Sai Vamshi ……….. Facebookలో సినిమా రివ్యూలు – రకరకాల మనుషులు (Disclaimer: (ఇది నా అబ్జర్వేషన్‌తో సరదాగా రాసింది. ఎవర్నీ ఉద్దేశించింది కాదు. కాబట్టి ఏకీభవించినా, విభేదించినా చివరిదాకా హాయిగా చదవొచ్చు).
1) రాయని భాస్కరులు: వీళ్లు సినిమాలు చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత తమ పనుల్లో బిజీ అయిపోతారు. సినిమా చూశాక రివ్యూ రాయాలన్న ఆశ, ఆలోచన లేని సగటు జీవులు.
2) నా ఇష్టం: వీళ్లు ఎవరికీ లొంగరు. ఏ భావజాలానికీ చెందరు. సినిమా నచ్చితే నచ్చిందని రాస్తారు. నచ్చకపోతే నచ్చలేదని రాస్తారు. సూటిగా, నిర్మొహమాటంగా చెప్తారు.
Ads
3) అంతా మన మంచికే: వీళ్లు ఆశాజీవులు. అన్నింటిలోనూ మంచి చూడగలరు. అంతా మన మంచికే అనుకోగలరు. ఎంత దారుణమైన సినిమాలోనైనా ఎంతోకొంత మంచి ఉండకపోదా అన్న ఫీలింగ్‌తో ఉంటారు. ఆ తరహాలోనే రివ్యూ రాస్తారు.
4) టక్కరి దొంగలు: ‘నలుగురికి నచ్చినది.. నాకసలే ఇక నచ్చదురో’ పాట గుర్తుందా? వీళ్లు టక్కరి దొంగలు. అందరూ బాగుంది అన్న సినిమాలోని తప్పుల్ని వీళ్లు వెతికి పట్టుకొని రివ్యూ రాస్తారు. ఎవరికీ నచ్చలేదు అన్న సినిమాలో ఏం బాగుందో చెప్పాలని తాపత్రయపడతారు. వీళ్లో రకం.
5) సంప్రదాయవాదులు: వీళ్లు చాలా సినిమాలు చూస్తూ ఉంటారు. కానీ రివ్యూలు మాత్రం కొన్నే రాస్తారు. అదీ తమకు నచ్చిన దర్శకుడు/నటుడు తమ నచ్చిన పద్ధతిలో తీసినప్పుడు మాత్రమే రివ్యూ రాస్తారు. తెగ పొగుడుతారు. లేకపోతే రివ్యూల జోలికి పోనేపోరు.
6) ఒకే ఒక్క ఛాన్స్: వీళ్లు ‘ఖడ్గం’ సినిమాలో సంగీత గారి చుట్టాలు. రివ్యూలు తెగ రాస్తూ ఉంటారు. ఏదో ఒక రివ్యూను ఎవరో ఒక సినీ దర్శకుడు చూడడా? తమని పిలవడా? రైటర్‌గా ఛాన్స్ ఇవ్వడా అనే ఆలోచనలో ఉంటారు. ఈ పద్ధతి పాటించడం ద్వారా సినిమా పరిశ్రమలోకి వెళ్లినవారూ ఉన్నారు.
7) దోస్త్ మేరా దోస్త్: తమ స్నేహితులు, పరిచయస్తులు సినిమా తీస్తే తప్ప వీళ్ల నుంచి మనం రివ్యూ ఆశించలేం! అప్పుడు మాత్రమే వీళ్లు రివ్యూ రైటర్ అవతారం ఎత్తుతారు. మిగిలిన వేళల్లో ఎంత గొప్ప సినిమా వచ్చినా స్పందించరు. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అనుకునేవాళ్లు వీళ్లు.
అయోమయ చక్రవర్తులు: వీళ్లు సినిమా చూస్తారు. నచ్చదు. రివ్యూ రాయాలని అనుకుంటారు. సడన్‌గా ఆ సినిమా తమకు నచ్చిందంటూ నాలుగైదు రివ్యూలు కనిపిస్తాయి. వీళ్లు అయోమయంలో పడతారు. తమ జడ్జిమెంట్ తప్పేమో అనుకుంటారు. సినిమాని సరిగ్గా చూడలేదని భావించి రివ్యూ రాయడం మానేస్తారు.
9) భావజాలీకులు: తాము నమ్మే భావజాలానికి అనుకూలంగా సినిమా వచ్చిందా, రివ్యూ రాస్తారు. తమ భావజాలానికి వ్యతిరేకంగా సినిమా వచ్చిందా, రివ్యూ రాస్తారు. ఈ రెండు సందర్భాల్లో మినహా మిగిలిన వేళల్లో సైలెంట్‌గా ఉంటారు. తమ భావజాలాన్ని కాపాడే సినిమాల మీదే దృష్టి నిలుపుతారు. వాటినే ప్రచారం చేస్తారు.
10) థియేటర్ రచయితలు: సినిమా థియేటర్‌లో ఉండగానే వీళ్ల మస్తిష్కంలో రివ్యూ తయారైపోతుంది. ఎలా మొదలు పెట్టాలి? ఎలా పూర్తి చేయాలి? ఎవర్ని పొగడాలి? దేన్ని విమర్శించాలి? ఇలా అన్నీ అక్కడే ఆలోచించి పెట్టుకుంటారు. ఇంటర్వెల్‌లో రివ్యూ రాసినా రాసేస్తారు. సెకండాఫ్ అంతా సినిమా చూడ్డం మానేసి తమ పోస్ట్‌కి వచ్చిన లైకులు, కామెంట్లు చూస్తూ కూర్చుంటారు.
11) (అతి) విశ్లేషకులు: సినిమాలో హీరో వెనకాల గోడకు వేసిన రంగు దగ్గర్నుంచి, హీరోయిన్ చేతిలో నోట్‌బుక్ దాకా అన్నీ విశ్లేషించే టాలెంట్ ఉన్నవాళ్లు వీళ్లు. ప్రతి షాట్‌ని వివరిస్తారు. ప్రతి సన్నివేశాన్ని విడమరిచి చెప్తారు. తీసిన దర్శకుడు, రాసిన రచయిత కూడా ఊహించని విషయాలను ఆ సినిమాలో ఉన్నట్టు కనిపెడతారు.
12) మన కులపోడే బ్రో: తమ ప్రాంతం/కులానికి చెందిన హీరో/దర్శకుడి సినిమా చూడగానే వీళ్లలో అప్పటిదాకా లేని రచయిత బయటికొస్తాడు. కొత్త కొత్త పదాలు వెతికి మరీ రివ్యూ రాస్తారు. అలా రాయడం ఒక సేవలాగా భావిస్తారు. తమ ప్రాంతం/కులానికి చెందినవారు మాత్రమే అలాంటి అద్భుతమైన సినిమా తీయగలరని బలంగా నమ్ముతారు.
13) కృష్ణవంశీ గారి అనుచరులు: ‘సినిమా విడుదలయ్యాక వారం ఆగి రివ్యూ రాయండి’ అని దర్శకుడు కృష్ణవంశీ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మాటను మనసా వాచా కర్మణా నమ్మినవారు వీళ్లు. సినిమా విడుదలైన వారం తర్వాతే రివ్యూ రాస్తారు. అప్పటిదాకా గుర్తుంటే ఓకే, లేకపోతే రివ్యూ సంగతే మర్చిపోతారు.
14) Late Comers: సినిమా చూస్తారు. రివ్యూ రాయాలని అనుకుంటారు. ఏదో పని పడుతుంది. రివ్యూ రాయడం వాయిదా వేస్తారు. అలా రోజులు గడిచిపోతాయి. వారం తర్వాత గుర్తొస్తుంది. వీలైతే రాస్తారు. లేకపోతే లేదు. ఒక్కోసారి నెలల తర్వాతా రివ్యూ రాస్తారు.
15) తోడు కోసం వెతుకులాట: సినిమా చూస్తారు. నచ్చదు. కానీ ఆ విషయం బయటకు చెప్పలేరు. లోపలే దాచుకుంటారు. ఎవరైనా ఆ సినిమా నచ్చలేదని రాశారా అని వెతుకుతుంటారు. ఆ పోస్ట్ దొరగ్గానే కింద కామెంట్లు చదువుతారు. ఫర్లేదు అని ధైర్యం వచ్చాక అక్కడే తమ రివ్యూ రాయడం మొదలుపెడతారు.
16) పోలికల పోతురాజులు: వీళ్లకు పోలికలు తేవడం ఇష్టం. సినిమా చూశాక, ఈ సన్నివేశం గతంలో ఫలానా హిందీ సినిమాలో ఉంది, ఈ కథ ఫలానా కొరియన్ సినిమాలో ఉంది అంటూ రివ్యూ రాస్తారు. వారు చెప్పేది నిజమా? లేక ఊరికే ఓ రాయి విసిరారా అనేది కనిపెట్టడం కష్టం.
17) కళామతల్లి ముద్దుబిడ్డలు: సినిమాల మీద ఈగను కూడా వాలనివ్వని మనుషులు వీళ్లు. ఎవరైనా ఏదైనా సినిమా గురించి నెగెటివ్‌గా రాస్తే, “మీరు తీసి చూపించండి సినిమా! సినిమా అనేది ఒక గొప్ప కళ. శ్రమ. వందలాది మందికి అన్నం పెట్టే అన్నపూర్ణ” అని భారీ డైలాగులు చెప్తారు. వీళ్లలో చాలామంది సినిమా రంగానికి ఏదో రకంగా లింక్ అయి ఉంటారు.
18) అన్న రివ్యూ రాస్తే మాస్: తమ రివ్యూకు ఏదో గొప్ప మహత్తు ఉందని, తాము రివ్యూ రాయడం ఆ సినిమా బృందం చేసుకున్న అదృష్టం అని భావించే జనాలు వీళ్లు. వీళ్ల దృష్టి అంతా సినిమా మీదకంటే తమ మీదా, తమ రాత మీదే అధికంగా ఉంటుంది. చాలా సెలెక్టివ్ సినిమాలకే రివ్యూ రాస్తారు.
19) క్వశ్చన్ బ్యాంక్: వీళ్లు రివ్యూ రాస్తున్నాం అనుకుంటూ ప్రశ్నాపత్రం రాస్తారు. సినిమాలో హీరో ఇలా ఎందుకు మాట్లాడాడు? హీరోయిన్ ఆ బట్టలు ఎందుకు వేసుకుంది? కమెడీయన్ ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడు? సంగీతం ఇలా ఎందుకు ఉంది? ఇలా వందరకాల ప్రశ్నలు వేస్తారు. చదివినవారు తమకు తోచిన సమాధానాలు చెప్పగానే అవి ఆ సినిమా దర్శకుడు, హీరోనే వచ్చి చెప్పినట్టు సంబరపడుతుంటారు.
20) సాంస్కృతిక పరిరక్షణ: ‘సినిమాలో మన సంస్కృతిని అద్భుతంగా చూపించారు. తెలుగుదనం ఉట్టిపడేలా తీశారు. సంప్రదాయాలకు పెద్దపీట వేశారు’ ఇలాంటి రివ్యూలు రాసేవాళ్లు వీళ్లు. ‘మిథునం’, ‘శతమానం భవతి’ లాంటి సినిమాలకు మాత్రమే రివ్యూ రాయాలని కంకణం కట్టుకున్న జనం వీళ్లు.
21) గోడ మీద పిల్లలు: సినిమా చూసిన తర్వాత వీళ్లకు ఏ అభిప్రాయం ఉండదు. ఫేస్‌బుక్‌లో రివ్యూలు చూశాకే ఒక అభిప్రాయానికి వస్తారు. ఇక్కడ బాగుందంటే నిజంగానే బాగుంది అనుకుంటారు. బాలేదంటే కూడా అవునేమో అనుకుంటారు. అన్ని రివ్యూలూ చదివి, ఒక అంచనాకు వచ్చి వాళ్లొక రివ్యూ రాస్తారు.
22) నలుగురిలో నారాయణ: ‘అందరూ రివ్యూ రాస్తున్నారా? అయితే మనకేం తక్కువ. మనమూ రాద్దాం’ అనుకుని రివ్యూలు రాస్తుంటారు వీళ్లు.
పీఎస్: నేనూ అప్పుడప్పుడూ రివ్యూలు రాస్తుంటాను. ఎక్కువగా 13, 14.. అప్పుడప్పుడూ 18 కేటగిరీల్లో ఉంటాను.
Share this Article