ. Mass Contact పేరుతో ప్రతి రోజు ప్రజాదర్భార్ నిర్వహించేవారు. జిల్లా కేంద్రాలలో కూడా ప్రజాదర్భార్ నిర్వహించారు. ప్రజల సమస్యలను స్వయంగా రాసుకునేవారు. సెక్యూరిటీ ఇబ్బందులు లేకుండా ప్రజలు సీఎం చుట్టూ గుమికూడేవారు.
ఊమెన్ చాందీ మీద వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేకున్నా ఆయన ప్రభుత్వం మీద సోలార్, ఆయిల్ స్కామ్ ఆరోపణలు ఉన్నాయి. ఊమెన్ చాందీ అవినీతిపరుడు అని విపక్ష కమ్యూనిస్టులు కూడా ఆరోపించరు . కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులే మార్చి మార్చి అధికారంలో ఉన్నా సమాజంలో కమ్యూనిజం లక్షణాలు ఒకమేర ఉంటాయి. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన నారాయణ్ గురు ప్రభావము మతాలకు అతీతంగా ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీలో నీతిపరులు ఒకరైనా ఉన్నారా అని రాజీవ్ గాంధీని మీడియా అడిగినప్పుడు , ఎందుకు లేరు ఆంటోని , కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు అని సమాధానం చెప్పారు. పార్టీలకు అతీతంగా EMS , EK , గౌరియమ్మ, ఆంటోని లాంటి వాళ్ళు గౌరవం పొందటంలో వారి వ్యక్తిగత విధానం ఒక కారణం అయితే కేరళ సమాజ దృష్టి కోణం మరో కారణం. మధ్యం, రోత సినిమాలు లాంటివి చర్చనీయం కాదు. ఊమెన్ చాంది కొడుకు రాహుల్ గాంధీ జోడో యాత్రలో చెప్పులు లేకుండా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచారు. ఊమెన్ చాందీ గారికి నివాళి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions