ఒకప్పుడు టీవీ9 అంటేనే ఓ సెన్సేషన్… వార్తను వేగంగా పట్టుకోవడం, డిఫరెంటుగా ప్రజెంట్ చేయడం… తెలుగు ప్రేక్షకుడు సాహో అన్న కాలమది… తరువాత కాలంలో ఆ వార్తల ప్రజెంటేషన్‌ను గతి తప్పి, పరమ నాసిరకంగా తయారై, అనేక సెక్షన్ల ప్రేక్షకుల్ని దూరం చేసుకుని, అర్ధపాండిత్యపు ప్రజెంటర్లతో… నానాటికీ తీసికట్టు తరహాలో… దిగువకు ప్రయాణించీ, ణించీ… చివరకు తన నంబర్ వన్ స్థానాన్ని ఎన్టీవీకి అప్పగించేసింది…
బార్క్ రేటింగ్స్‌లో ఇప్పుడు ఎన్టీవీ నంబర్ వన్… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ… అలాగని అదేమీ తోపు కాదు… దానికంటూ ఏ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్సూ ఉండవు… మరి నంబర్ వన్ ఎలా అయ్యింది..? అవుతుంది… అదే బార్క్ మహిమ… సరే, ఆ చర్చ జోలికి వెళ్లకుండా… వర్తమాన అవస్థలకు వద్దాం… అసలు ఎన్టీవీ నంబర్ వన్ అనేదే పెద్ద ఫేక్ అని టీవీ9 క్యాంప్ ప్రచారం చేస్తూ ఉంటుంది… టీవీ9 పనైపోయిందోచ్ అని ఎన్టీవీ క్యాంప్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటుంది…
హఠాత్తుగా టీవీ9 బహిరంగ ప్రచారానికి తెరతీసింది… అదేమిటయ్యా అంటే… బ్రాండ్ ప్రమోషన్… మేమే నంబర్ వన్… అసలు దేశంలోనే మేం నంబర్ వన్… మమ్మల్ని కొట్టేవాడు లేడు, పడగొట్టేవాడు లేడు, అసలు టీవీ9 అంటేనే పాన్-ఇండియా చానెల్ అన్నట్టుగా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చుకుంది… ఎందుకు..?
Ads
ఎన్టీవీ వాళ్లు మేమే నంబర్ వన్ అంటూ బార్క్ రేటింగ్స్ చూపిస్తూ మార్కెటింగ్‌లో హడావుడి చేస్తున్నారా..? అందుకే టీవీ9 ఇలా బ్రాండ్ ప్రమోషన్‌కు దిగిందా..? ఎక్కడా ఎన్టీవీ పేరు ఎత్తకుండా… మా రేంజ్ నేషనల్ అనే తరహాలో ఉన్నాయి ఆ ప్రకటనలు… అయితే..?
టీవీ9 తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, బంగ్లా, హిందీ… గ్రూపు చానెళ్లన్నీ కలిసి 25 కోట్లు అట… ఈ నంబర్ దేన్ని సూచిస్తుంది..? కనీసం ప్రకటనలు జారీ చేసేటప్పుడు ఆ క్లారిటీ ఇవ్వాలనే సోయి కూడా లేదు వీళ్లకు… టీవీ9 డిజిటల్ కూడా కలిపి అట…!! పెద్ద పెద్ద జాతీయ తోపులుగా కీర్తించబడే జీ మీడియా, న్యూస్18, టీవీటుడే, రిపబ్లిక్, ఏబీపీలకన్నా మేమే సూపర్ తోపులం అని చెప్పుకుంటోంది… బాగుంది… కానీ..?
‘‘పుట్టింది తెలుగు గడ్డపై, ఏలుతోంది దేశాన్ని’’ అనే స్లోగన్ బాగానే ఉంది… కానీ పుట్టిన తెలుగు గడ్డ మీద మీ స్థానం ఏది అనే ప్రశ్న ప్రేక్షకుడు వేసుకుంటాడని మరిచిపోయారు ఈ ప్రకటనకర్తలు… బంగ్లాలో నువ్వేంటి..? గుజరాత్‌లో నువ్వేంటి..? అనేది తెలుగు ప్రేక్షకుడికి అవసరం లేదు కదా…!! ఐనా… అసలు ఇంత అవసరం దేనికి..? ఈరోజుకూ ఎన్టీవీకన్నా టీవీ9 హైదరాబాద్‌లో స్ట్రాంగ్… నంబర్ వన్… అదొక్కటీ చెప్పుకుంటే చాలదా..? ఎన్టీవీకన్నా డబుల్ రేటింగ్స్… ఐనా, ఎలాగూ యాడ్స్ కోసమే కదా ఈ తాపత్రయం అంతా… బ్రాండ్ ప్రమోషనే కదా టార్గెట్… మరి ఇంత కథ దేనికి..? హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ ఇవీ అని ప్రచారం కుమ్మేస్తే సరిపోదా ఏం..?!
అన్నింటికీ మించి… టీవీ9 నుంచి పంపించేయాల్సింది దాని ఇజ్జత్ తీసే కేరక్టర్లను కదా… ఎక్కడ లోపాలున్నాయనే ఆత్మసమీక్ష కదా… అది విడిచిపెట్టి మేం దేశంలోనే తోపులం, మీడియా గ్రూపుల్లోనే బాపులం… అని ప్రచారం చేసుకుంటే ఫలితం ఏమిటి..? ఈ ఫుల్ పేజీ యాడ్స్ నమస్తే, సాక్షి పత్రికల్లో కనిపించాయి… సో, రేపో మాపో ఎన్టీవీ నుంచి మరో కోణంలో ఇదే రేంజ్ కౌంటర్ యాడ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా చౌదరి గారూ…!! ప్రిస్టేజ్ సార్, ప్రిస్టేజ్…!! ((మరి మిగతా చానెళ్ల స్థితీ గతీ అంటారా..? అది మరోసారి చెప్పుకుందాం…))
Share this Article