హిందీ మన మాతృభాష కాదు… పైగా మన తెలుగువారికి లేదా దక్షిణ భారతీయులు హిందీ మాట్లాడినా, పాడినా మన యాస వద్దన్నా వినిపిస్తూ ఉంటుంది… అన్నింటికీ మించి హిందీ సంగీతంలో మనవాళ్ల ఉనికిని, ప్రగతిని నార్త్ ఇండియన్స్ అస్సలు సహించరు… ఈ యాసను సాకుగా చెబుతారు… కానీ ఆ రోజులు పోయినయ్… హిందీ మాతృభాషగా కలిగిన సింగర్స్‌ను మనవాళ్లు కొట్టేస్తున్నారు, పక్కకు నెట్టేస్తున్నారు… వాళ్లను మించి మనవాళ్లు పాడుతున్న తీరు చూస్తుంటే… పాటల పోటీల్లోని న్యాయమూర్తులే నోళ్లు వెళ్లబెట్టి చప్పట్లతో ముంచెత్తుతున్నారు… ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకోవడం అంటారా..,?
మొన్న ఓ తమిళ అమ్మాయి ఆర్యానంద బాబు హిందీ సంగీత వేదిక దుమ్ముదులిపి… జీ5 వాళ్ల సరిగమప లిటిల్ చాంపియన్స్ ట్రోఫీ ఎగరేసుకుపోయిన తీరు చెప్పుకున్నాం కదా…. ఇదీ లింకు…
పిల్ల కొంచెం- పాట ఘనం..! ఉత్తరాది సంగీతాన్నీ దున్నేస్తోంది..!
Ads
మరొకటి కచ్చితంగా చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది… హిందీ పాటల పోటీలో అందరూ ప్రధానంగా చెప్పుకునేది సోనీ వాళ్ల ఇండియన్ ఐడల్ పోటీ… జాతీయ స్థాయిలో వర్ధమాన గాయకులు పోటీ పడుతుంటారు… ఖతర్నాక్ పోటీ… ప్రస్తుతం 12వ సీజన్ నడుస్తోంది… టాప్ 15 సింగర్స్‌లో మన వాళ్లు ఇద్దరు… విశాఖపట్టణానికి చెందిన ఆ ఇద్దరూ అమ్మాయిలే… ఒకరు షుణ్ముఖప్రియ.,. మరొకరు భాగవతుల శిరీష… ఇద్దరూ తమ ప్రతిభతో దుమ్మురేపుతున్నారు…
తమ స్వరం మీద పట్టు సూపర్బ్… ఇద్దరి పాటలకూ మంచి ఆదరణ లభిస్తోంది… షణ్ముఖప్రియను చూస్తూ ఓ జడ్జి ‘‘మొదటిసారి ఫిమేల్ ఇండియన్ ఐడల్’’ గెలుస్తుందేమో అని వ్యాఖ్యానించాడు అంటే అర్థం చేసుకోవచ్చు…
నిజానికి ఇండియన్ ఐడల్ మనకు కొత్తేమీ కాదు… మొదట సీజన్-2లో మన కారుణ్య ఫస్ట్ రన్నరప్ అయ్యాడు… సహజంగానే హిందీ ప్రేక్షకులు హిందీ మాతృభాష కలిగిన వాళ్లకే వోట్లేస్తుంటారు… వాళ్ల సంఖ్య అధికం… దక్షిణాది ప్రజలు ఈ షో పెద్దగా చూడరు, వోట్లు వేయరు… అదీ కారుణ్యకు శాపం… కానీ ఐదో సీజన్ వచ్చేసరికి మన మైనంపాటి రామచంద్ర దీన్ని బ్రేక్ చేశాడు… ట్రోఫీ ఎగరేసుకుపోయాడు…
అంతేకాదు, తొమ్మిదో సీజన్ వచ్చేసరికి మనవాళ్లు మరింత మ్యాజిక్ చేశారు… మన రేవంత్ ట్రోఫీ ఎగరేసుకుపోగా… మన తెలుగు రోహితుడే సెకండ్ రన్నరప్ అయ్యాడు… ఇండియన్ ఐడల్ ట్రోఫీ ఆప్టరాల్ అంటూ ఉఫ్ అని ఊదేసే రేంజ్… ఇప్పుడు ఇద్దరు అమ్మాయి టాప్ కంటెస్టెంట్లు… ఏమో, షణ్ముఖప్రియ ఈ ట్రోఫీని గెలిచే తొలి ఫిమేల్ గాయని అవుతుందేమో…
ప్రతి సంగీత పరికరాన్ని వాయించడంలో ప్రతిభ ఉన్న శ్రీనివాసకుమార్… శాస్త్రీయ సంగీతంలో ఎంఏ చేసిన రత్నమాల… తమ బిడ్డ షుణ్ముఖప్రియకు పేరెంట్సే కాదు, టీచర్లు కూడా..! అయిదారేళ్ల వయస్సు నుంచీ షణ్ముఖ పాడుతూనే ఉంది… చిన్నప్పుడు జీతెలుగు సరిగమప లిటిల్ చాంపియన్స్ మొదలుకొని, పాడుతా తీయగా, సూపర్ సింగర్, జీ సరిగమప, వాయిస్ ఆఫ్ ఇండియా కిడ్స్… వాట్ నాట్..? ఇంతకుముందు తనది చిన్నపిల్ల గొంతు… ఈమధ్య మెచ్యూర్డ్ వాయిస్ వచ్చేసింది… పైగా అలుపెరగని సాధన…
ప్రతి వేదిక ఎక్కాల్సిందే… హోరెత్తిపోవాల్సిందే… మొన్న ఇండియన్ ఐడల్ వేదిక మీద హమ్మా హమ్మా అని పాడుతుంటే మొత్తం ఆ ప్రాంగణమంతా ఊగిపోయింది… ఆ గొంతును మారుస్తూ, స్వరం మీద బ్రహ్మాండమైన పట్టుతో ఆమె ఆలపిస్తుంటే అందరూ లేచినిలబడి చప్పట్లతో ముంచెత్తారు… ప్రస్తుతం ఆమె వయస్సు 17 ఏళ్లు…
ఈమె భాగవతుల శిరీష… వయస్సు 26 ఏళ్లు… తెలుగు, తమిళ, హిందీ రియాలిటీ షోలు ఈమెకు కొత్తేమీ కాదు… షుణ్మఖప్రియతో పోలిస్తే ఈమె మెలొడీ బాగా పలికించగలదు… పైగా అనుభవం ఎక్కువ… స్వస్థలం మచిలీపట్నం… కొద్దికాలం లెక్చరర్‌గా పనిచేసినట్టుంది… తరువాత ఇక పాటల్నే కెరీర్‌గా ఎంచుకుంది… విజయ్ టీవీ వాళ్ల తమిళ సూపర్ సింగర్-6 లో అదరగొట్టేసి రెహమాన్ ప్రశంసల్నీ పొందింది… తల్లి పేరు బాల, తండ్రి పేరు మూర్తి… ఇద్దరిలో ఎవరు ట్రోఫీ కొట్టినా సంతోషమే… కొట్టకపోయినా సరే, అక్కడి దాకా చేరారు కదా… కానీ ఎవరెవరో తెలుగు సరిగ్గా పలకలేని ‘ఘోషాలు, భాషకు అరిగోసలు గాకుండా… వీళ్లతో మన పాటలు పాడిస్తే అదే ఆనందం… మన చెవుల్లోనూ మాధుర్యం…!
Share this Article