‘‘ఆరేళ్ల బాలిక మీద లైంగిక దాడి… ఫిలిం నగర్ pocso కేసు బాధితురాలి వివరాలు బయట పెట్టేలా వార్తా కథనాలు… సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘనలపై మహిళా సంఘాల ఆగ్రహం… దినపత్రిక విలేకరి, పత్రిక యాజమాన్యంతో పాటు బాధ్యులపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ పోక్సో చట్టం కింద కేసు… కేసు విచారణ చేపట్టిన ఫిలిం నగర్ పోలీసులు…
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు… ఇలాంటి వారిపై పోలీసులు క్రిమినల్ కేసు పెట్టడం అభినందనీయం’’…. ఇదీ ఒక వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన వార్త… బాగుంది… అవసరమే అనిపించింది… అది చాలా చిన్న పత్రిక… ఆ పత్రిక పేరే కొత్తగా వింటున్నాను, సో, సదరు పత్రిక పేరు వద్దులే గానీ వార్త మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది…
ఎందుకు ప్రస్తావించుకోవాలీ అంటే… ఇలాంటి రాతలు మరే పత్రికలోనూ చోటుచేసుకోకుండా అందరూ మరోసారి జాగ్రత్తపడటానికి… పాత్రికేయంలో బాధ్యతల్ని, జాగ్రత్తల్ని, కోర్టు తీర్పుల్ని, నైతికతల్ని ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవడం అవసరమని గుర్తుచేయడానికి… ఇదీ ఆ వార్త క్లిప్పింగ్…
Ads
ఆ బాలిక ఎవరో పేరు రాయడమే కాదు, రాసిన తీరు కూడా జుగుప్సాకరంగా ఉంది… లైంగిక దాడి ఎలా జరిగిందో కూడా వర్ణించడం నీచం… పాత్రికేయంలో శిక్షణల్ని ఇప్పుడు ఊహించలేం, ఆ ప్రయాస కూడా ఏ మీడియా సంస్థ తీసుకోవడం లేదు… ఎవరుపడితే వాళ్లు జర్నలిస్టులు అయిపోతుండటం వల్ల దుష్పరిణామాలు ఇవి… కాలంతోపాటు ఇలాంటివి చూడటం దురదృష్టకరమే, కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రస్తావించుకోవడం ద్వారా ఇతర జర్నలిస్టులైనా కాస్త జాగ్రత్తగా వార్తలు రాస్తారని ఎక్కడో ఓ చిన్న ఆశ…
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అంశం ఇలాంటి వార్తల్లో బాలిక ఎవరో గుర్తుపట్టేలా రాస్తేనే క్రైమ్… అలాంటిది ఇక్కడ పేరు రాయడమే కాదు, సంబంధితులను కూడా గుర్తుపట్టేలా ఉంది వార్త… ఐతే సదరు జర్నలిస్టు, పత్రిక యజమానిపై ఏకంగా పోలీసులు పోక్సో కేసు పెట్టేయడం ఇంట్రస్టింగే… అది చాలా కఠినమైన చట్టం… సరే, పోలీసులు ఇంకా ఏయే సెక్షన్లను జతచేశారో వివరంగా తెలియదు… ( ఐపీసీ 228(ఏ), 23(2)ఆఫ్ పోక్సో యాక్ట్, 74 ఆఫ్ జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు పెట్టినట్టు సమాచారం)
కొత్తగా తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాసరెడ్డి ఇలాంటి దారుణాలపై ఎప్పటికప్పుడు స్పందించాలి… నిజానికి అకాడమీని ఏక వ్యక్తి నేతృత్వంలో పనిచేసే సంస్థగా గాకుండా ఇద్దరు ముగ్గురు సభ్యుల్ని కూడా అదనంగా నియమించి, క్వాసి జుడిషియల్ పవర్స్ ఉండే ఒక కమిషన్‌లా మారిస్తే బెటర్… అకాడమీ నిర్ణయాలకు ఆ వాల్యూ ఉంటేనే అది ఓ కొరడా పట్టుకోగలదు… ఇదుగో ఇలాంటి రాతలపై ఝలిపించగలదు..!!
Share this Article