Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు ‘ఉదయం’ అనే ఆ కొత్త అగ్గి రాజేసిందే ఆ ఈనాడు రామోజీరావు…

December 30, 2023 by M S R

Taadi Prakash………..   తెలుగు జర్నలిజంలో వికసించిన విద్యుత్తేజం.! ‘ఉదయం’ వచ్చి నేటికీ 40 ఏళ్లు ….. 1984 – డిసెంబర్‌ 29 … అదొక ప్రత్యేకమైన రోజు.. కొన్ని వందలమంది జర్నలిస్టులకు `రెడ్‌లెటర్‌డే! ‘ఉదయం’ అనే పేరుతో ఒక దినపత్రిక ప్రారంభం అయిన రోజు. నేటికి నలభై ఏళ్లు.!

కొద్ది మందిని మినహాయిస్తే ఆ ఏడాది మొదటినించీ మేమంతా వేడి టీలు తాగి, సిగరెట్లు కాల్చీ, సాయంత్రాలు మందు తాగి, వేడివేడి చర్చలు జరపడం వల్లనేమో మరి, డిసెంబర్లో ‘ఉదయం’ రావడం రావడమేతోనే అగ్గి పుట్టించింది.

‘అదేమిటి …ఈ మూల స్త్రీల కోసం మూలుగుతున్నారు! రండి బైటకి …చూడండి హృదయాల మీద పెంకులు పేలిపోతున్నాయి’ అని గుడిపాటి వెంకట చలాన్ని శ్రీశ్రీ అన్నట్టుగానే, తెలుగు జర్నలిజంలో పురాతన సంప్రదాయ ఖాండవదహనం నిజంగా మొదలైంది ఆరోజునే. ఓ కొత్త చూపు, కొత్త రూపు, ఒక తెగింపు, కట్టలు తెంచుకున్న ఆవేశం, ఒకటే దూకుడు … కళ్ళు మిరుమిట్లు గొలిపే ఛటఛ్ఛటా … వెలుగులతో ఒక తెలుగువాక్యం. మంచో చెడో తర్వాత చూసుకుందాం. ముందు దాడి చేద్దాం… విరుచుకు పడదాం! దేనికి?

Ads

ఒక నిజం చెప్పడానికి! వ్యధల్ని చించి సుధల్ని పంచడానికి. జనం ముందు వాస్తవాల్ని, అవి ఎంత చేదైనా, ఎన్ని కన్నీళ్లయినా నిర్భయంగా పరవడానికి, ఒక ఆత్మానందాన్ని ముకుమ్మడిగా సెలబ్రేట్‌ చేసుకోవడానికి! ఉరకలెత్తే ఉత్సాహమూ, ఉద్రేకమూ తప్పితే అతి తక్కువ డబ్బులున్న, అసలు పది రూపాయలు కూడా లేని పవిత్రమైన రోజులవి. ఒకే ఒక్క వేడివేడి వన్‌ బై టు చాయ్‌, ఒక సిగరెట్‌లో ఎంత మేజిక్‌ వుంటుందో తెలుసా మీకు?

ఏమిటో ఆ మ్యాజిక్‌.? ఆ పిచ్చి టీని , మహా రచయిత పతంజలి గారితో తాగడం, ఆర్టిస్ట్‌ మోహన్‌తో కలిసి సిగరెట్‌ కాల్చడం, కవి దేవీప్రియతో కబుర్లు కొట్టడం, కొమ్మినేని వాసుదేవరావు గారు మా భుజాల మీద చెయ్యేసి నడవడం… అండ్‌ ఫైనల్లీ, ఎడిటర్‌ ఏబీకే ప్రసాద్‌ ఒక కాంతిరేఖలాగా దూసుకొచ్చి ‘ఇలా చెయ్యండ్రా అబ్బాయ్‌’ అని ప్రేమగా చెప్పడం. పగలు రాయడం, మేలురకం వార్తలను గుర్తించడం, రేపటి కోసం కొత్త ‘ఉదయాన్ని ‘ ప్రొడ్యూస్‌ చేయడం. అదొక్కటే జీవితంలా బతికిన రోజులవి.

అందరం కలిసి పని చేయడం అనే ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీని ఎలాంటి భేషజం లేకుండా నెరవేర్చడం.! మేనేజింగ్ డైరెక్టర్ కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ నుంచి కంపోజర్లు , ఫొటోగ్రాఫర్లు , రిపోర్టర్లు , జిల్లాల్లో చిన్న విలేకర్లు , మెషీన్ ఆపరేటర్ ల నుంచి మార్కెటింగ్ మేనేజర్ ల దాకా ఒక ఉద్యమంలా పనిచేసిన వుజ్వలమైన రోజులవి . దించిన తల ఎత్తకుండా సంపాదకీయం రాసే ఏ బీ కే . రన్నింగ్ కామెంటరీ రాస్తూ దేవీప్రియ , బొమ్మ వెంట బొమ్మ వేస్తూ ఆర్టిస్ట్ మోహన్ , వరసబెట్టి స్పోర్ట్స్ వార్తలు రాస్తూ వెంకటేష్ , రాస్తూ , టీ తాగుతూ , ఉపన్యాసాలు ఇస్తూ పతంజలి సాబ్ …అదో జాతర … పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వరదలా వచ్చి పడుతుండగా

అటు తుఫాను..ఇటు ఉప్పెనలా.. హైదరాబాద్‌, విజయవాడ ఎడిషన్లు రెండూ ఒకే రోజు మొదలయ్యాయి. కేంద్రంలో కాంగ్రెస్ అద్భుతం విజయం . రాష్ట్రంలో ఎన్టీఆర్ విజయ ప్రభంజనం ఫలితాలతో ఉదయం తొలి సంచిక విడుదలైంది.జనం వహ్వా అన్నారు . ఇంతకీ ఈనాడు పెట్టి అక్షర విప్లవం తెచ్చిన రాక్షసుడు రామోజీరావే ‘ఉదయం’ కూడా పెట్టాడని తెలుసా?

ఈ తెర వెనుక కథ చాలామందికి తెలిసిందే. ఈనాడులో రెండేళ్లు పని చేసిన ఏబికే ప్రసాద్‌, పర్సనాలిటీ క్లాష్‌ వల్ల, రామోజీమీద కోపంతో బైటికి వెళ్లిపోయారు. 1973 లోనే దాసరి నారాయణరావు గుర్తింపు పొందినా,1980 తర్వాత కూడా హిట్టు మీద హిట్టు కొడుతూనే ఉన్నాడు. సంచలన దర్శకునిగా హారతులందుకుంటున్నాడు.

నేనప్పుడు ఈనాడులో పని చేస్తున్నాను. సినిమా పేజీలో దాసరి పేరు వుండకూడదని మాకు ‘పైనుంచి’ ఆదేశం. రాబోయే దాసరి సినిమా గురించి వార్త వేసేవాళ్ళం. అందులో దర్శకుడు దాసరి నారాయణరావు అనే మాట పెన్నుతో కొట్టేసేవాళ్ళం. దాసరి ఫోటో గానీ, పేరుగానీ ‘ఈనాడు’లో రావడానికి వీల్లేదు. ఇలా రామోజీరావు అనే దురుసు మనిషి వల్ల గాయపడిన ఏబీకే, దాసరి ఒక మంచి రోజున కలుసుకున్నారు. ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నారు. అక్కడే ‘ఉదయం’ అనే దినపత్రికకు అంకురార్పణ జరిగింది.  కనుక ఉదయం ఘనంగా రావడానికి ఉత్తేజం మహానుభావుడైన రామోజీ రావే కదా!

చేదుగా వున్నా కొన్నిటిని ఒప్పుకొని తీరాలి. ఉదయం…ఈనాడుకి తేడా ఏమిటి? 1974 ఈనాడు – 1984 ఉదయం.. ఒక దశాబ్దం.. చరిత్ర సృష్టించిన రెండు విప్లవాలు! సనాతన తెలుగు జర్నలిజం సంకెళ్ళని బ్రేక్‌ చేసింది ఈనాడు. వార్త రాయడంలో ప్రెజెంట్‌ చేయడంలో, పేజీ లేఅవుట్‌లో, మార్కెటింగ్‌లో, ప్రజల ఆశలకు ప్రతిరూపంగా ఉండడంలో ఈనాడు దినపత్రిక కళ్ళు చెదిరే ఒక కొత్త మార్గాన్ని డిస్కవర్‌ చేసింది. అద్భుతమైన విజయం సాధించింది.

1982 రానే వచ్చింది. ఈనాడు సూపర్‌ సక్సెస్‌తో కింగ్‌నైనా, కింగ్‌ మేకర్నీ అయినా నేనే కదా అనే గర్వాతిశయంతో వున్న రామోజీరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని అరచేతిలో పెట్టుకోవాలని ఆశపడ్డారు. అరాచకపు కాంగ్రెస్‌ కంటే, సొంత పార్టీ పెట్టుకుంటే పోలా.. అనుకున్నారు. బలంగా వీస్తున్న ఈ గాలికి నిప్పులాంటి మనిషి ఎన్టీ రామారావు తోడయ్యారు. స్వార్ధ ప్రయోజనాలే అతి ముఖ్యం అని తలచిన రామోజీ, జర్నలిజం అనే దాన్ని తియ్యని మిఠాయి పొట్లంగా మార్చి, ‘తక్షణం ఎన్టీ రామారావునే వాడండి’ అనే ఒక యాడ్‌ ఏజెన్సీగా ‘ఈనాడు’ను మార్చేశారు. ప్రాపగండా కరపత్రంగా మారిన ఈనాడు గత కాలపు వెలుగుని కోల్పోయింది.

ఆ దశలోనే ఉదయం దూసుకొచ్చింది. ప్రతిపక్షపాత్రని సమర్ధంగా పోషించింది. ఈనాడు కొందరి మీద కక్షగట్టింది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలపై పగ పట్టింది. కొందరు నాయకుల పేర్లు ఈనాడులో ప్రస్తావించడాన్ని నిషేధించింది. అలాంటి అభాగ్యులకూ, బాధితులకు ‘ఉదయం’ వేదికగా విరాజిల్లింది.

క్రమంగా ఈనాడు ఒక కుల ప్రయోజనాల్ని రక్షించే బాధ్యతని నెత్తికెత్తుకుంది. ఉదయానికి ఎలాంటి హేంగోవర్లు, గట్టి కమిట్‌మెంట్లు లేవు. దాసరి సినిమాల పబ్లిసిటీకి ఉపయోగపడాలి. మంచి పత్రిక తెచ్చి, ముచ్చెమటలు పట్టించి రామోజీని గడగడలాడిరచాలని ఏబికే పట్టుదల. ఎలాగూ దాసరి కాంగ్రెస్‌ అనుకూలుడు. ఎన్టీ రామారావుతో సినీ స్నేహమూ వుంది. ఉదయం ఇన్‌స్టెంట్‌గా సక్సెస్‌ కావడం వెనక కొన్ని ప్రధాన కారణాలు. ఒకటి : అలవిమాలిన టాలెంట్‌తో శక్తివంతమైన వాక్యం రాయగల అనేక మంది జర్నలిస్టులు , రిపోర్టర్లు, ఎడిటర్లు!

రెండు : అవధుల్లేని స్వేచ్చ . ఇది వద్దు.. ఇది రాయకూడదు.. ఈ వార్త పక్కన పడేద్దాం… అనే ఆంక్షలు లేవు. సత్యమూర్తి (శివసాగర్‌) కవిత్వం అయినా, కొండపల్లి శీతారామయ్య ఇంటర్‌వ్యూ అయినా, ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్‌ అక్రమాలైనా , ఎన్టీ రామారావుని ఉతికి ఆరేయడం అయిన నో అబ్జెక్షన్ ! ఈ కొత్తదనాన్నీ, కెరటాలైౖ దూకే ఉత్సాహాన్ని, రగులుతున్న యువ రక్తాన్ని` ఒక శ్రద్ధతో, క్రమశిక్షణతో, నిద్రలేని రాత్రుల నిబద్దతతో ముందుండినడిపిన కమేండర్‌ ఇన్‌ చీఫ్‌ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్‌ అనే ఏబికే .

మమ్మల్ని అందరినీ కలిపి వుంచింది.. ఇన్‌స్పైర్‌ చేసిందీ.. భుజం తట్టి ముందుకు నడిపిందీ ఏబీకే ఒక్కరే. ఆయనకి కుడి భుజంగా ఉన్న కొమ్మినేని వాసుదేవరావు గారొక్కరే. 1984 అంటే ఏబికే గారికి 50 సంవత్సరాలు. వాసుదేవరావు గారికి 47 ఏళ్లు ఉండొచ్చు. వీళ్ళిద్దరికీ తాగడం. సిగరెట్‌ కాల్చడం లాంటి అలవాట్లు సుతరామూ లేవు. కవులూ, రచయితలూ, జర్నలిస్టుల్లో యిలా వుండేవాళ్లు అతి కొద్ది మంది మాత్రమే. ఎప్పుడు చూసినా వీళ్ళు చదువుకోవడమూ, రిఫరెన్స్‌ బుక్స్‌ తిరగేయడమూ, వ్యాసాలో , సంపాదకీయాలలో రాసుకుంటూ వుండటం. అదొక కఠోరదీక్ష. అందువల్లనే వాళ్లు రెండు తరాల్ని ప్రభావితం చేయగలిగారు. చాలా మందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు.

విప్లవ సాహిత్య కేంద్రం ‘ఉదయం’

ఉదయం జర్నలిస్టుల్లో సీపీఐకి చెందిన వాళ్ళు, ఎక్కువగా పీపుల్స్‌వార్‌, ఇతర విప్లవ పార్టీలకు సంబంధించిన వాళ్ళూ వుండేవారు. వాళ్ళకి సాహిత్యంలో కవిత్వంతో పరిచయం వుండటం వల్ల మంచి వాక్యం రాయడంలో తగినంత అనుభవం వుండటం వల్ల వార్తలు, వ్యాసాలు, కామెంట్లు అర్థవతంగా, ఎఫెక్టివ్‌గా వుండేవి.

సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి హైదరాబాద్‌ బ్యూరో చీఫ్‌గా వుండేవారు. తాజా రాజకీయ వార్తలు వేగంగా యివ్వడం, వాటివెనక వుండే మతలబులు, స్వార్థప్రయోజనాల గురించి సాధికారికంగా రాయడంలో అయిన ఘనపాటి. తన టీమ్‌ని ముందుండి నడిపించగల సమ్మోహన శక్తి యాదగిరి. ఈజీగా, సరదాగా, జోకులు వేస్తూనే పనిరాబట్టుకునేవాడు.

దొంగ ప్రజాస్వామ్యం మీద అగ్రహోదగ్రుడైన కెఎన్‌వై పతంజలి రాసిన ‘పతంజలి భాష్యం’ అనే కాలమ్‌ బాగా పాపులర్‌ అయింది. ఆనాటికి పెద్ద పేరులేని నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాసిన కాలమ్‌ ‘పచ్చ నాకు సాక్షిగా’ సూపర్‌ హిట్టయింది. అబ్బూరి వరదరాజేశ్వరరావు గారి వరద కాలమ్‌లో అలనాటి అపురూప సాహిత్య కబుర్లు, ప్రసిద్ధ రచయితలు , కవుల ఇంటర్వ్యూలూ, చదువుకున్న మధ్యతరగతివారి మన్నన పొందాయి.

మణిశంకర్‌ అయ్యర్‌, కార్టూనిస్ట్‌ అబూ అబ్రహంల కాలమ్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. మరోపక్క ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం అనే ప్రమాదకరమైన ద్వారాన్ని సాహసంతో తెరిచింది ఉదయం. ప్రముఖులూ, పెట్టుబడిదారులూ, రాజకీయ నాయకుల అక్రమాలను ధైర్యంగా బయట పెట్టగలిగింది. ఆ తెగువనీ జనం ఇష్టపడ్డారు. కొన్ని నెలల్లోనే పత్రిక సర్క్యులేషన్ రెండులక్షలు దాటిపోయిందని అధికారిక లెక్కలు స్పష్టం చేశాయి.

ది ఫస్ట్‌ కంప్లీట్‌లీ కంప్యూటరైజ్డ్‌ దినపత్రిక ‘ఉదయం’ ఖరీదైన విదేశీ ప్రింటింగ్‌ మిషనరీ, తొలిసారి పూర్తిగా కంప్యూటర్లమీదే వార్తల కంపోజింగ్‌, అధునాతన కెమెరాలు, డిజిటల్‌ సిస్టమ్స్‌తో, టెక్నికల్‌ పర్‌ఫెక్షన్‌తో వచ్చిన తొలి అల్ట్రా మోడర్న్‌ దినపత్రిక.

ఆర్టిస్ట్‌ మోహన్‌, దేవిప్రియ కాంబినేషన్‌, అటు పతంజలి, కే.రామచంద్రమూర్తి, ఆర్వీ రామారావు, మాగంటి కోటేశ్వరరావు, సత్యనారాయణ, వసంతలక్ష్మి, తాడి ప్రకాష్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, తల్లావజుల శివాజీ లాంటి అనేకమంది ఆరితేరిన జర్నలిస్టులు, రిపోర్టర్లు ఉదయాన్ని తలెత్తుకునేలా చేయగలిగారు. ఏ దినపత్రిక అయినా సరే, డైలీ పేపర్‌ అనేది ఒక పెద్ద వ్యవస్థ. వందల, వేల మంది పనిచేయాలి. ప్రతిరోజూ ఒక పోరాటమే….  తాడి ప్రకాష్‌, 9704541559

udayam

((ఈ ఫోటో ఈటీవీ 20 వార్షికోత్సవం సందర్భంగా దాసరి ప్రధాన అతిథిగా హాజరైనప్పటి సందర్భానిది… వేదిక మీద అదే దాసరి, అదే రామోజీ… పేరు కూడా రాయనంత శతృత్వం స్థానంలో సాదర కలయిక…))

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions