Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నోబెల్ ఇవ్వకపోతే చచ్చారే… అసలే నేను మహా శాంతికాముకుడిని…

October 3, 2025 by M S R

.

ఏం తమాషాగా ఉందా? నాకుగాక ఎవరికిస్తారు నోబెల్?

నోబెల్ ప్రపంచ శాంతి బహుమతి ఎంపిక కమిటీకి ట్రంప్ రాయునది ఏమనగా…:-

Ads

ఒళ్ళు దగ్గరపెట్టుకుని చదవాల్సిన అత్యవసర విషయాలు:-

రెండో ప్రపంచం యుద్ధం ముందునాటి (1930-45) జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గురించి ఇంకా ఎన్ని తరాలు మాట్లాడుకుంటారు? అదంతా గతం గతః. చరిత్రపుటల్లో ఎప్పుడో పాతబడిపోయింది. భూగోళం మరచిపోయే కొన్ని తరాలు అయ్యింది.

మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఏడుసార్లు ఆపిన ఇప్పటి నా అప్రమేయ, అతులిత, అనితరసాధ్య, అద్వితీయ నిర్యుద్ధ మేధో వైశిష్ట్యాన్ని గుర్తించరా? గుర్తించి వేనోళ్ళ పొగడరా? పొగిడి హీనపక్షం నోబెల్ శాంతి బహుమతులు కనీసం ఆరో, ఏడో ఇవ్వలేరా? ఇచ్చి నామీద స్తోత్రాలు వల్లించలేరా? వల్లించి పరవశ బాణీలు కట్టి పాటలు పాడలేరా?

# అర్జెంట్ గా నాకు నోబెల్ ఇవ్వకపోతే… ఆ అవమానం నాకు కాదు. యావత్ నా దేశానికి. దేశం ఊరుకోదు.

# ఇదివరకు ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులనుబట్టి ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఉండేవి. ఇప్పుడు నా సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్టులను బట్టి స్టాక్ మార్కెట్ల ఉత్థాన పతనాలు ఆధారపడి ఉన్నాయి. దీనికైనా నాకు ఇవ్వద్దా ఒక నోబెల్?

# రోజూ వంద, రెండొందల శాతం సుంకాలు వేసి ప్రపంచదేశాలను మునివేళ్ళమీద నిలబెడుతున్నాను. సుంకాలమీద ప్రతిసుంకాల సరికొత్త పరిభాషను ప్రపంచానికి నిత్యవ్యవహారంగా అలవాటు చేశాను. ఇందుకైనా నాకు ఇవ్వరా ఒక నోబెల్?

# నాకు ఎప్పుడు ఎవరు మిత్రులో? ఎప్పుడు ఎవరు శత్రువులో? నాకే తెలియదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద సంతకం చేసి పారేసేవరకు ఏ ఆర్డర్లో ఏముంటుందో నాకే తెలియదు. అందుకైనా నాకు ఇవ్వద్దా ఒక నోబెల్?

# ఎవరూ ఇవ్వని అగ్రరాజ్యం కీర్తి కిరీటం నెత్తినపెట్టుకుని భూగోళంలో ఏదో ఒక మూల ఉగ్రభూతాలకు ఊపిరిలూదే మహోగ్ర కుట్రలకు కేరాఫ్ అడ్రస్ అయినందుకైనా ఇవ్వరా ఒక నోబెల్?

# మా వ్యాపారానికి భూగోళం సమస్తం పెట్టుబడి కావడానికి వీలుగా మా రాజకీయ విధానాలను నిర్ణయిస్తున్నందుకైనా ఇవ్వరా ఒక నోబెల్?

# పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు మాకు సంబంధమే లేని రెండు దేశాలమధ్య తగువులు పెట్టి… తగుదునమ్మా అంటూ ఆ తగువులు తీర్చడానికి బయలుదేరుతున్నందుకైనా ఇవ్వలేరా కనీసం ఒక నోబెల్?

# నేను ఆపిన యుద్ధాలు జరిగాయని ఫర్ సపోజ్ అనుకోండి. అప్పుడు భూమండలం బూడిదయి ఉండేది కదా? ఏడు యుద్ధాలు జరిగి ఉంటే ఏడు సముద్రాలు పొంగి ఉండేవి కదా? ఏడేడు లోకాల్లో అడుగడుగునా హిరోషిమా నాగసాకిలే ఉండేవి కదా? జరగలేదే? ఎవరివల్ల? కేవలం నావల్ల కదా! ఆ విషయం నోరు విడిచి నేనే చెప్పుకోవాలా? మీకు నోరు లేదా? ఉండీ నోళ్ళు పెగలట్లేదా? మీ ఊళ్ళు యుద్ధాలతో వల్లకాళ్ళు కాకుండా ఆపింది నేను కాక ఇంకెవరు? అందుకైనా ఇవ్వరా నోబెల్?

# ఈ సమస్త భూగోళంలో యుద్ధం వద్దని- శాంతి ముద్దని ముప్పూటలా నోరు చించుకుని అరుస్తున్నది నేను ఒక్కడినే కదా! యుద్ధాలకు కాలుదువ్వే ప్రపంచ దేశాధినేతలను వాషింగ్టన్ ఓవెల్ ఆఫీస్ కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చోబెట్టి కాళ్ళు విరగ్గొట్టి చేతుల్లో పెట్టి పంపుతూ… యుద్ధాలను ఆపుతున్నది నేను తప్ప ఇంకెవ్వరు? నాకు తప్ప ఇంకెవరికిస్తారు నోబెల్?

# నయానో, భయానో నాకు నోబెల్ ఇచ్చారో మీరు బతికారే. లేకుంటే చచ్చారే! చేతులు కట్టుకుని వినయంగా వచ్చి నాకు నోబెల్ ఇస్తారా? లేక నాకు నేనే నోబెల్ ప్రకటించుకుని… నాకు నేనే ఇచ్చేసుకుని… నా ఎడమచేతి నుండి నా కుడి చేతితో పుచ్చేసుకుని… నన్ను నేనే సన్మానించుకోనా? ఒక దేశాధ్యక్షుడిగా అదేమన్నా నాకు మర్యాదా? మర్యాదగా నాకు నోబెల్ ఇస్తారా! లేదా! మీకు మీరే త్వరగా తేల్చుకోండి!!

ఇట్లు
మిమ్మల్ను బెదిరించే అగ్ర రాజ్యాధ్యక్షుడు తుంటరి తెంపరి

(ఒక దేశాధ్యక్షుడు తన సొంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ విషయం చదివి ప్రపంచ శాంతి బహుమతి- నోబెల్ నార్వే నుండి నాలుగు కాళ్ళమీద మనోవేగంతో వాషింగ్టన్ బయలుదేరి… మధ్యమధ్యలో భారతీయ ఉపనిషత్ శాంతి మంత్రం “ఓం శాంతిః శాంతిః శాంతిః” అని ముమ్మారు జపిస్తున్నట్లు భోగట్టా!!)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మజ్ను అంటే ఓ పేరు కాదు..! పిచ్చోడు, మూర్ఖుడు అని అర్థం..!!
  • నోబెల్ ఇవ్వకపోతే చచ్చారే… అసలే నేను మహా శాంతికాముకుడిని…
  • 10 లక్షల మంది ఉపాధి… 21 వేల కోట్లు… యూట్యూబ్‌ ఒక వ్యవస్థ..!!
  • పదాలన్నీ పచ్చల పిడిబాకులే… పదప్రయోగంలో సినారె రసికుడైన వగకాడు…
  • కాంతార ప్రీక్వెల్‌కు ఈయన పర్మిషన్ దేనికి..? అదీ దేవుడు చెప్పడమేంటి..?!
  • ఈతరం తప్పక చదవాల్సిన శాస్త్రి డెత్ మిస్టరీ… ఎవరు చంపారు..?!
  • ఎంత మంచివాడవురా…? ఎన్ని నోళ్ల పొగడుదురా..? చెంపపైకి ఓ కన్నీటి చుక్క..!!
  • 75 weds 35 … పెళ్లిరోజు రాత్రే కుప్పకూలాడు… ఏం జరిగి ఉంటుందబ్బా…
  • బాహుబలితో స్టార్ట్… పదేళ్లలో ఏడు సౌత్ సినిమాలదే హవా..!!
  • యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ను బుక్ చేయడమే… ఖాకీ బుక్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions