మంచి సినిమాల్లో నటించినవాడే… డౌన్ టు ఎర్త్ మనిషే… సుప్రీం హీరో పోకడలు గాకుండా మనలో ఒకడిగా కనిపిస్తాడు… ఎదవ్వేషాల వార్తలు కూడా తక్కువే… అదే, సూపర్ సుప్రీం మెగా పవర్ బంపర్ కాస్మో స్టార్ రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్… రచయిత, సింగర్, యాక్టర్… తను ఈ సినిమాలో హీరో… అందమైన మాళవిక మోహనన్ హీరోయిన్… పాపులర్ సముద్రఖని కూడా ఉన్నాడు…
మధ్యలోనే దర్శకుడు కార్తీక్ నరేన్‌కు ఎందుకోగానీ చిరాకెత్తింది… మెగాఫోన్ పక్కన విసిరేసి వెళ్లిపోయాడు… తరువాత ధనుషే మిగతా సినిమా పూర్తి చేశానననిపించాడట… ఇది పాన్ ఇండియా సినిమా కాదు… అలాగని కేవలం తమిళ సినిమా కూడా కాదు… సౌత్ పాన్ ఇండియా సినిమా… అంటే మలయాళం, కన్నడం, తమిళం, తెలుగు భాషల సినిమా అన్నమాట… పేరు మారన్… (తమిళ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టడం లేదు కదా, చిత్ర విచిత్రమైన అనర్థపు, సారీ, అర్థం కాని పేర్లను అలాగే ఉంచేయడం ట్రెండ్ కదా… ఈ మారనుడి పేరును కూడా అలాగే ఉంచేశారు…)
ఫాఫం… థియేటర్లలో రిలీజ్ చేయడానికి సాహసించలేదో, ధైర్యం చాలలేదో తెలియదు, లేక ఓటీటీ వాడే ఆంక్ష పెట్టి కాస్త ఎక్కువ ధర పెట్టాడో తెలియదు గానీ… నాలుగు భాషల్లో హాట్ స్టార్‌లో రిలీజ్ చేశారు… ఢామ్… ఎవడూ పట్టించుకోలేదు… చూసినవాడు బెంబేలెత్తిపోయాడు… డబ్బు తిన్న తెలుగు సైట్లు తమ సహజమైన శైలిలో సిగ్గూశరం వీసమెత్తు కనిపించకుండా 3.5, 3 రేటింగ్స్ ఇచ్చి, ఫ్యామిలీతో చూడదగిన చిత్రరాజం అని వాగాయి… కొందరు మాత్రం దీనికి ఒకటి రేటింగ్ ఇచ్చినా ద్రోహం చేసినట్టేనని నిజాయితీని ప్రదర్శించారు…
Ads
ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు… ఓ అవినీతి పొలిటిషియన్… సదరు నాయకుడి చీకటి కోణాల్ని వెలికితీసే కథ… (జర్నలిజంలోని అవినీతిని తవ్వే రాజకీయనాయకుడి పాత్ర ఎవరైనా పోషిస్తే, సినిమా తీస్తే బాగుండు… సమాజానికి ఇప్పుడు ఇదే అవసరం నిజానికి…) అప్పట్లో రంగం అని ఓ సినిమా వచ్చింది కదా… దాన్నే కాస్త ఇటూఅటూ తిప్పి తీసినట్టుంది…
కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నటన, కెమెరా, బీజీఎం మన్నూమశానం… ఏ అంశంలోనూ ఏ నిపుణుడూ పట్టించుకోలేదు పాపం… నిర్మాతలు పరిగె ఏరుకున్నట్టుగా టీవీ రైట్స్ అమ్మేసుకున్నారు… కాదు, కాదు, ఓటీటీ రైట్స్ కొనుక్కున్న హాట్ స్టార్ వాడే తమ స్టార్ చానెళ్లలో ప్రసారం చేయాలని అనుకున్నాడు… తెలుగులోకి వచ్చేసరికి స్టార్‌మా టైమ్ స్పేస్ వాల్యూ ఎక్కువ కదా… ఈ తొక్కలో సినిమాకు రెండు గంటల టైమ్ స్లాట్ వేస్ట్ అనుకున్నాడు…
ఎలాగూ వరుసగా సినిమాల్ని ప్రసారం చేసే స్టార్‌మా మూవీస్ చానెల్ ఉంది కదా… అందులో ప్రసారం చేశాడు… 24 జూన్, శుక్రవారం, సాయంత్రం ఆరు గంటలకు సాహసించి ప్రసారం చేసేశాడు… (ఆదివారం కూడా కాదు… చివరకు ఆ మూవీస్ చానెల్‌లో సండే రిలీజ్‌కు కూడా పనికిరాలేదు సినిమా…) జనం ఇక్కడా థూఛీఫో అన్నారు… ఎవ్వడూ దేకలేదు… ఫలితంగా… 1.83 రేటింగ్ వచ్చింది… అంటే అత్యంత నికృష్ట, దయనీయమైన రేటింగ్ అన్నమాట… అదండీ సంగతి…
స్టార్ హీరో అయితే ఎవడిక్కావాలి..? స్టారాధిస్టారుడి అల్లుడైతే ఎవడిక్కావాలి..? అందులో హీరోయిన్ అందచందాలు ఎవడిక్కావాలి..? ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తే ఎవడిక్కావాలి..? పాన్ సౌతిండియా సినిమా అయితే ఎవడిక్కావాలి..? కథలో దమ్ముండాలి… లేకపోతే ఓటీటీల్లో ఎవడూ చూడడు… టీవీల్లోనూ ఎవడూ చూడడు అని చెప్పడానికి ఈ మారన్ రిజల్టే పెద్ద ఉదాహరణ…!!
మరీ వైరాగ్యంతో నవ్వుకోం అంటే మరో సినిమా సంగతి చెప్పాలి… శ్రీవిష్ణు హీరోగా నటించిన భళా తందనాన అనే సినిమాలో హీరోయిన్ కేథరిన్, ఫాఫం ఆ సినిమాలో ఆమె కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టే… దీన్ని కూడా హాట్ స్టార్ వాడే కొన్నాడు… (సినిమా సూపర్ బంపర్ డిజాస్టరే…) 19 జూన్, సండే… మాటీవీలోనే ప్రసారం చేశారు… విచిత్రంగా ఆఫ్ పీక్ అనగా, నాన్ ప్రైమ్ టైమ్ సాయంత్రం 3 గంటలకు… దాని రేటింగ్స్ తెలుసా..? 1.51… సినిమాల టీవీ ప్రసార రేటింగుల్లో పరమ దరిద్రాతిదరిద్రమైన రిజల్ట్…!!
Share this Article